మోసాలను అరికట్టడమే లక్ష్యంగా..

By Jaswanth.T Dec. 15, 2020, 03:30 pm IST
మోసాలను అరికట్టడమే లక్ష్యంగా..
ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు ఎంతగా విస్తృతం అవుతున్నాయో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. వ్యక్తులు వ్యక్తుల మధ్య జరిగే ఈ మోసాలు చాలా వరకు అవగాహన లేకపోవడం, అత్యాసకుపోవడం తదితర కారణాల ద్వారానే ఏర్పడుతుంటాయి. కానీ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల్లో కూడా ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఆధ్వర్యంలో పలు సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ను సిద్ధం చేస్తోంది. ఎప్పటికప్పుడు వాటిని అప్‌డేట్‌ చేస్తూ మోసపూరిత కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నం చేపడుతోంది.

తాజాగా పాజిటివ్‌ పే పేరిట మరో కొత్త సేఫ్టీ ఫీచర్‌ను అమలు చేయబోతోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆగష్టులోనే ప్రారంభించాల్సి ఉంగా కోవిడ్‌ కారణంగా ఇది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ తాజా ఈ విధానం అమలుకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ విధానం ప్రకారం.. వేరొకరు ఇచ్చిన చెక్కును తీసుకుని బ్యాంక్‌కు వెళితే,అక్కడి సిబ్బంది చెక్కు జారీ చేసిన వ్యక్తి ద్వారా చెక్కు సంబంధిత వివరాలను మరోసారి నిర్ధారించుకున్న తరువాత మాత్రమే లావాదేవీలకు అనుమతిస్తారు. చెక్కు నంబరు, డేట్, జారీ చేసిన వారి వివరాలు, ఎంత మొత్తం ఇస్తున్నారు వంటి వాటిని సంబంధిత కష్టమర్‌ ద్వారా మరోసారి ధృవీకరిస్తారన్న మాట. అలాగే చెక్కును జారీ చేసిన వ్యక్తి కూడా ఈ వివరాలను ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఏటీయం, ఎస్‌యంఎస్, మొబైల్‌ అప్లికేషన్స్‌ వంటి వాటి ద్వారా బ్యాంకుకు తెలిపాల్సి ఉంటుంది. చెక్కు జారీ చేసిన వ్యక్తి తెలియజేసిన సమాచారం సంబంధిత బ్యాంకు సర్వర్‌లో సేవ్‌ అయి ఉంటుంది. ఆ వివరాలతో పోల్చి చూసిన తరువాత మాత్రమే చెక్కును క్లియర్‌ చేస్తారు. లేకపోతే రిజక్టు చేసేందుకు బ్యాంకుకు అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని వినియోగదారుడి అనుమతి మేరకు మాత్రమే బ్యాంకులు అమలు చేయనున్నారు. ఇందుకు కూడా చెక్కు ద్వారా డ్రా చేసే నగదు మొత్తం ప్రాతిపదికగా బ్యాంకులు నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ విధానం ద్వారా చెక్కుల కారణంగా జరిగే పలు మోసాలకు చెక్‌పెట్టగలుగుతామని బ్యాంకింగ్‌ రంగం ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఏటీయంల ద్వారా పదివేలకు మించి నగదు తీసుకుంటే, ఆ ఖాతాకు అనుసంధానంగా ఉన్న సెల్‌ఫోన్‌ నెంబర్‌కు అలెర్ట్‌ మెస్సేజ్‌ వచ్చేందుకు చర్యలు చేపట్టారు. తద్వారా ఏటీయం కార్డు వినియోగంపై సంబంధిత కార్డు హోల్డర్‌ను అప్రమత్తం చేసేందుకు బ్యాంకింగ్‌ సంస్థలకు వీలుచిక్కుతోంది. ఒక వేళ నగదు తీసింది తాము లేదా తమకు సంబంధించిన వారు కాకపోతే వెంటనే ఆ మెస్సేజ్‌లోనే ఇచ్చిన వేరే ఫోను నంబర్ల ద్వారా కార్డును బ్లాక్‌ చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఇదే రీతిలో జారీ అయిన చెక్కు వివరాలను గురించి సదరు వినియోగదారుడి ద్వారా మరోసారి నిర్ధారించుకునేందుకు ఆర్బీఐ సూచనల మేరకు బ్యాంకింగ్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అందుకు వచ్చేయేడాది జనవరి 1 నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నాయి.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp