పెరిగిన ఆర్టీసీ చార్జీలు

By Amar S Dec. 11, 2019, 08:36 am IST
పెరిగిన  ఆర్టీసీ చార్జీలు

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.. నష్టాల్లోవున్న ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో చార్జీలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా తగ్గింపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

గతంలో వున్న మినిమం చార్జీల విషయంలో ఎలాంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం ఒక స్టేజీకి, లేదా ఐదు కిలోమీటర్లలోపు ప్రయాణానికి మినిమం చార్జీ 5 రూపాయలు.. రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్లలోపు ప్రయాణానికి రూ.10 యథావిధిగానే ఉంచారు. 15 నుంచి 50 కిలోమీటర్లలోపు చార్జీలు ఉన్నవారికి మాత్రం మోత మోగనుంది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలకు పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం చార్జీలు పెంచలేదు. అంతేకాకుండా, సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

పల్లెవెలుగు బస్సుల్లో మొదటి 2 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపుదల వర్తించదు. పల్లెవెలుగు బస్సుల్లో తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 పెంచుతున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. డీజిల్ ధర గత నాలుగేళ్లలో లీటర్ ఒక్కింటికి రూ.49 నుంచి రూ.70కి చేరిందని, డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థకు ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోందని వివరించింది. బస్సుల విడిభాగాలు, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల మేర భారం పడుతోందని తెలిపింది. ఈ క్రమంలో చార్జీల పెంపు తప్పదని వెల్లడించింది. డీజిల్‌ ఛార్జీలు నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగడంతో మెయింటెనెన్స్ బాగా ఎక్కువవుతోందని, ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకే చార్జీలు పెంచాం అని ఆర్టీసీ తెలిపింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp