YSR RBKs - ఆర్బీకే వ్యవస్థకు అంతర్జాతీయ ప్రశంసలు

By Aditya Oct. 16, 2021, 10:45 am IST
YSR RBKs - ఆర్బీకే వ్యవస్థకు అంతర్జాతీయ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పాలనను ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది.

రైతులకు నాణ్యమైన సేవలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచన నుంచి పుట్టిన ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. వాటిలో కియోస్క్, స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రెరీ, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్ కిట్లు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల సిబ్బంది దాదాపు 15 వేల మంది ఆర్బీకేల్లో సేవలు అందిస్తున్నారు. వ్యవసాయ సీజనుకు ముందుగానే ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వీటిలో అందుబాటులో ఉంచుతున్నారు. కియోస్క్ లో బుక్ చేసుకున్న గంటల వ్యవధిలో వాటిని రైతులకు అందజేస్తున్నారు.

పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా..

ప్రభుత్వం ఆర్బీకేలను పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా అభివృధ్ధి చేసింది. వీటికి అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్ప్ స్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో వివిధ అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నారు. పంట వివరాలను నమోదు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు సకాలంలో అందేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

Also Read : తరతరాల సమస్య.. శాశ్వత పరిష్కారం.. జగన్‌ చారిత్రాత్మక అడుగు

ముఖ్యమంత్రి మానస పుత్రిక..

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న ఈ ఆర్బీకే వ్యవస్థను ముఖ్యమంత్రి మానస పుత్రికగా చెప్పవచ్చు. రైతులకు విత్తనాలు అందించడం మొదలు పండించిన పంటను అమ్ముకునే వరకు వివిధ దశల్లో సహాయం అందించడానికి ఇవి పనిచేసేలా రూపొందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు సమ్మె చేసి రైతులు తమ దయనీయతను, నిస్శహాయతను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గిట్టుబాటు కాని వ్యవసాయానికి వీడ్కోలు పలుకుదామని కోనసీమలోని రైతులు నిర్ణయించుకోవడం నాటి విపక్ష నేత జగన్మోహనరెడ్డిని కలచి వేసింది. అప్పుడు రైతులతో మాట్లాడిన జగన్ తాను అధికారంలోకి రాగానే వారి కష్టాలను గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. దానికనుగుణంగా రూపుదిద్దుకున్న ఆలోచనే ఈ ఆర్బీకే వ్యవస్థ.

జాతీయ స్థాయిలో ప్రశంసలు..

ఆర్బీకేల పనితీరుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఆలోచన వినూత్నంగా ఉందని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు మెచ్చుకుంటున్నారు. వీటి పనితీరును అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో పాటు నీతి ఆయోగ్ కూడా ఆసక్తి కనబరిచింది. ఇటీవల వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఢిల్లీ వెళ్లి ఆ సంస్థల అధికారుల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్బీకేల ఆలోచన అద్భుతం అని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం అవసరం అని నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఆర్బీకేల పనితీరుపై ఐక్యరాజ్యసమితికి నివేదిస్తామని ఎఫ్ఏఓ భారత ప్రతినిధి తోమియో షిచిరీ చెప్పారు. విత్తు నుంచి విపణి వరకు రైతులకు సాగు సాయం అందించేలా ఈ విధానాన్ని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

Also Read : YSR Bima Scheme - జగన్ ముందు చూపునకు నిదర్శనం ఈ నిర్ణయం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp