జాతీయ నాయకుల విమర్శలతో హోరెత్తిన బీహార్ ఎన్నికల ప్రచారం

By Srinivas Racharla Oct. 23, 2020, 09:00 pm IST
జాతీయ నాయకుల విమర్శలతో హోరెత్తిన బీహార్ ఎన్నికల ప్రచారం

బీహార్ గడ్డపై ఒకే రోజు ఇరువురు జాతీయ నాయకులు అడుగుపెట్టడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అధికార ఎన్డీయే తరపున ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ తరుపున రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.

ఎన్డీయే పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ తమ పాత ఎత్తుగడను అనుసరిస్తూ ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశాలతో ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశాడు. శుక్రవారం సాసారం నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.దేశంలోని ప్రజలంతా ఆర్టికల్ 370 ఎప్పుడు రద్దవుతుందా? అని ఎదురు చూస్తే ప్రతిపక్షాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి దానిని పునరుద్దిస్తామని చెబుతున్న వ్యక్తులు ఓట్లు అడగడానికి ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు.కాగా గతేడాది ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభలలో ఆర్టికల్ 370 రద్దు బిల్లును ఎన్డీయే ప్రవేశపెట్టగా జేడీయూ ఎంపీలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి గయ ఎన్నికల సభలో పాల్గొన్న నరేంద్ర మోడీ సమాజ వ్యతిరేక శక్తులతో కూడిన కలగూరగంప ప్రతిపక్ష 'మహాఘట్ బంధన్' అని విమర్శలు గుప్పించాడు.ప్రస్తుతం బీహారులో విద్యుత్ కాంతులీనుతోంది.లాంతరు రోజులు గడించాయి అని ఆర్జేడీ గుర్తు (లాంతరు)ను ఉద్దేశించి మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తిరిగి నక్సలిజం విజృంభిస్తుందని ఆరోపించాడు.1990 నాటి ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో సంఘ వ్యతిరేక శక్తులు స్వేచ్ఛగా తిరగడంతో శాంతిభద్రతలు క్షీణించి ఆనాడు ప్రజలకు రక్షణ కరువైందని ప్రధాని విమర్శించాడు. ప్రజలను పేదరికంలో మగ్గేలా చూడటమే ప్రతిపక్షాల మహా కూటమి లక్ష్యమని ప్రజలు వారి మాయలో పడవద్దని ప్రధాని హెచ్చరించడం గమనార్హం. ఇక బీహార్ మళ్లీ దుష్టపాలన వైపు మరలకుండా అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోవాలంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయేకు ప్రజలు తిరిగి పట్టం కట్టాలని మోడీ విజ్ఞప్తి చేశాడు.

ఆదానీ,అంబానీ ప్రయోజనాలకై మోడీ పని చేస్తున్నాడన్న రాహుల్

ఇవాళ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ కేంద్రంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు.గాల్వాన్‌ సరిహద్దులలో చైనా సైనికులతో తలెత్తిన ఘర్షణలో బీహార్‌ చెందిన జవాన్లు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. అలాగే పుల్వామాలో కూడా అమరులైన సైనికులకు నమస్కారం అంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకురాలేదని ప్రధాని మోడీ జాతి మొత్తానికి అబద్ధాలు చెప్పారని రాహుల్‌ విమర్శించాడు.ఇలా అబద్ధాలాడి భాతర సైన్యాన్ని అవమాన పరిచారని మండిపడ్డాడు.చైనా జవాన్ ల చొరబాటును అడ్డుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నాడు.భారత భూభాగంలోని చైనా సైనిక బలగాలు ఎప్పుడు వెనక్కు వెళతాయో ప్రధాని చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశాడు.

ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులపై దాడికి దిగిందని రాహుల్ ధ్వజమెత్తాడు.ఈ చట్టాల ద్వారా రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డులకు, కనీస మద్దతు ధర తీవ్రంగా దెబ్బతిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.గత ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీని ఇచ్చారని, కానీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని ఆరోపించాడు. ఈ విషయంలో బీహారీలను అబద్ధాలతో మభ్యపెడుతున్నారని,బీహారీలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రకటించాలని ఆయన సవాల్‌ విసిరారు. మోడీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెప్పడం పరిపాటిగా మారిందని కాంగ్రెస్ నేత ఎద్దేవా చేశాడు. రైతులకు, జవాన్లకు, కార్మికులకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానంటూ బీహార్‌లో ప్రకటించిన మోడీ ఢిల్లీకి వెళ్లగానే ఆదానీ,అంబానీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని రాహుల్‌ దుయ్యబట్టాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp