రైల్వే శాఖ ప్రకటనపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

By Srinivas Racharla Jul. 25, 2020, 10:52 pm IST
రైల్వే శాఖ ప్రకటనపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల ఇక్కట్లు,మొన్నటి చైనాతో సరిహద్దు వివాదం వంటి పలు అంశాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నాడు. అలాగే కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆరోగ్య,ఆర్థిక సంక్షోభాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు.

తాజాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా కేంద్రం లాభాపేక్షతో పనిచేస్తుందని ఆయన విమర్శించాడు.

కరోనా ప్రేరిత లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు మే 1 నుంచి రైల్వే శాఖ 'శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ శ్రామిక్‌ రైళ్ల ద్వారా సుమారు 63 లక్షల వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరారు. జూలై 9 వరకు 4,496 ప్రత్యేక రైళ్లు నడపగా రూ.429 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఓ ప్రకటనలో రైల్వే శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైల్వే శాఖ ప్రకటనపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబడుతూ ‘‘దేశంపై కరోనా మహమ్మారి అనే మబ్బు దట్టంగా కమ్ముకుంది.ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం లాభాలను ఆర్జించింది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం విపత్తును లాభాలుగా మార్చుకొని సంపాదిస్తోంది’’ అని హిందీలో ట్వీట్‌ చేశాడు. దీనికి రైల్వే ఆదాయానికి సంబంధించిన నివేదికను ట్యాగ్ చేశాడు. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్రం,రైల్వే శాఖ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp