తెలంగాణలో రెండేళ్లలో ముగ్గురు సివిల్ సర్వెంట్ల స్వచ్చంద పదవి విరమణ !

By Ritwika Ram Jul. 20, 2021, 12:25 pm IST
తెలంగాణలో రెండేళ్లలో ముగ్గురు సివిల్ సర్వెంట్ల స్వచ్చంద పదవి విరమణ !

తెలంగాణలో గడిచిన రెండేళ్లలో ముగ్గురు సివిల్ సర్వెంట్లు వీఆర్ఎస్ తీసుకున్నారు. 2019 జులైలో సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయగా.. 2020 జూన్ లో సీనియర్ ఐపీఎస్ వినయ్ కుమార్ సింగ్ వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారు. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి, అడిషనల్ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వాలంటరీ రిటైర్ మెంట్ కోసం సీఎస్ సోమేశ్ కుమార్ కు లెటర్ రాశారు. రెండేళ్ల కాలంలో ముగ్గురు ఉన్నతాధికారులు వీఆర్ఎస్ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆకునూరి మురళి, వీకే సింగ్ ఇద్దరూ తెలంగాణ సర్కారుపై విమర్శలు చేయగా.. తాజాగా టీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకతతోనే ప్రవీణ్ కుమార్ తన బాధ్యతల నుంచి తప్పకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రవీణ్ కుమార్.. ఆరేళ్ల సర్వీసు ఉన్నా..

1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. వ్యక్తిగత కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియతో ఓ లెటర్ కూడా పోస్టు చేశారు. ఆరేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకోవడం కొంత బాధ కలిగిస్తోందని అందులో పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి పరిమితులు లేకుండా తన మనసుకు నచ్చినట్లుగా పని చేయబోతున్నట్లు తెలిపారు. దాదాపు 9 ఏళ్లు ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారు. మాలవత్ పూర్ణ లాంటి ఎందరినో మెరికలను వెలుగులోకి తెచ్చారు. 2012లో ఆయన ప్రారంభించిన ‘స్వేరోస్‌’ అనే ఎన్జీవో సంస్థ చాలా ఫేమస్. ఈ సంస్థలో 4 లక్షల మంది దాకా ఉన్నారు. ఇదే ఆయనకు బలమని చెబుతారు.

తెలంగాణ ప్రభుత్వం తాజాగా దళిత బంధు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి ప్రవీణ్ కుమార్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఆయన వెళ్లలేదు. గురుకులాల్లో ప్రభుత్వ పెత్తనం పెరగడం, సీట్లను స్థానిక కోటా పేరుతో ఎమ్మెల్యేలకు అప్పగించడాన్ని ప్రవీణ్ కుమార్ వ్యతిరేకించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో వస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ స్టేజ్ ఎక్కినా.. ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేయడం మామూలైపోయింది కూడా.. దీంతో హుజూరాబాద్ నుంచే పోటీలో దిగుతారన్న వాదనలు కూడా మొదలయ్యాయి.

Also Read : ఎట్టకేలకు కాకుమానికి కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరి

అసంతృప్తితో వీకే సింగ్

1987 బ్యాచ్ కు చెందిన వినయ్ కుమార్ సింగ్.. జైళ్ల శాఖ డీజీగా, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ గా పని చేశారు. జైళ్ల శాఖలో పలు సంస్కరణలు కూడా చేశారు. 2020 జూన్ లో వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లెటర్ పంపారు. ఎన్నో ఆశయాలతో పోలీసు శాఖలో చేరానని, మార్పులు తేవాలని భావించానని, కానీ విఫలమయ్యానంటూ అందులో పేర్కొన్నారు. తన సేవల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంతృప్తిగా లేదని, అందుకే భారం కాదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు. తన వీఆర్ఎస్ దరఖాస్తుకు కొన్ని రోజుల ముందు నాటి సీఎస్ కు లేఖ రాశారు. పదోన్నతి విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని, అర్హత ఉన్నా డీజీపీగా పదోన్నతి కల్పించలేదంటూ అందులో పేర్కొన్నారు. తన వీఆర్ఎస్ లెటర్ ను తెలంగాణ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని గత మార్చిలో వీకే సింగ్ చెప్పారు. తనకు చార్జ్ మెమో ఇచ్చిందని, నిత్యం వేధిస్తోందని వాపోయారు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదన్నారు.

ఆకునూరి మురళి.. పని లేనిచోట ఉండలేక..

వీకే సింగ్, ప్రవీణ్ కుమార్ కంటే ముందు వీఆర్ఎస్ తీసుకున్నది ఆకునూరి మురళి. తెలంగాణ రాష్ట్ర ఆర్కివ్స్ శాఖ డీజీగా పని చేస్తూ.. తన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే స్వచ్ఛందంగానే పదవీ విరమణ తీసుకున్నారు. తెలంగాణలో కొన్ని వర్గాల ఐఏఎస్‌లకు సరైన ప్రాధాన్యం ఉన్న పోస్టులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తనకు కేటాయించిన శాఖలో పని లేదని, ఏ పని చేయకుండానే వేతనం తీసుకుంటున్నానే భావనకు గురవుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో కొనసాగడం కంటే వైదొలగడమే ఉత్తమ నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పారు.

ఐఏఎస్ మురళి 2016లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఎక్కువగా ప్రజల మధ్యే ఉండటానికి ఆసక్తి కనబరిచారు. తన కూతురికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అయితే బీఫ్ ను నిషేధించడం పనికిమాలిన చర్య అంటూ 2017 మార్చిలో వివాదాస్పద వ్యాఖ్యల చేశారు. మరికొన్ని విషయాల్లోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ఆర్కివ్స్ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో 2019 జులైలో వీఆర్ఎస్ తీసుకున్నారు. మూడు నెలలకే ఆయన్ను ఏపీ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. పాఠశాల విద్య మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామా వెనుక‌..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp