అట్ట ముక్కల పై దేవుళ్ళ చిత్రాలు - రేషన్ డీలర్లు చేస్తున్నదేమిటి..?

By Kotireddy Palukuri Dec. 11, 2019, 07:37 am IST
అట్ట ముక్కల పై దేవుళ్ళ చిత్రాలు - రేషన్ డీలర్లు చేస్తున్నదేమిటి..?

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్లు చేస్తున్న వసూళ్ల దందా ప్రభుత్వానికి గుది బండలా తయారైంది. డీలర్లు యధాలాపంగా చేస్తున్న పండగ మామూళ్ళ వసూళ్లు వ్యవహారం జగన్ సర్కార్ కు చుట్టుకుంటోంది. ప్రభుత్వ ప్రమేయం ఏమి లేకపోయినా డీలర్ల వేషాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. తాను చేయని విషయం పై ప్రభుత్వం వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

అన్యమత ప్రచారం అంటూ ఆంద్రప్రదేశ్ లో రాజకీయం ఇప్పటికే మతాల చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకు ఏమి అవకాశం లేకపోవడం తో మతాలు, కులాల చుట్టూ రాజకీయం జరుగుతోందని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు ఆడుతున్న మతాల ఆట లో సహజంగానే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి... సీఎం జగన్ లక్ష్యంగా జరుగుతున్న కులం, మతం విమర్శల పై స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఐనా ఆంద్రప్రదేశ్ లో మతాల రాజకీయం ఆగేలా లేదు. తాజాగా కొన్ని ప్రాంతాలలో రేషన్ డీలర్లు ముద్రించిన నెల వారి రేషన్ పంపిణి అట్ట ముక్కలపై ఏసు క్రీస్తు, వెంకటేశ్వర స్వామి చిత్రాలు ఉండడంతో మళ్ళీ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఇది అసలు కథ..

రేషన్ డీలర్లు ఇలా అట్ట ముక్కల పై పంపిణి చేసే సరుకుల వివరాలు, దేవుడి ఫొటోలతో ముద్రించి ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. గత కొన్నేళ్లుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది ఇలా ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జరిగింది. ఇప్పుడు కొనసాగుతోంది.
ఐపాస్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణి సాగుతున్నప్పటి నుంచి డీలర్లకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో రేషన్ కార్డు నంబర్, లబ్ధిదారుల సంతకం లేదా వేలి ముద్ర రిజిస్టర్ లో వేపించుకుని డీలర్లు సరుకులు ఇచ్చేవారు. ఆ రిజిస్టర్ ను భద్రంగా దాచేవారు. అధికారులు ఆ రిజిస్టర్ ను తనిఖీ చేసి సరుకు వివరాలు తెలుసుకునేవారు. ఈ విధానం ఉన్నప్పుడు డీలర్లు ఆడిందే ఆట. పాడిందే పాట గా ఉండేది. డీలర్ షిప్ కోసం భారీగా పోటీ ఉండేది. పౌర సరఫరా, రెవెన్యూ అధికారులకు నెల వారి మామూళ్లు వెళ్ళేవి. ఆ మామూళ్ల మొత్తం ఆ డీలర్ పరిధిలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య ను బట్టి ఉండేది.

ఐతే, ఐపాస్ తో పరిస్థితి పూర్తిగా మారింది. వేలి ముద్రలు వేపించుకుని సరుకులు ఇవ్వాల్సి రావడంతో డీలర్లు, అదే విధంగా అధికారుల ఆదాయానికి గండి పడింది. బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుపడింది. ఐపాస్ వల్ల తమకు ఏమి మిగలడం లేదని, కమిషన్ పెంచాలంటూ డీలర్ల సంఘాలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సరికొత్త ఆదాయ మార్గాల కోసం డీలర్లకు నయా పంధా అవలంభిస్తున్నారు. ఐపాస్ వల్ల తమ వద్ద గతంలో ఉన్న రిజిస్టర్ తో పని లేకుండా పోయింది. ఎవరికి, ఎప్పుడు సరుకులు ఇస్తున్నామో తెలుసుకునెందుకంటూ ప్రతి ఏడాది డిసెంబలో ఒక అట్ట ముక్క పై నెల, సరుకుల వివరాలు, డీలర్ సంతకం తో కూడిన పేపర్ ను అతికించి, పై భాగంలో దేవుళ్ళ ఫోటో పెట్టి ఇచ్చేవారు. దీని తయారీకి 2 నుంచి 3 రూపాయలు అవుతుంది. ప్రింటింగ్ ప్రెస్ లలో వీటిని తయారు చేస్తారు. ఆ అట్ట ముక్కల పై ఎలాంటి వివరాలు ఉండాలో సంబంధిత డీలర్లు ముందుగానే ప్రింటింగ్ ప్రెస్ వారికి చెప్పేవారు. ఆ వివరాలు అట్ట ముక్కలు ముద్రించేవారు. కొంత మంది డీలర్లు తమ పేరును కూడా ముద్రించుకునే వారు.

ప్రతి ఏడాది డిసెంబర్లో రేషన్ కార్డుదారులకు ఈ అట్ట ముక్కలు ఇస్తారు. వారి వద్ద 20 నుంచి 40 రూపాయలు తీసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న కానుకలు ఇచ్చే సమయంలో వీటిని పంపిణి చేశారు. క్రిస్మస్ సమయంలో క్రిస్టియన్లకు ఏసు క్రీస్తు ఉన్న ఫోటో కూడిన అట్ట ముక్క ఇచ్చారు. సంక్రాతి కానుక సమయంలో హిందూ దేవుళ్ళ ఫోటో ఉన్న అట్ట ముక్క ఇచ్చారు. కొంత మంది డీలర్లు దేవుడి ఫోటోలు లేకుండానే ఇచ్చేవారు.

ఉదాహరణకు ఒక డీలర్ పరిధిలో 1000 కార్డులు ఉంటే అట్ట ముక్కల పంపిణి వల్ల 20 వేలు వచ్చేది. ఇందులో అతనికి అయ్యే ఖర్చు 2 వేలు మాత్రమే. మిగిలిన 18 వేల రూపాయల్లో పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులకు పండగ మామూళ్లు సమర్పించుకోవాలి. తూర్పు గోదావరిలోని పట్టణాలు, పట్టణాలను అనుకుని ఉన్న గ్రామాల్లో ఈ దందా సర్వసాధారణగా జరుగుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో కూడా జరుగున్నాయి. ఈ వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుంది. వీటిని అరికట్టాల్సిన అధికారులే మామూళ్ల కోసం చూసి చూడనట్లు ఉన్నప్పుడే వివాదాలు రేగుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఈ చర్యలకు అడ్డుకట్ట పడతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp