మళ్ళీ నోట్ల రద్దు..!! కానీ అప్పటి మాదిరి కాదు..!

By Jaswanth.T Jan. 23, 2021, 06:10 pm IST
మళ్ళీ నోట్ల రద్దు..!! కానీ అప్పటి మాదిరి కాదు..!
2016, నవంబరు నెలలో ప్రధాని మోడీ టీవీల ముందుకు వచ్చి ‘దేశ్‌ కీ వాసియోం..’ అని మొదలు పెట్టి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించేసారు. దీంతో ఆ రాత్రికి పెద్దగా జనం ఎవ్వరూ దీనిపై దృష్టి పెట్టలేదు గానీ.. తెల్లారేసరికి మాత్రం కలకలం మొదలైంది. చిన్నా పెద్దా, పిల్లా పీచును వెంటబెట్టుకుని తమ దగ్గరున్న నోట్లతో బ్యాంకుల వద్దకు పరుగులు తీసారు. అక్కడ అప్పటికే భారీ క్యూ ఉండడంతో ఖంగుతున్నారు. అయితే నానా తంటాలు పడి తమ దగ్గరున్న పాత నోట్లను మార్చి కొత్త నోట్లు తీసుకున్నాక కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ నోట్ల రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం ఎంత వరకు సిద్ధించిందన్న ప్రయోజనాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు మరోసారి నోట్లు రద్దు చేయబోతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సారి నోట్లు మొత్తం కాదండోయ్‌.. కేవలం 100 రూపాయల నోటు ను మాత్రమే రద్దు చేయనున్నారు.

అధికూడా గతంలో మాదిరిగా ఉన్నట్టుండి ఉదయాన్నే మార్చేసుకోనక్కర్లేదు. రిజర్వు బ్యాంకు నిర్ణయం మేరకు బ్యాంకుల వద్దకు చేరిన పాత రూ. 100 నోటును బ్యాంకు వద్దే అట్టే పెట్టేసుకుంటారు. కొత్త నోటును మాత్రమే చలామణీలోకి వదులుతారు. ఈ విధానం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని సంబంధిత రిజర్వు బ్యాంకు అధికారే ప్రకటించారు. అందు వల్ల గతంలో బ్యాంకుల వద్ద పడిగాపులు పడిన విషయాన్ని గుర్తు చేసుకుని, ఉన్నట్టుండి బ్యాంకు వద్దకు పరుగు పెట్టాల్సిన ఆగత్యం లేదు. మనకు ఖాళీ దొరికినప్పుడు మాత్రం మన దగ్గరున్న నోట్లను బ్యాంకులో వేస్తే, తిరిగి తీసుకునే టప్పుడు కొత్త నోటును మాత్రమే ఇస్తారన్న మాట. ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నడిపేటట్టయితే ఇక ఎటువంటి టెన్షనూ పడక్కర్లేదాయె. నిజానికి పాత వంద నోటును ముద్రించడం దాదాపు ఆరేళ్ళ క్రితమే నిలుపుదల చేసారట.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp