బాబుకి ముందున్న‌ది ముళ్ల‌బాటే..!

By Raju VS Feb. 19, 2020, 07:39 am IST
బాబుకి ముందున్న‌ది ముళ్ల‌బాటే..!

ఏపీలో రాజ‌కీయాలు వేగంగా మ‌లుపులు తీసుకుంటుండ‌డం మాజీ సీఎం చంద్ర‌బాబుని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. డిసెంబ‌ర్ లో మొద‌ల‌యిన రాజ‌ధాని ర‌గ‌డ త‌ర్వాత అది మ‌రింత వేగ‌వంతం అవుతోంది. చివ‌ర‌కు నేరుగా ఆయ‌న పీఎస్ వ‌ర‌కూ వ్య‌వ‌హారం రావ‌డంతో త‌దుప‌రి ప‌రిణామాలు అర్థంకాక స‌త‌మ‌తం అవుతున్నారు. ఓవైపు రాజ‌కీయంగానూ, మ‌రోవైపు వ్య‌క్తిగ‌తంగానూ ఆయ‌న తీవ్ర‌మైన స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత మొద‌ల‌యిన ప‌రిణామాలు రానురాను ముదురుతున్నాయి. టీడీపీని ముంచుతున్న‌ట్టుగా ప‌లువురు భావించే ప‌రిస్థితికి నెడుతున్నాయి. దాంతో ఏంచేయాల‌న్న‌ది స్ప‌ష్ట‌త క‌నిపించ‌క‌పోవ‌డంతో తొలిసారిగా చంద్ర‌బాబుకి అస‌లైన ప‌రీక్షా స‌మ‌యం దాపురించింది. దాంతో త‌న‌ను తాను ర‌క్షించుకుంటూనే త‌న పార్టీని కూడా కాపాడుకోవాల‌నే య‌త్నంలో చంద్ర‌బాబు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ గ‌ట్టెక్కిన త‌న‌కు ఈసారి గ‌డ్డు ప‌రిస్థితి ఎదురుకాకూడ‌ద‌ని ఆశిస్తున్నారు.

చంద్ర‌బాబుకే శీల‌ప‌రీక్ష‌
రాజ‌కీయ ప్ర‌వేశం త‌ర్వాత గ‌డిచిన నాలుగు ద‌శాబ్దాల్లో అనేక ప‌రీక్ష‌ల‌ను అవ‌లీల‌గా ఎదుర్కొంటున్న చంద్ర‌బాబుకి ఇప్పుడు మాత్రం అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అందుకు అనేక కార‌ణాలున్నాయి. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు దానికి ప్ర‌ధాన కార‌ణం. అధికారంలో ఉన్న కాలంలో హ‌ద్దుల్లేకుండా వ్య‌వ‌హ‌రించి, అది కోల్పోగానే అతి వినియం ప్ర‌ద‌ర్శించ‌డం ఆయ‌న‌కు తొలినుంచీ అల‌వాటు. ఏడాది క్రితం అదే రీతిలో ప్ర‌వ‌ర్తించిన దానికి ఇప్పుడు ప్ర‌తిఫ‌లం చెల్లించ‌క త‌ప్ప‌దా అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ముఖ్యంగా బీజేపీతో బంధం తెంచుకున్న త‌ర్వాత ఆపార్టీతోనూ, ఏపీలో వైఎస్సార్సీపీ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు త‌ల‌నొప్పికి ముఖ్య కార‌ణంగా క‌నిపిస్తోంది. నీవు నేర్పిన విద్య‌యే నీర‌జాక్ష అన్న‌ట్టుగా ఆయా పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బాబు అస్త్రాల‌నే రివ‌ర్స్ లో సంధిస్తున్నారు.

ఐటీ దాడుల ప‌రంప‌ర ప్ర‌స్తుతం చంద్ర‌బాబుని ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌డం లేదు. ప్రపంచంలోని అన్ని విష‌యాల మీద వెంట‌నే స్పందించే చంద్ర‌బాబు సైతం పెద‌వి విప్ప‌కుండా ప‌రిణామాల‌ను గ‌మ‌నించాల్సిన స్థితి ఏర్ప‌డింది. పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ల‌భించిన ఆధారాల‌తో ఏకంగా 2వేల కోట్ల అక్ర‌మాల‌కు సంబంధించి చ‌ర్య‌లుంటాయ‌ని ఐటీ అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత పంచ‌నామా ప‌త్రాలు అంటూ అనునాయుల‌తో హంగామా చేసిన‌ప్ప‌టికీ ఆయ‌నకు ఆదుర్థా త‌గ్గేలా లేదు. అస‌లు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది అర్థం కాక‌పోవ‌డ‌మే దానికి కార‌ణంగా ప‌లువురు భావిస్తున్నారు.

టీడీపీ శ్రేణుల్లోనూ సందిగ్ధం
వ్య‌వ‌స్థాగ‌తంగా బ‌ల‌మైన తెలుగుదేశం పార్టీ కూడా తొలిసారిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్ర‌బాబు సార‌ధ్యంలోకి స్వాధీనం చేసుకున్న త‌ర్వాత వైఎస్సార్ హ‌యంలో కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా గ‌ట్టెక్క‌గ‌లిగారు. కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో తొలిసారిగా ఒంట‌రి పోటీకి సిద్ధ‌ప‌డిన త‌రుణంలో అతి ఘోర ప‌రాజ‌యం పాల‌యిన నేప‌థ్యంలో టీడీపీలో పూర్తి నైరాశ్యం అల‌ముకుంది. ఆ వెంట‌నే అమ‌రావ‌తి విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంతో కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి దాపురించింది.

ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో కేవ‌లం మూడంటే మూడు సీట్ల‌కే ప‌రిమితం అయిపోయిన పార్టీ ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లోనూ పునాదులు కోల్పోయే ద‌శ‌కు చేరుకుంది. రెండు నెల‌లుగా గోదావ‌రి జిల్లాలు దాటి చంద్ర‌బాబు ముంద‌డుగు వేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చిందంటే వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే అనేక మంది ఉత్త‌రాంధ్ర‌ టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా ఆ పార్టీని వీడుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో వ‌ల‌స‌ల‌తో టీడీపీ ఖాళీ అవుతున్న తీరు ఆస‌క్తిగా మారుతోంది. ఇక రాయ‌ల‌సీమ వ్య‌వ‌హారాల్లో టీడీపీకి కోలుకునే అవ‌కాశాలు ఇప్ప‌టికిప్పుడే క‌నిపించ‌డం లేదు.

కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌రిథిలోని సొంత సామాజిక‌వ‌ర్గం అండ‌తో ఆయ‌న ఎన్నాళ్ల పాటు నెట్టుకురాగ‌ల‌ర‌న్న‌ది సందేహంగా మారుతోంది. అదే స‌మ‌యంలో అధికార ప‌క్షం త‌ప్పిదాల ఆస‌రాతో ఎద‌గాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నా సొంత గూటిలో స‌మ‌స్య‌ల‌తో అది సాధ్యం కావ‌డం లేదు. ఇది చంద్ర‌బాబుకి పెద్ద చిక్కుగా మారుతోంది. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌పై ఎంత గ‌ట్టిగా గొంతెత్తినా, మీడియా వంత పాడినా జ‌నంలో త‌గిన ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డానికి టీడీపీలో నైరాశ్యం కొన‌సాగుతుండ‌డ‌మే కార‌ణ‌మ‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించిన‌ట్టు క‌నిపిస్తోంది.

టీడీపీని గాడిలో పెట్టాల‌ని బాబు య‌త్నాలు
ఓవైపు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు రంగంలో దిగే అవ‌కాశాలు, మ‌రోవైపు పార్టీ ప‌ట్టాల‌పైకి తీసుకురావాల్సిన ఆవ‌శ్యం ఎదురుకావ‌డంతో చివ‌ర‌కు స్థానిక ఎన్నిక‌ల్లోనే చావోరేవో అన్న‌ట్టుగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుడిగా త‌న‌కున్న సానుకూల‌త‌ను బ‌ల‌ప‌రుచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా తాజాగా ప్ర‌జా చైత‌న్య యాత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు. వాస్త‌వానికి ఈయాత్ర‌లో పూర్తిగా పార్టీలో పున‌రుత్తేజం నింపే దృష్టితోనే చంద్ర‌బాబు ఉన్నారు. అదే స‌మ‌యంలో కేంద్రం ఎటువంటి విచార‌ణకు సిద్ధ‌ప‌డినా ప్ర‌జ‌ల్లో ఉండ‌డం ద్వారా కొంత ఉప‌శ‌మ‌నం పొందాల‌ని ఆశిస్తున్నార‌నే అభిప్రాయం ఉంది. గ‌తంలోనే ప్ర‌జ‌లంతా త‌న‌కు వ‌ల‌యంలా ఉండాల‌ని పిలుపునిచ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటే ఊర‌ట ద‌క్కుతుంద‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

స్థానిక ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత స‌మావేశాల‌కు సిద్ధ‌ప‌డుతున్న చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల్లో విశ్వాసం పెంపొందించాల‌నే య‌త్నంలో ఉన్నారు. కానీ న‌వ‌ర‌త్నాల అమ‌లు, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల కార‌ణంగా పాల‌క‌ప‌క్షం ప‌ట్టు నిలుపుకుంటున్న త‌రుణంలో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు పెద్ద‌గా ఫ‌లితాలు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అయినా అటు వ్య‌క్తిగ‌తంగా, ఇటు పార్టీ ప‌రంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌కాశం జిల్లా నుంచి ప్రారంభిస్తున్న చంద్ర‌బాబు యాత్ర‌కు ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గానే చెప్ప‌క త‌ప్ప‌దు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp