నందికొట్కూరులో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

By Sridhar Reddy Challa Feb. 28, 2020, 12:11 pm IST
నందికొట్కూరులో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
కర్నూల్ జిల్లా వైసిపిలో మరోసారి వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్ధర్, ఆపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈనేపధ్యంలో ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరులు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ ను ఉద్దేశించి అనవసరంగా నందికొట్కూరు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మంత్రిని జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించడం జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. తాము నేరస్థలకు, హంతకులకు, రౌడీషీటర్ల కు బయపడబోమని ఆర్ధర్ అనుచరులు మంత్రి అనిల్ కుమార్ కి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మాట్లాడిన పాములపాడు మండలానికి చెందిన ఓ ముఖ్య కార్యకర్త ఈ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు

నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీలో చేరిక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. నిన్నటి వరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్సెస్‌ ఆర్థర్‌ అన్నట్లు వైసీపీలో స్థానికంగా పరిస్థితి ఉండేది. ఇపుడు ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిపైనే ఆరోపణలకు దిగారు. దీంతో ఆ పార్టీ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థమవుతోంది నందికొట్కూరు మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి వ్యవహారంలో ఎమ్మెల్యే ఆర్ధర్, వైసిపి నియోజకవర్గ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలే ఇప్పుడు ఈ తాజా వివాదానికి కారణమని తెలుస్తుంది.

తమ వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్‌ పదవిని కోరుతూ ఎమ్మెల్యే ఆర్థర్‌ ఇటీవలే ఒక వ్యక్తి పేరును సూచిస్తూ పార్టీ హైకమాండ్ కి పంపారు. అలాగే తమ వర్గానికి న్యాయం చేయాలని సిద్ధార్థ రెడ్డి కూడా మరో వ్యక్తి పేరును చైర్మన్ గా ప్రతిపాదించారు. అయితే మంత్రి సిద్ధార్థ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం అవుతోంది. దీంతోపాటు ఇటీవల పలు కాంట్రాక్టుల వ్యవహారాల్లో కూడా సిద్ధార్థ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో ఇప్పటికే తారాస్థాయిలో ఉన్న వర్గ విబేధాలు గతంలో రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి దాకా వెళ్లాయి. నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ లు అధికార పార్టీలో కలిసి పనిచేస్తున్నా ఒకరిమీద ఒకరు అంతర్గతంగా కక్ష పెంచుకున్నారు. ఎన్నికల సమయంలో వీరిరువురు కలసిరాని చేసినప్పటికీ ఆ తారువాత ఇద్దరి నాయకుల మధ్య క్రమేపి గ్యాప్ పెరిగింది. స్థానికంగా పట్టున్న నాయకుడైన సిద్ధార్థ రెడ్డి కి ఎమ్మెల్యే ఆర్ధర్ ల మధ్య నామినేటెడ్ పదవుల విషయంలో, ఇతర పనుల వ్యవహారంలో వచ్చిన తేడాల వల్లే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఏదేమైనా నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి పెద్ద తలనోప్పిలా తయారైంది. ఈ నేపథ్యంలో ఈ తాజా వివాదం పై పార్టీ హైకమాండ్ స్పందన ఏవిధంగా ఉండనుందోనని జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొనివుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp