తమ్ముళ్లకే కాదు బాబుకూ కానరాని మామా కోడలు

By Voleti Divakar Mar. 11, 2020, 09:15 pm IST
తమ్ముళ్లకే కాదు బాబుకూ కానరాని మామా కోడలు

సినిమాల్లో అతిథి నటులను చూసే ఉంటారు. సినీరంగం నుంచి వచ్చిన మురళీమోహన్ కూడా రాజమహేంద్రవరం రాజకీయాల్లో అలాంటి పాత్రను పోషించి నటనలో తనకు తరుగులేదని నిరూపించారు. ' నేను రాజమహేంద్రవరంలోనే స్థిర నివాసం ఏర్పచుకున్నాను. ఇకపై ఇక్కడే ఉంటా. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. ప్రజలకు విద్య, వైద్యరంగాల్లో సేవ చేసేందుకు ప్రత్యేక ట్రస్టును కూడా ఏర్పాటు చేశాను.' ఇదీ సినీనటుడు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బినామీగా ప్రచారంలో ఉన్న మాగంటి మురళీమోహన్ 2009 ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు.

అయితే మురళీమోహన్ మాటలకు చేతలకు పొంత లేవని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయన ఎప్పుడూ రాజమహేంద్రవరంనకు ప్రత్యేక అతిధిగానే వ్యవహరించారని విమర్శిస్తున్నారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమిపాలైన మాగంటి మురళీమోహన్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్నా 2014 సార్వత్రిక ఎన్నికల వరకు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తరచూ కనపడ్డారు. స్థానిక జెఎన్ రోడ్డులో ఇల్లు నిర్మించుకున్నారు. ఎంపిగా ఎన్నికైన నాటి నుంచి మురళీమోహన్ రాజమహేంద్రవరం కన్నా డిల్లీ, హైదరాబాద్ లోనే ఎక్కువగా గడిపారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా ఆయన రాజధాని అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కూడబెట్టారని ప్రచారం జరిగింది. అంతేగాక రాజధాని ప్రాంతంలో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఎంపిగా ఉన్న కాలంలో ఆయన ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టులు కూడా కార్యాచరణలోకి రాలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఆయన కన్నా గతంలో ఎంపిగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ 100 రెట్లు ఉత్తమన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ విషయాన్ని టిడిపి వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. రాజమహేంద్రవరం ఎంపీగా మురళీమోహన్ సొంత వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. రంగంపేటకు చెందిన తన సామాజిక వర్గానికే చెందిన ఆళ్ల గోవింద్ వంటి వారిని ప్రోత్సహించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో కూడా వారికే కొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టేలా చక్రం తిప్పినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

సుమారు రూ. 5కోట్ల తన ఎంపి నిధులతో తన సామాజిక వర్గానికి చెందిన జీఎస్ఎల్ ఆసుపత్రి నిర్వాహకులకు ఆధునాతన కేన్సర్, దంత వైద్య వాహనాలను సమకూర్చారు. ఈనేపథ్యంలో 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం ఎంపి స్థానాన్ని మురళీమోహన్ కోడలు, ఆయన రాజకీయ వారసురాలిగా పేర్కొనే రూపాదేవికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లే ఆమె ఘోరంగా ఓటమిపాలయ్యారు.

నాటి నుంచి నేటి వరకు మాజీ ఎంపి అయిన మురళీమోహన్ గానీ, ఆయన కోడలు రూపాదేవి గానీ రాజమహేంద్రవరం ప్రజల ముఖం చూసి దాఖలాలు లేవని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ నిర్మించుకున్నఇంటిని కూడా అమ్మేసినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఆయన ప్రజాధనంతో జీఎస్ఎల్ ఆసుపత్రికి సమకూర్చిన ఆధునాతన వైద్య వాహనాల జాడ కూడా కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మురళీమోహన్ జాడ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మురళీమోహన్ నిజంగా రాజమహేంద్రవరంనకు అతిథి నాయకుడే (నటుడే)నని ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp