ఆరోజు బెజవాడలో జరిగింది వర్మ పర్సనల్ గా తీసుకున్నారా? ధియేటర్ల వద్ద ఏం జరగనుంది.?

By Amar S Dec. 12, 2019, 07:49 am IST
ఆరోజు బెజవాడలో జరిగింది వర్మ పర్సనల్ గా తీసుకున్నారా? ధియేటర్ల వద్ద ఏం జరగనుంది.?

రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ద్వారా మరిన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. సినిమాలో పెట్టిన పాత్రలు, టైటిల్, విడుదలైన పాటలతో కమ్మరాజ్యంలో అసలు అనుకున్న సమయానికి విడుదలవుతుందని ఎవరూ అనుకోలేదు.. కనీసం విడుదల అవుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే సెన్సార్ టైటిల్ కు తీవ్ర అభ్యంతరం తెలిపింది. వర్మకూడా సినిమాను యూట్యూబ్ లో విడుదల చేసేస్తారని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో వర్మ తన సినిమా కోసం ఓ మెట్టు దిగారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని కాకుండా అమ్మరాజ్యంలో కడపబిడ్డలుగా టైటిల్ మార్చేసారు.

టైటిల్ మార్చినా సినిమాకు వచ్చిన నష్టమేంలేదు.. ఎందుకంటే ఇప్పటికే అందరికీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే టైటిల్ రిజిస్టర్ అయిపోయింది. లీగల్ ఇష్యూస్ నుంచి తప్పించుకోడానికే టైటిల్ మార్చడానికి వర్మ ఒప్పుకున్నాడు. ఈ సినిమా నిజానికి నవంబర్ 29న విడుదల కావాల్సింది. కానీ కాలేదు.. కారణం సినిమాకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపించింది.. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ కమిటీ చూసినా అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అడిగితే రివైజింగ్ కమిటికీ వెళ్లాల్సిందిగా వర్మకు సూచించారు. ఈసినిమా విషయంలో ఏదైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే రివైజింగ్ కమిటీ చూసుకుంటుందని సెన్సార్ సభ్యులు వర్మకు చెప్పారు. అందుకే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేవరకూ వర్మ ఏం చేయలేకపోయారు. కోర్టులు కూడా వర్మ సినిమాపై వేసిన పిటిషన్ ను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

గత ఏడాదినుంచి ఆర్జీవీ తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు, లోకేశ్ లపై చాలా గుర్రుగా ఉన్నాడు.. కావాలనే వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు.. చంద్రబాబు, లోకేశ్ తో అయితే ఆడేసుకుంటున్నాడు. ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వర్మ ఇప్పుడు కమ్మరాజ్యం అంటూ మళ్లీ చంద్రబాబుతో సై అనేలా సినిమా చిత్రీకరించాడు. గత ఎన్నికల ప్రచారంతోపాటు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన అనంతరం జరిగిన పరిణామాలను వర్మ చిత్రీకరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విజయం సాధించడంతో అదే ఉత్సాహంలో కమ్మరాజ్యం సినిమా చేసాడు వర్మ.. ఈ చిత్రంలో తాను ఎవరినీ తక్కువ చేసి చూపించలేదని ఆర్జీవీ చెబుతున్నా.. పాత్రలన్నీ కావాలనే తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. దీంతో అసలు ఈ చిత్రం ఎలా విడుదలవుతుందో చూస్తామంటూ టీడీపీ శ్రేణులు వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం చూస్తుంటే అసలు ఏపీలో కమ్మరాజ్యం సినిమాను విడుదల కానిస్తారా అనే అనుమానం వ్యక్తమవుతుంది.

అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా తెలంగాణలో విడుదలైన రెండు నెలల తర్వాత ఆంధ్రాలో విడుదలైంది. అయితే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మరింత పర్సనల్ గా తీసుకున్నట్టు అర్ధమవుతోంది. ఏపీలో సినిమాను విడుదల కానివ్వకపోవడం.. సినిమా ప్రమోషన్ కు విజయవాడ వచ్చిన వర్మను ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవడం.. ఆరోజు విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా కనీసం హోటల్ ఇవ్వనివ్వకపోవడం.. పోలీసులు మొదట పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అనుమతినిచ్చి తర్వాత అక్కడ కూడా అడ్డుకోవడం వంటి ఘటనలను వర్మ గుర్తుంచుకుని సహజంగానే కాంట్రవర్సీలకు వెళ్లే వర్మ టీడీపీని మరింత హర్ట్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నట్టు అర్ధమవుతోంది.

అనుకున్నట్టుగానే కమ్మరాజ్యం సినిమాలో టీడీపీని ఓ స్థాయిలో వర్మ టార్గెట్ చేసాడు. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనేక అవరోధాలు దాటుకుని విడుదల తేదీకూడా వచ్చేసింది. మరి ఏపీలో తెలుగు తమ్ముళ్లు సినిమాను విడుదల కానిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.. ఇప్పటికే సినిమాలో తన పాత్రను అసభ్యకరంగా చూపించారంటూ కేఏ పాల్ కోర్టును ఆశ్రయించానన్నారు. మళ్లీ ఆ ఊసులేదు.. సినిమాకు సంబంధించి తెలంగాణలో ఏ గొడవా లేకపోయినా ఏపీలో తెలుగుతమ్ముళ్లు సినిమా ధియేటర్ల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు సెన్సార్ సూచనల మేరకు టైటిల్ మార్చిన వర్మ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ పెట్టారు. యూ/ఏ సర్టిఫికెట్ తో ఎట్టకేలకు విడుదలవుతున్న ఈ సినిమాపై రాజకీయంగా చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మొదటినుంచి ప్రమోట్ చేస్తూ వచ్చిన వైసీపీ శ్రేణులు కూడా సినిమాపట్ల ఆసక్తి కనబరుస్తుండగా ఈ సినిమా ధియేటర్లలో ఎలా ఆడుతుందో మేమూ చూస్తామని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp