గొర్రెల రాజ్యంలో వర్మ..

By Kiran.G Dec. 13, 2019, 06:47 pm IST
గొర్రెల రాజ్యంలో వర్మ..

అనగనగా ఒక "కంపెనీ"ఉంది. కంపెనీ స్థాపించిన మొదట్లో చాలా విలువైన వస్తువులను తయారు చేసి గొర్రెల మనసులను గెలుచుకుంది.. చాలా కొత్త కొత్త ప్రోడక్టులను మార్కెట్ లోకి దింపి,గొర్రెల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. దాంతో గొర్రెలు ఆ "కంపెనీ"స్థాపించిన సీఈఓని అభిమానిమాచడం మొదలు పెట్టాయి. ఏమైందో తెలియదు కానీ అదే "కంపెనీ" కొన్ని సంవత్సరాల అనంతరం సీఈఓ ఆదేశాల మేరకు, చైనా వస్తువుల కంటే నాసిరకమైన వస్తువులను తయారు చేయడం మొదలు పెట్టింది. కానీ గొర్రెల్లో ఆ "కంపెనీ"పై ఉన్న నమ్మకం కారణంగా వస్తువుల అమ్మకాలు వెంటనే పడిపోలేదు. కానీ మెల్లమెల్లగా గొర్రెలకు కూడా అసలు విషయం అర్థం అయ్యింది. అందుకే ఆ "కంపెనీ"వస్తువులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని కొనడం ఆపేసాయి.

దీనితో "కంపెనీ" సీఈఓ కొత్త ఎత్తు వేసాడు. గొర్రెల్లోని కొందరు చిన్న నాయకుల పేర్లతో నాసిరకమైన వస్తువులను తయారు చేసి తన "కంపెనీ" ద్వారా అమ్మడం మొదలుపెట్టాడు. గొర్రెలేమో తమ నాయకుల పేర్లతో వస్తువులు తయారయ్యాయని అందులో ఏదో స్పెషాలిటీ ఉందేమో అన్న ఆశతో మొదటిరోజే ఆ వస్తువు కొనడానికి ఎగబడ్డాయి. ఎంతో ఆశతో వెళ్లి మొదటిరోజే వస్తువును కొంటే, అంతకు ముందు తయారుచేసిన వస్తువు కన్నా మరింత నాసిరకమైన వస్తువు వాటి మోహన విసిరేసాడు ఆ కంపెనీ సీఈఓ. ఇంత నాసిరకమైన వస్తువులు మా మొహాన కొడతావా? అసలు ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తావ్? గొర్రెలంటే కొంచెం కూడా ప్రేమ లేదా నీకు అని సీఈఓని ప్రశ్నించాయి గొర్రెలు.

మోసం చేయడం తప్పు కాదు.. మోసపోవడం మాత్రమే తప్పని వికటాట్టహాసం చేశాడా సీఈఓ.. మీరు గొర్రెలు కాబట్టే నా ప్రోడక్టులను కొంటున్నారు. అసలు నా కంపెనీ తయారుచేసే వస్తువులను ఎవడు కొనమన్నాడు మిమల్ని..నా ఇష్టమొచ్చిన వస్తువులు తయారు చేసుకుంటాను. నా ఇష్టమొచ్చిన పేర్లు పెడతాను. నచ్చితే కొనుక్కోండి.. కొనకుంటే పక్కకు పోండి. అంతేకాని ఇలా అనవసర వాదనలు చేసి నా విలువైన సమయాన్ని వృథా చేయొద్దన్నాడు సీఈఓ.. ఆ మాటలు విన్న గొర్రెలు చిన్నబుచ్చుకుని ఇంకోసారి నీ వస్తువు కొనడం కంటే కొరివితో తల గోక్కోవడం మంచిదని అక్కడనుండి వెళ్లిపోయాయి.

గొర్రెలు తన వస్తువులు కొనకపోతే తన బిజినెస్ కొనసాగదని తెలుసుకున్న సీఈఓ ఈ సారి కొత్త ఎత్తుగడ వేసాడు. తరతరాలుగా గొర్రెల్లో వస్తున్న సంస్కృతిని కించపరిచేవిధంగా కొత్త ప్రొడక్టుని తయారు చేయించాడు. గొర్రెల చట్టాలు తనకి అనుకూలంగా లేవని ముందే జాగ్రత్తపడి,తన "కంపెనీ"సహాయంతో, విదేశాల్లో ఆ వస్తువు తయారయ్యేవిధంగా చర్యలు తీసుకున్నాడు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే ఆ వస్తువు దొరుకుతుందని బయట షాపుల్లో దొరకదని, గొర్రెల దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ కనిపెట్టబడని వింత వస్తువును తయారు చేసానని ప్రచారం చేసుకున్నాడు. ఇంకేం మొదటిరోజు ఆన్లైన్ లో ఆ వస్తువును కొనడానికి గొర్రెలన్నీ ఎగబడ్డాయి. దీంతో "కంపెనీ" ఆన్లైన్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. కంపెనీకి ఇంతకుముందెన్నడూ రాని లాభాలు వచ్చాయి కానీ,గొర్రెలు మళ్ళి మోసపోవడంతో తమ ఆక్రోశాన్ని సీఈఓ పై వెళ్ళగక్కాయి.

గొర్రెలెప్పుడూ కసాయివాడినే నమ్ముతాయని ఎగతాళి చేస్తూ చిరునవ్వు నవ్వాడు సీఈఓ. కానీ గొర్రెల్ని మోసం చేస్తున్న సీఈఓలోని తెలివితేటల్ని,తిమ్మిని బమ్మి చేసైనా తన వస్తువుని అమ్మగలిగే సామర్ధ్యాన్ని చూసి కొన్ని గొర్రెలు ఆ సీఈఓ భజన ప్రారంభించాయి. సీఈఓని మెచ్చుకునే గొర్రెల సంఖ్య అమాంతం పెరిగింది. గొర్రెల్లో ఉన్న చిన్న చిన్న బలహీనతలను ఆసరాగా చేసుకుని వాటి మనోభావాలు దెబ్బతినే విధంగా, వాటిలో ఉన్న ముఖ్యమైన నాయకులను కించపరిచే విధంగా తన వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆ నాయకులను అభిమానించేవారు, ఆ నాయకులను ద్వేషించేవారు కూడా కంపెనీ తయారుచేసే కొత్త వస్తువు పట్ల ఆసక్తిని చూపించారు. ఎలాగూ అభిమానించే గొర్రెలు ఉన్నాయి కాబట్టి సీఈఓ "కంపెనీ" లాభాల బాట పడుతూనే ఉంది.

ఒక గొర్రెల విలేఖరి ఒకరోజు మీ విజయ రహస్యమేంటని సీఈఓని అడిగాడు. గొర్రెలెప్పుడు కసాయివాడినే నమ్ముతాయి.. గొర్రెలున్నంతవరకు నాలాంటి వాళ్ళు స్థాపించే కంపెనీలు లాభాల్లోనే ఉంటాయి తప్ప నష్టాల్లో ఉండవు. నమ్మడం వాటి ధర్మం. నమ్మించడం నా తెలివి. మోసపోవడం వాటి బలహీనత, మోసంలో లాభాన్ని వెతకడం నా సమయస్ఫూర్తి అన్నాడు. ఆ ఇంటర్వ్యూ చుసిన అభిమాన గొర్రెలు ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టాయి. మిగతా గొర్రెలు మళ్ళీ మోసపోకూడదని నిర్ణయించుకున్నాయి.

సీఈఓ ఈసారి ప్రపంచ చరిత్రలోనే అత్యంత కొత్త వస్తువును తయారుచేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు. సీఈఓ ప్రకటన విన్న గొర్రెలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధం అయ్యాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp