నిన్న విస్తరణ..నేడు అసమ్మతి

By Srinivas Racharla Sep. 27, 2021, 03:15 pm IST
నిన్న విస్తరణ..నేడు అసమ్మతి

పంజాబ్​లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. అంతలోనే కొత్త సీఎంకి అసమ్మతి సెగ తగిలింది. అమరీందర్‌ వర్సెస్ సిద్ధూ ఎపిసోడ్‌లో చరిష్మా కలిగిన సిద్దూకే అధిష్టానం ఓటేసింది.దీంతో సిద్ధూ వర్గానికి చెందిన చరణ్​ సింగ్​ చన్నీకి ముఖ్యమంత్రి పీఠం దక్కింది.సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా సిక్కు- నాన్ సిక్కు ఫార్ములాకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో స్వతంత్ర భారతంలో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఓ దళితుడికి దక్కింది.

గత సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ కొత్త మంత్రివర్గంపై భారీ కసరత్తు చేశారు.ఢిల్లీకి మూడు పర్యాయాలు వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం, ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. రాహుల్ అభీష్టం మేరకు యువతకు పెద్దపీట వస్తూ సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని కొత్త సీఎం మంత్రివర్గ ఏర్పాటు చేశారు.

Also Read : ఎన్నికలకు ఇక ఐదు నెలలే.. క్యాబినెట్ లో భారీ మార్పులు

మంత్రివర్గంపై రాహుల్ మార్క్.. 

పంజాబ్​లో 15 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది.అమరీందర్ కేబినెట్‌లోని ఐదుగురు మంత్రులకు చోటు దక్కకపోగా ఆరుగురు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాగా మాజీ సీఎం అమరీందర్ విశ్వాసపాత్రులైన బ్రహ్మ మొహీంద్రా, విజేంద్రర్ సింఘ్లా, భ‌ర‌త్ భూష‌ణ్ అషు లు కొత్త కేబినెట్‌లోను చోటు దక్కించుకున్నారు.గత కేబినెట్‌లో తనను విస్మరించారని అసంతృప్తి చెందిన అమ్లోహ్ శాసనసభ్యుడు రణదీప్ సింగ్ నాభాకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆయనకి కుల్జిత్ నగ్రా స్థానంలో క్యాబినెట్ బెర్త్ ఇవ్వబడింది. ఇసుక మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద మాజీ మంత్రి రాణా గుర్జిత్‌సింగ్‌కి సైతం కేబినెట్‌లో అవకాశం దక్కింది.

రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్లు సీఎం చరణ్ సింగ్ యువత,కొత్త ముఖాలతో మంత్రివర్గ కూర్పులో తన మార్క్ చూపించారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.తొలుత సీనియర్ నేతలైన బ్రహ్మ మొహీంద్రా,మన్‌ప్రీత్ సిగ్ బాదల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో పాటు త్రిప్త్ రజిందర్ సింగ్ బజ్వా, సుఖ్బీందర్ సర్కారియా,రాణా గుర్జీత్ సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ ఆషు, విజయ్ ఇం దర్ సింఘ్లా,రణదీప్ సింగ్ నాభా, రాజ్‌కుమార్ వెర్కా,సంగీత్ సింగ్ గిల్జియాన్, పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రజా వార్రింగ్, గుర్‌కీరత్ సింగ్ కోట్లి మంత్రులుగా కొత్త కేబినెట్‌లో స్థానం పొందారు.

Also Read : నాడు చంద్రబాబు, నేడు మాయావతి.. ఒకే డైలాగ్‌

మొదలైన అసమ్మతి స్వరాలు

కెప్టెన్ అమరీందర్​ మంత్రివర్గంలో పనిచేసిన చాలామందికి ఉద్వాసన పలకడంతో కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. అవినీతి ఆరోపణలున్న మాజీ మంత్రి రాణా గుర్జిత్‌సింగ్‌కు మంత్రివర్గంలో మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు సిద్ధూకు లేఖ రాశారు.స్వచ్ఛమైన దళిత నాయకుడికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా క్యాబినెట్ బెర్త్‌ను భర్తీ చేయాలని నాయకులు కోరారు.ఈ లేఖ కాపీ ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ చన్నీకి కూడా పంపారు.

అమరీందర్ క్యాబినెట్‌లోని మంత్రులు బల్బీర్ సింగ్ సిద్ధూ,గుర్ ప్రీత్ సింగ్ కంగర్ తమని క్యాబినెట్ నుంచి తొలగించడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు తాను రాత్రంతా అందుబాటులో ఉండి కష్టపడి పనిచేశానని మాజీ ఆరోగ్య మంత్రి బల్బీర్ భావోద్వేగంతో పేర్కొన్నారు.నా తప్పేమిటి, నన్ను ఎందుకు క్యాబినెట్ నుంచి తొలగించారని పార్టీ హైకమాండ్‌ని ఆయన ప్రశ్నించారు. కానీ నేను సోనియా గాంధీ సైనికుడిని అని ఆయన పేర్కొనటం గమనార్హం.

తాజాగా పదవి కోల్పోయిన ఆర్థిక శాఖ మంత్రి గుర్ ప్రీత్ సింగ్ కంగర్ కూడా అధిష్టానానికి తన నిరసన తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వారు నా రాజీనామా అడగగా సంతోషంతో ఇచ్చానని తెలిపారు.నేను మంత్రిత్వ శాఖను కోల్పోయినందుకు కలత చెందలేదు. కానీ నా ప్రాంత ప్రజలు నిరాశ చెందారంటూ పరోక్షంగా తన అసమ్మతి గళం వినిపించారు.

ఇక క్యాబినెట్ విస్తరణలో పదవీచ్యుతులైన నేతలకి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టి అసమ్మతిని బుజ్జగించే ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.అధికారం సిద్దూ చేతిలో బంది అయిందనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే దిశలో కొత్త సీఎం చరణ్ సింగ్ అడుగులు వేశాడు.

మరో ఐదు నెలల తర్వాత జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో నూతన మంత్రుల పనితీరే కాంగ్రెస్ గెలుపుకి కీలకం కానుంది.

Also Read : కేరళ బీజేపీలో హైవే దోపిడీ కల్లోలం,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలగింపు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp