రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అంతా సిద్ధం

By Karthik P Mar. 01, 2021, 01:11 pm IST
రామాయపట్నం  పోర్టు నిర్మాణానికి అంతా  సిద్ధం

ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ ప్రక్రియలో కీలక పరిణామం. రెండు దశల్లో నిర్మించబోతున్న రామాయపట్నం పోర్టులో తొలి దశ నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. రివర్స్‌ టెండర్లలో నిర్మాణ పనులను అరబిందో ఇన్‌ఫ్రా, నవయుగ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పోర్టు పనులు చేయబోతున్నాయి.

తొలి దశలో భాగంగా పలు విభాగాల పనులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2,647 కోట్ల అంచనాలతో టెండర్లను ఆహ్వానించింది. మేఘా సంస్థ, అరబిందో–నవయుగ (జాయింట్‌ వెంచర్‌) ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన విలువకన్నా.. మేఘా సంస్థ 4.9 శాతం, అరబిందో–నవయుగ 4.5 శాతం ఎక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేశాయి.

పని విలువ పది లక్షల రూపాయలు దాటితే రివర్స్‌టెండర్లు నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్న జగన్‌ సర్కార్‌.. రామాయపట్నం పోర్టుకు రివర్స్‌ టెండర్లు పిలిచింది. ఈ సమయంలోనూ అరబిందో–నవయుగ, మేఘా సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. రివర్స్‌ టెండర్లలో అరబిందో–నవయుగ ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా 0.5 శాతం తక్కువకు కోట్‌ చేశాయి. ప్రభుత్వం 2,647 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన పనులను 2,634 కోట్ల రూపాయలుకు చేసేందుకు అరబిందో–నవయుగలు ముందుకు వచ్చాయి. టెండర్లలో 2,647 కోట్ల రూపాయల పనులను 2,766.11 కోట్ల రూపాయలకు చేస్తామని టెండర్లు వేసిన అరబిందో–నవయుగలు రివర్స్‌ టెండర్లలో అవే పనులను 2,634 కోట్ల రూపాయలకు చేసేందుకు ముందుకు వచ్చాయి. రివర్స్‌ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 119.11 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

రివర్స్‌ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ రివ్యూకు పంపనుంది. హైకోర్టు జడ్టి నేతృత్వంలోని జుడిషియల్‌ కమిటీ పరిశీలన, ఆమోదం తర్వాత టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయనుంది.

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, రామాపట్నం వద్ద పోర్టును నిర్మించాలనే ప్రతిపాదనలు ఏళ్లతరబడి నుంచి ఉన్నాయి. 2009లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హాయంలో పోర్టును నిర్మిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. 2011లో ఈ ప్రకటన ప్రతిపాదనల వైపు మళ్లింది. ఆ సమయంలో రాష్ట్ర పట్టణ, పురపాలక మంత్రిగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే.. మంత్రిగా ఉండడంతో పోర్టు కల సాకారమైనట్లేననే నమ్మకం అందరిలోనూ నెలకొన్నాయి. రామాయపట్నం చుట్టుపక్కల భూములకు రెక్కలు వచ్చాయి. భూముల క్రయ విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత రామాయపట్నం బదులు.. నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజట్నంలో పోర్టు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనలు అటకెక్కాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కూడా రామాయపట్నంపై సీతకన్ను వేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే పాలసీతో సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెనుకబడిన ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం, తూర్పు ప్రకాశంలో రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వెలిగొండ తొలి టెన్నల్‌ పనులు పూర్తవగా.. రెండో టెన్నల్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా రామాయపట్నం పోర్టు పనులు టెండర్‌ దశ దాటాయి. రెండు దశల్లో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టుపై ప్రభుత్వం తొలి దశలో 3,736.14 కోట్లు, రెండో దశలో 10,640 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp