ఇంక్ పెన్నులు గుర్తున్నాయా?

By G.R Maharshi Sep. 21, 2021, 07:30 pm IST
ఇంక్ పెన్నులు గుర్తున్నాయా?

చిన్న‌ప్పుడు చ‌దువుకి కొన్ని నియ‌మాలుండేవి. ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ ప‌ల‌కా బ‌ల‌పం....పెన్సిల్ మాత్ర‌మే వాడాలి. హైస్కూల్లోనే పెన్ను. పైసాకి ఒక బ‌ల‌పం. ఉప్పు కాగితంతో బ‌ల‌పానికి సాన‌. మా క్లాస్‌లో రంతుల్లా వాళ్ల నాన్న కార్పెంట‌ర్‌. వాడు ఉప్పు కాగితాల డీల‌ర్‌. గుప్పెడు బ‌ఠానీలు పెడితే ఒక ఉప్పు కాగితం. RMP డాక్ట‌ర్ కొడుకు సీసాలు, ర‌బ్బ‌ర్ స్టాకిస్ట్‌. పీచు మిఠాయి ఇస్తే చిన్న సీసా ఇస్తాడు. దాంట్లో నీళ్లు పోసుకుని ప‌ల‌క తుడుపుకుంటాం.

మార్కాపురం ప‌ల‌క 75 పైస‌లు. మ‌రీ పెద్ద‌దైతే రూపాయి. క్లాస్‌లో కొంత మంది విరిగిన ప‌ల‌క‌ల‌తో వ‌చ్చేవాళ్లు. వాళ్ల బ‌ట్ట‌లు కూడా చిరుగులే. కొత్త ప‌ల‌క కొన‌లేనిత‌నం. ఇక పెన్సిల్‌, బ్లేడు, ర‌బ్బ‌రు క‌లిపి 10 పైస‌లు. పెన్సిల్ చెక్కుతూ వేలు చెక్కుకునేవాన్ని. ర‌బ్బ‌ర్‌ని న‌మ‌ల‌డానికి ప్ర‌య‌త్నించేవాన్ని.

ఈ ద‌శ దాటి హైస్కూల్ చేరితే కొత్త పెన్ను. పంక‌జ్ పెన్ 60 పైస‌లు. మ‌ర్చెంట్ 75 పైస‌లు. ప్లాటో ఖ‌రీదు రూపాయి నుంచి రెండు రూపాయ‌లు. ఆ పెన్ను షావుకార్ల పిల్ల‌ల‌ది. ర‌త్నం పెన్స్ కూడా ఉండేవి కానీ, మా స్థాయి పంక‌జ్ మాత్ర‌మే. బాల్‌పాయింట్ పెన్స్ వాడే వాళ్లు కాదు. రీఫిల్ నుంచి ఇంక్ కారి బ‌ట్ట‌ల‌న్నీ పాడ‌య్యేవి.

పెన్‌లోకి ఇంక్ అయిపోతే మూడుపైస‌లు. ఇంక్ బాటిల్ 50 పైస‌లు. దానికో పిల్ల‌ర్ కొంటే 10 పైస‌లు. బాటిల్‌లోని ఇంక్‌ని పిల్ల‌ర్‌తో ప‌ట్టుకుని పెన్ నింప‌డం అదో ఆర్ట్‌. స్కూల్లో పాత కాలం డెస్క్‌లు. పెన్నుని ఇంక్‌లో ముంచి రాసుకునే కాలం నాటివి. డెస్క్‌పై ఇంక్ బాటిల్‌కి స్పేస్ కూడా వుండేది.

ప్ర‌తి క్లాస్‌లో ఇంక్ అప్పులోళ్లు వుంటారు. కొంచెం ఇంక్ పోయ‌రా అంటే పెన్‌ని తిప్పుతూ చుక్క‌లు చుక్క‌లు ఇంక్ పోయ‌డం. నాలుగు చుక్క‌లు బాకీ అంటాడు. కానీ ఎప్ప‌టికీ తిరిగి ఇవ్వ‌డు. ఒక్కోసారి పెన్‌కి వాంతులు ప‌ట్టుకుంటాయి. ఇంక్ కక్కుతాయి. క్లాస్‌లో పెన్ డాక్ట‌ర్స్ వుంటారు. కృష్ణ అని ఒక‌డుండేవాడు. చ‌దువు త‌ప్ప అన్ని విద్య‌లూ వ‌స్తాయి. పెన్‌ని ప‌రిశీలించి ఒక బ్లేడ్ ముక్క‌తో స్టీల్ (పాళీ)ని గీకేవాడు. త‌ర్వాత నిబ్‌ని సెట్ చేసి ఇంక్ విదిలించి రాసేవాడు. ఎంత మొండి పెన్ అయినా చెప్పిన‌ట్టు వినేది. పెన్ దొంగ‌ల బ్యాచ్ వుండేది. కొత్త పెన్ క‌నపెడితే మాయం. ఇంట్లో భ‌ద్రంగా దాచుకుని రాసుకునే వాళ్లు. స్కూల్‌కి తెస్తే దొరికిపోతారు.

ఎగ్జామ్స్‌కి నిండా ఇంక్ నింపుకుని మూడు పెన్‌ల‌తో వెళ్లేవాన్ని. టెన్త్ ఎగ్జామ్స్ కూడా ఇంక్ పెన్‌తోనే రాశాను. 1978 త‌ర్వాత బాల్‌పాయింట్ పెన్స్ యుగం స్టార్ట్ అయ్యింది. ఇంక్ పెన్లు గ‌త కాలం గుర్తులుగా మిగిలిపోయాయి.

ర‌త్నం పెన్స్ అధినేత ర‌మ‌ణ‌మూర్తి కాలం చేశారంటే ఇవ‌న్నీ గుర్తొచ్చాయి.

Also Read : తొలి స్వదేశీ కలం రత్నం పెన్స్ అధినేత మృతి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp