సావర్కర్ ని కాదు గాంధీని

By Sridhar Reddy Challa Dec. 14, 2019, 03:38 pm IST
సావర్కర్ ని కాదు గాంధీని

పార్లమెంట్ కు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది తాను కాదని, దేశ ఆర్ధిక వ్యవస్థని ధ్వంసం చేసిన ప్రధాని మోడీ అమిత్ షా లేనని రాహుల్ తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. పార్లమెంట్ లో బిజెపి తనని క్షమాపణ చెప్పమన్నప్పుడు నిజాలు మాట్లాడేవాళ్ళు క్షమాపణలు చెప్పరని తెగేసి చెప్పానన్నారు. తానూ రాహుల్ సావర్కర్ ని కాదని రాహుల్ గాంధీనని పరోక్షంగా బిజెపి ని ఉద్దేశించి చురకలంటించారు.

ఈరోజు న్యూఢిల్లీ లోని రామ్ లీల్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "భారత్ బచావొ' ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ భిన్న జాతులు మతాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారత దేశంలో ఇప్పుడేం జరుగుతుందోనని యావత్ ప్రపంచం మనవైపు చూస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరికి తెలుసనీ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ఇలా దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లో ప్రజల మధ్య మోడీ ఎలా మంటలు పెట్టారో చెప్తారన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ప్రధాని 1000, 500 నోట్లు రద్దు చేసినప్పుడు ఎన్నో అబద్దాలు చెప్పారని, నల్లధనాన్ని వెనక్కి తెస్తాం, అవినీతిని నిర్ములిస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక అవేమి చెయ్యకుండా ప్రజలను మోసగించారని, లక్షల కోట్ల రూపాయలు అదానీ అనిల్ అంబానీ ల జేబులో వేశారని ఆరోపించారు.

పౌరసత్వ సవరణ బిల్లు ని కూడా రాహుల్ గాంధీ విమర్శిస్తూ దీనివాల్ల ఈశాన్య రాష్ట్రాల గోడు వినే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. మోడీ సర్కార్ దేశాన్ని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆర్ధిక వ్యవస్థ ఐసీయూ లో ఉందని ఇవాళ జిడిపి మార్పులు చేసిన తరువాతనే 4% ఉందని గతంలో తీసుకున్న సూచిలు ఆర్ధిక గణాంకాలు ప్రకారం అయితే ప్రస్తుత వృద్ధి రేటు 2.5% లోపేనని రాహుల్ గాంధీ ఆరోపించారు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో పాటు పలువురు సీనియర్ నేతలు, పలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, యువజన, మహిళా, సేవాదళ్ నేతలు తో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఈ "భారత్ బచావో" ర్యాలీకి హాజరయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp