పత్రికా రంగంలో ముగిసిన అధ్యాయం ...

By Siva Racharla Dec. 15, 2019, 10:14 pm IST
పత్రికా రంగంలో ముగిసిన అధ్యాయం ...

Successful entrepreneur చుట్టూ negative positive మంచం నవారులా అల్లుకునంటాయి. రామోజీరావు అందుకు అతీతం కాదు. యాభై ఏళ్లుగా తెలుగునాట చోటుచేసుకున్న ప్రతి ఒక్క పరిణామంలోనూ ఈనాడుని పక్కనపెట్టి ఆలోచించడం వీలు కాదు. వివేకానందుడు ‘first you find a place grow, than branch out’ అన్న సూత్రాన్ని రామోజీ బాగా ఆకళింపు చేసుకున్నారు.

ఓ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తే, సుమారుగా 1970లో, అప్పటికి హైద్రాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 15 ఏళ్లు. రాష్ట్రంలో పెద్ద పత్రికలు ఆంధ్రప్రభ (విజయవాడ , బెంగళూరు), ఆంధ్ర పత్రిక (విజయవాడ , మద్రాసు), ఆంధ్రజ్యోతి (విజయవాడ ) వగైరాలేవీ విజయవాడ దాటి రాలేదు. రాజధానినీ పట్టించుకోలేదు. అలాంటప్పుడు, Human Resources, marketing, sales & technical aspects లో మరో కొత్త పత్రిక విజయవాడ లోనే రావాలి. కానీ, రామోజీ నలుగురి బాటలో కాకుండా కొత్త బాట నిర్మించారు. సగటు తెలుగువాళ్లకు సీమ, తెలంగాణలపై ఎలాంటి చిన్నచూపో ఉత్తరాంధ్రలపై అంతకంటే ఎక్కువ చిన్నచూపు. అలాంటిచోట ‘ఈనాడు’ పెట్టారు. ఏబీకె ప్రసాద్ లాంటి supersonic thinker ఎడిటరుగా, వాసుదేవరావు, పతంజలి, పాప (cartoonist) వగైరాలతో మొదలెట్టారు. వీళ్లంతా జస్ట్ 30+ యువకులు. (ఏబీకె ఎప్పుడూ ఇదే age patternతో టీమ్ సెట్ చేస్తారు).

ఈనాడు వచ్చేవరకు తెలుగు డైలీల్లో చివరి పేజీ సినిమా పేజీ. ఆ clicheనుంచి ఈనాడు బయటపడేసింది.  తెలుగులో కార్టూనుకికూడా ఎడిటోరియల్, బేనర్ స్టేటస్ కల్పించారు. 

విశాఖలో నిలదొక్కుకున్నాకనే రెండో ఎడిషన్‌ని విజయవాడలో ఆరంభించారు.  ఆ తర్వాత రాష్ట్ర రాజధానికి విస్తరించారు. ఈ అన్ని దశల్లోనూ పాఠకుడే దేవుడు, వాడికి నైవేద్యం తన పత్రికలోని అక్షరాలు అనుకున్నారు. కొందరు వెక్కిరించవచ్చు, ఆక్షేపించవచ్చుకూడా ‘దేవుడికి కలుషిత వార్తలు నైవేద్యం పెట్టాడా’ అని! ఎవరికి తోచినది వాళ్లు పెట్టేదే నైవేద్యం. అలాగే, రామోజీ రావు తన ప్రయారిటీలు ఎంచుకుని, పాఠకుడికి అందించేవారు.

Also Read: రాజధానిలో బయటపడ్డ మాజీ మంత్రుల బినామీ అసైన్డ్ భూముల భాగోతం

ప్రతి ఆదివారం ఆటవిడుపుకోసం ఆఫ్‌బీట్ ఐటమ్స్‌తో బ్రాడ్షీటులో సప్లిమెంట్ వేసేవారు. మొదటిసారిగా సీరియస్ వార్తలతో వెలువడే డైలీలో ‘సెక్స్ సైన్స్’ని ప్రచురించారు. అప్పట్లో ఈ శీర్షికను రన్ చేయడం నిజంగా సాహసమే! ఇప్పటికీ డైలీ పేపర్లు ‘లైంగిక విజ్ఞానం’ జోలికి వెళ్లవు. అదేదో మ్యాగజైన్ల శీర్షికగా భావిస్తాయి.

తన పత్రికలో ఏ శీర్షిక లేదా మరే క్యాంపెయిన్ మొదలుపెట్టినా ఒకటికి పదిసార్లు బ్రెయిన్‌స్టార్మింగ్ జరగాల్సిందే. మీటింగ్‌లో నోటికొచ్చింది చెప్పేసి హమ్మయ్య అనుకోవడానికి వీల్లేకుండా, నోట్స్ రాసుకుంటారు. తదుపరి మీటింగ్‌లో దానిపై రివ్యూ జరుగుద్ది. అందుకే ఎడిటోరియల్ మీటింగ్‌లకు ముందు చాలా గ్రౌండ్‌వర్క్ చేస్తుంటారు.

హడావుడిగా శీర్షికలు పెట్టేయడం, పేజీలకు పేజీలు పెంచేయడంలాంటి పిచ్చి పనులు రామోజీకి తెలీదు. ‘ఉదయం’ పత్రికలో టాబ్లాయిడ్లు ఆరంభించి, చేతులెత్తేయడమే ఒక ఉదాహరణ. సాఫల్య వైఫల్యాలు బాగా తూకం వేసి రామోజీ మొదలెట్టడంవల్లే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. ‘సాక్షి’ టాబ్లాయిడ్ కాకుండా బ్రాడ్షీట్ ఇద్దామనుకుని ప్రయోగం చేసి, చివరకు టాబ్లాయిడ్ దగ్గరకే వచ్చింది.

రామోజీ తన పొలిటికల్ ప్రయారిటీలను, పాఠకుడి ఆసక్తిని మరచిపోలేదు. ఎన్.టి.రామారావును భుజాన వేసుకుని మోసి, ఆయన ముఖ్యమంత్రి కాగానే తమ బాధ్యత ఇంతటితో తీరిపోయిందని ఫస్ట్ పేజీ ఎడిటోరియల్‌లో చెప్పుకొచ్చారు. భూమి బద్దలైనా తన పత్రిక పాఠకుడికి సకాలంలో చేరాల్సిందేనన్నది రామోజీ పాలసీ. ఏదైనా యాక్సిడెంట్ లేదా ఈవెంట్ జరిగితే మర్నాటి ‘ఈనాడు’ మిగతా పత్రికలకంటే అరగంట ముందుగా మార్కెట్లో ఉంటుంది.

ఒకసారి ఎన్టిఆర్ నిత్యావసరాలపై పన్ను వేయడమో ఏదో జరిగింది. అన్ని పత్రికలూ ఒక తీరుగా రాస్తే, ఈనాడులో ‘అటుకులు, మరమరాలపై పన్ను’ అని హెడ్డింగ్ పెట్టింది. ఇది పాఠకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇంత చిన్న తినుబండారాల్నికూడా ఎన్టిఆర్ వదల్లేదని ప్రజలు విమర్శించారు.

Also Read: చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!!!

వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే రామోజీకి ఎంత అయిష్టమో అందరికీ తెలిసిందే. వైఎస్ మొదటి ఏడాది పాలన ముగిసినప్పుడు ప్రత్యేక వ్యాసాలు, ఈటీవీ2లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేశారు. దానిపై రామోజీ ఆరా తీశారు. సహజంగానే రామోజీ అయిష్టత తెలుసు కాబట్టి, వైఎస్ పాలనలో లోపాలు, అవకతవకలపై ప్లాన్ చేశామన్నారు. రామోజీ వద్దన్నారు. ‘వైఎస్‌ని మొదటి ఏడాదిలోనే తిట్టిపోస్తే మిగతా నాలుగేళ్లూ అది కంటిన్యూ చేయగలమా? ఇప్పటికి ఆయన విజయాలు, పథకాలపై రన్ చేయండి. చివరి ఏడాదిలో చూసుకుందాం’ అని మొత్తం ప్లాన్ మార్చేశారు.

ఈనాడు పత్రిక కమ్యూనిస్టు పార్టీలాంటిది. పై స్థాయిలో తీసుకున్న నిర్ణయం నిక్చచ్చిగా కిందివరకు అమల్లోకి వస్తుంది. మిగతావన్నీ కాంగ్రెస్ పార్టీలాంటివి. పత్రికా స్వేచ్ఛ పేరుతో వయొలేట్ (violate) అవుతుంటాయి.

ఎవరినైనా టార్గెట్ చేశాడంటే, వాళ్లను భ్రష్టు పట్టించేవరకు నిద్రపోరని రామోజీ గురించి చెబుతారు. చెన్నారెడ్డి పొన్నుకర్ర, అంజయ్య హెలికాప్టర్ బొమ్మలతో ‘పాప’ వేసిన కార్టూన్లే పెద్ద ఎగ్జాంపుల్.

రామోజీకి కుటుంబమే ముఖ్యం. ఒకసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈటీవీ2తోపాటు నాలుగు చానెళ్లు ఆరంభించారు. అందరితోపాటు చంద్రబాబుకూడా గెస్ట్ కుర్చీల్లో ముందు వరుసలో కూర్చున్నారు. రామోజీ తన మనవరాళ్లతో చానెళ్లకు స్విచ్ఛాన్ చేయించారు. ఆ సమయంలో చంద్రబాబు ఈగో దెబ్బతినడంవల్లే ‘ఆంధ్రజ్యోతి’ పునఃప్రారంభానికి బీజం పడిందని చెబుతారు.

అన్నీ సక్సెస్‌లే ఉన్నాయనుకోవడానికి వీల్లేదు. రామోజీ ఖాతాలో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. వాటిలో పెద్ద ఫెయిల్యూర్ ‘న్యూస్ టైమ్’ ఇంగ్లీషు డైలీ. అలాగే ‘సోమ’ కూల్ డ్రింక్.

ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, ఈనాడు పత్రికలో మొట్టమొదటిసారిగా చీఫ్ ఎడిటర్‌గా రామోజీరావు పేరు మాయమైంది. ఆ ప్లేస్‌లో తెలంగాణకొకరు, ఆంధ్రప్రదేశ్కొకరు ఎడిటర్లుగా వచ్చారు. ఇక్కడొక విషయం తప్పకుండా చెప్పుకోవాలి. పబ్లికేషన్ రంగానికి రెండో తరం ఉండదు. ఒక తరంలోనే ఒక వెలుగు వెలిగి క్రమంగా మసకబారుతుంది. కొన్నయితే ఆరిపోయాయి కూడా. రెండో తరానికి అక్షరం విలువ తెలియకపోవడం, గోల్డ్ స్పూన్‌తో పుట్టడంతో సమాజంతో కలిసి ఎదగకపోవడం వంటి కారణాలతో గోయెంకా, కాశీనాథుని నాగేశ్వరరావు, కె.ఎల్.ఎన్.ప్రసాద్ వగైరాలు పెట్టిన పబ్లికేషన్లేవీ రెండో తరం చేతుల్లో సక్సెస్ కాలేకపోయాయి.

ఈ విషయం రామోజీకి తెలిసే ఉండొచ్చు. ఆయన నలభై ఏళ్లపాటు ఆధ్యాత్మిక, జ్యోతిష రంగాలకు ఈనాడులో చోటివ్వలేదు. ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక నగరమే కడుతున్నారు.

విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు అందరి జీవితంలో ఉన్నట్లే రామోజీ రావు ప్రయాణంలో కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈనాడు నుంచి రామోజీ రావు నిష్క్రమణ తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక తరం ముగిసిందని చొప్పుకోవచ్చు. రామోజీ వేసిన పునాదులపై ఈనాడు ఇలానే కొనసాగుతుందా..? లేక ఉత్థానపతనాలు చవిచూస్తుందా..? వేచిచూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp