రాజుగారి విందులో రాజ్ నాధ్ సందడి.. పార్టీ ధిక్కారమా.?

By Amar S Dec. 12, 2019, 10:26 am IST
రాజుగారి విందులో రాజ్ నాధ్ సందడి.. పార్టీ ధిక్కారమా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణం రాజు నిన్న రాత్రి ఢిల్లీలో భారీ విందు ఇచ్చారు. ఆంధ్ర వంటకాలను ఎంపీలకు రాజు గారు రుచి చూపించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈ విందును రఘురాజు ఇవ్వగా దాదాపుగా పలువురు ఎంపీలు, వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ముందుగా జనపథ్‌, లాన్స్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ కోర్టులోని తన వియ్యంకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఈ విందు జరగనుందని భావించగా కాంగ్రెస్ సభ్యుడి ఇంట్లో ఇచ్చే విందుకు కేంద్ర మంత్రులు వెళ్లడం బాగుండదన్న ఉద్దేశంతో చివరికి రఘురాజు తాత్కాలిక నివాసమైన వెస్ట్రన్ కోర్టులో ఏర్పాటుచేశారు. అయితే ఈ విందుకు దాదాపు 300 మందిని ఆహ్వానించినట్టు వార్తలు వచ్చినా కొందరు కేంద్రమంత్రులు, ఎంపీలు మాత్రమే వచ్చినట్టు సమాచారం. పార్టీలకతీతంగా ఎంపీలకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విందు ఇచ్చారు. అయితే రఘురాజు విందుపై రాజకీయవర్గాల్లో మొదటినుంచి ఆసక్తికర చర్చ జరుగుతూ వచ్చింది. రాత్రి జరిగిన విందుకు అమిత్ షా వస్తారని ప్రచారం జరిగినా ఆయన గైర్హాజరయ్యారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, వైసీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మిధున్ రెడ్డి, నందిగం సురేష్ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, టీఆర్ఎస్, టీడీపీ నేతలు మిథున్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విందుకు హాజరైన ఎంపీలను రఘురాజు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిట్ చాట్ లో రఘురాజు మాట్లాడారు. విందుకోసం 300 మంది ఎంపీలను ఆహ్వానించానని చాలామంది వస్తానని తనతో చెప్పారన్నారు. ఈ పార్టీలో వెయ్యి రూపాయల పాన్ వాడారని వార్తలొచ్చాయని, కానీ దాని ఖరీదు రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా చాలామంది ఎంపీలు గతంలో పార్టీలు ఇచ్చారని, ఈ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా తాను పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, పార్లమెంట్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికవడం కూడా విందు ఇవ్వడానికి ఓ కారణమన్నారు. తాను విందు నిర్వహించే విషయంలో వైసీపీకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని రఘురాజు తెలిపారు. తాను ముందుగా తమ పార్టీకి చెందిన ఎంపీలనే పిలిచానని, చిన్న చిన్న పార్టీలకు చెందిన ఎంపీలను సైతం విందుకు ఆహ్వానించానని చెప్పారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈవిందు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. తనకు, జగన్‌కు మధ్య దూరం పెంచడానికి తమ పార్టీకిచెందిన కొందరు ప్రయత్నిస్తున్నారని, తనపై పార్టీ అధినేతకు ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతున్నారని ఆరోపించారు. వారిపేర్లు తానే బయటపెట్టనని,తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలో ఉన్న పెద్దలకు దగ్గరవడానికి అందరికీ విందు ఇవ్వాల్సిన అవసరంలేదని, దగ్గర కావాలంటే వాళ్లను మాత్రమే పిలిచి విందు ఇస్తాను కదా అని ఆయన ప్రశ్నించారు.

నేను అందరితోనూ సఖ్యతగానే ఉంటానన్నారు. తాను బీజేపీలోకి వెళ్తానని వస్తున్న వార్తలను రఘురాజు ఖండించారు. ఏపీలో చాలా సినిమా ఫంక్షన్లు, రాజకీయనేతలు, పారిశ్రామిక వేత్తల డిన్నర్ పార్టీలకు తాను హాజరవుతానని, అప్పుడు రాజకీయాల్లో లేను కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంపీని కాబట్టి ఎక్కువమంది తనను పట్టించుకుంటున్నారని తెలిపారు. అయితే ఒక ఎంపీ శీతాకాల సమావేశాల్లో తోటి ఎంపీలకు విందు ఇవ్వడం కొత్త విషయం కాకపోయినా రాజుగారు భారీ ఎత్తున వందలమందికి ఆహ్వానాలు పంపడ.. పెద్దఎత్తున ఏర్పాట్లు చేయడం.. బీజేపీ అగ్రనేతలను పిలవడం.. వైసీపీతో దూరంగా ఉంటున్నారనే వార్తలు రావడం.. ఆయన పార్లమెంట్ స్థానంనుండి బలమైన నేతలు వైసీపీలో చేరడం వంటివి పలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే వైసీపీకి చెందిన ఎంపీలు కూడా ఈ విందుకు హాజరై రఘురాజు చేస్తుంది పార్టీ ధిక్కార విందు కాదని చెప్పకనే చెప్పారు. గతంలోనూ తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు ఢిల్లీలో ఆయా సామాజివర్గాల వారీగా విందులు ఇచ్చారు. కొందరు పార్టీల పరంగా మరికొందరు పార్టీలకతీతంగా విందులు ఇచ్చిన సందర్భాలున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp