జగన్‌ సంధిస్తోన్న వజ్రాయుధం

By Kotireddy Palukuri Oct. 16, 2020, 05:40 pm IST
జగన్‌ సంధిస్తోన్న వజ్రాయుధం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పరిపాలనా ఫలితాలను చూస్తున్న వారు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అంతలో ఎంత మార్పు అనుకుంటున్నారు. అధిక ధరలకు కాంట్రాక్టులకు కట్టబెట్టి ప్రజా ధనం దుర్వినియోగం, ఆ పై మమూళ్లు జేబుల్లో వేసుకునే రోజుల నుంచి ప్రజల సొమ్ము తన సొమ్ముగా జాగ్రత్తగా ఖర్చుపెట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారడం పై విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు.

ప్రజా ధనం ఆదా చేసేందుకు రివర్స్‌ టెండర్‌ అనే పాసుపత్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయోగిస్తున్నారు. పది లక్షలు ఆపై విలువైన ప్రతి పనికి రివర్స్‌ టెండర్స్‌ నిర్వహిస్తూ ఖజానాకు వందల కోట్ల రూపాయలు మిగిలిస్తున్నారు. ప్రజల సొమ్ము వృధా కాకుండా సరైన దారిలో వినియోగిస్తున్నారు. ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండర్‌ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే వైఎస్‌ జగన్‌ ఈ ఆలోచనను వెల్లడించారు. రివర్స్‌ టెండర్‌ నిర్వహించడమే కాదు వంద కోట్ల రూపాయలు దాటిని ఏ పని అయినా సరే జుడిషియల్‌ రివ్యూ తర్వాతనే టెండర్‌కు వచ్చేలా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం  లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

తాజాగా సివిల్‌ సప్లై విభాగంలో వాహనాల కొనుగోలు టెండర్‌లో జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ ద్వారా 63 కోట్ల రూపాయలను ఆదా చేసింది. డిసెంబర్‌ నెల నుంచి రాష్ట్రంలో రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు. దీని కోసం 9260 వాహనాలను కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జుడిషియల్‌ రివ్యూ తర్వాత పక్షం రోజుల కిందట టెండర్‌ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలైన టాటా, సుజుకి తదితర సంస్థలు టెండర్‌లో పాల్గొన్నాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని సంస్థలు ఏ ధరకు కోట్‌ చేసిన విషయం వెల్లడైంది. దీంతో మళ్లీ రివర్స్‌ టెండర్‌లు నిర్వహించారు. టాటా సంస్థ ఒక్కొక్క వాహనాన్ని 5,72,539 రూపాయలకు సరఫరా చేసేందుకు టెండర్‌ వేసింది. సుజుకి సహా ఇతర అన్ని సంస్థల కన్నా టాటానే తక్కువ ధరకు కోట్‌ చేయడంతో ఆ సంస్థ వాహనాల సరఫరా టెండర్‌ను దక్కించుకుంది.

మొదట టెండర్‌లో టాటా సంస్థ ఒక్కొక్క వాహనాన్ని 6.60 లక్షల చొప్పన సరఫరా చేసేందుకు కోట్‌ చేసింది. అయితే రివర్స్‌ టెండర్‌లో ఈ మొత్తాన్ని 5,72,539లకు తగ్గించింది. ఒక్కొక్క వాహనంపై 67,460 రూపాయలు తగ్గడం విశేషం. మొత్తం మీద వాహనాలకు రివర్స్‌ టెండర్స్‌ నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 63 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. వజ్రాయుధం లాంటి రివర్స్‌ టెండర్‌ విధానం ద్వారా ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయలు ఆదా చేయడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp