ఈ తీరు చూసే ప్రతిపక్షం ఖాళీ అంటున్నారు

By Jaswanth.T Aug. 12, 2020, 12:55 pm IST
ఈ తీరు చూసే ప్రతిపక్షం ఖాళీ అంటున్నారు

యేడాది క్రితమే జరిగిన ఎన్నికల్లో సుమారు 39శాతం ఓట్లు పొందిన టీడీపీ పార్టీని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది’ అనగలుగుతున్నారంటే అందుకు తగ్గ కారణాలను ఆ పార్టీ అన్వేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందులోనూ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి నడుపుతున్న పార్టీ అయితే ఈ ప్రశ్న మరింత గట్టిగానే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఈ మాట అంటే ఏదో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా అనుంటారని సముదాయించుకుందామనుకున్నా.. టీడీపీ వ్యవహారం చూస్తుంటే ఆయన చెప్పినదాంట్లో కూడా వాస్తవం లేకపోలేదన్న భావన కలక్కమానదు.

కొత్త రాష్ట్రంలో అనుభవజ్ఞుడనుకుని అయిదేళ్ళు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారం అనుభవించారు. పదవీ కాలం పూర్తయ్యేలోపే ‘అనుభవం’ గురించి అర్ధమైపోయిన ప్రజలు ప్రతిపక్ష హోదాకు వారి స్థానం మార్చారు. ఇదంతా మనం ఎరిగినదే. అయితే తాను మాత్రమే సీనియర్‌ని అనుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇప్పుడున్న స్థానాన్నైనా నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించేందుకు ప్రయత్నించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ పనితీరును పరిశీలించినా ఇదే విధంగా జరుగడం సహజం. కానీ పక్క రాష్ట్రంలో కూర్చుని ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం మాత్రం ఏపీలోనే జరుగుతోంది.

అయ్యో పెద్దాయనమ్మా వెనకాముందు పార్టీని చూసుకునే వాళ్ళెవ్వరూ లేరాయె.. అనుకుని సర్ధిచెప్పుకుందామనుకున్నా ‘ఆరంగేట్రంలోనే మూడు శాఖలకు మంత్రిగా, భారీగా లాంచ్‌ చేసిన పుత్రరత్నం ఉన్నాడాయె’. కనీసం ఆయన కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలను గురించి పట్టించుకోకపోవడం ఇప్పుడు ప్రజల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది.

ప్రజల్లో జరుగుతున్న చర్చనే బీజేపీ నాయకులు, ఇతర ప్రత్యర్ధి పార్టీలు తమ గొంతుకగా మీడియా ముందుకు తెస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ రామ్‌మాధవ్‌ చేసిన వ్యాక్యలుగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌కు ఆల్రెడీ బీజేపీ ఖర్చీఫ్‌ వేసేసుకుంది. ఎంతో కొంత ఆసరాగా ఉంటాయనుకున్న వామపక్షాల ప్రభావం కూడా చెప్పుకోదగ్గది కాలేదు. వీటి ద్వారా ఇప్పుడు సాయమందుతున్నది, భవిష్యత్తులో అందేదీ అంతంత మాత్రమేనని ఇప్పటికే రూఢి అయ్యిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఉన్న బండికాడెను తెలంగాణా నుంచి జూమ్‌లో మోస్తామంటే జనం నమ్మోద్దు.

ప్రజల్లో చంద్రబాబు, ఆయన బృందం మీద పెద్దగా అంచనాలు, ఆశలు లేవన్నది అర్ధమవ్వడంతోనే ఆ స్థానంలోకి తాము వచ్చేయొచ్చన్న ప్రణాళికలను బీజేపీ నాయకులు సిద్ధం చేసుకుంటున్నారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ ముప్పును పసిగట్టే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల తరువాత నుంచి చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేసారని, అవి బెడిసికొట్టడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నది పరిశీలకుల వివరణ. ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయ పక్షాల్లోనూ, ప్రజల్లోనూ ఏకమై ఉన్న అభిప్రాయం అయితే మాత్రం ఏపీలో ప్రతిపక్షస్థానం ఖాళీ.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp