ఇంద్ర ప్రేర‌ణ‌తోనే ర‌ఘువీరా అలా చేశారు : చిరంజీవి

By Kalyan.S Jun. 20, 2021, 10:15 am IST
ఇంద్ర ప్రేర‌ణ‌తోనే ర‌ఘువీరా అలా చేశారు : చిరంజీవి

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత,మాజీ మంత్రి,మాజీ పీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరా రెడ్డి ఇప్పుడు చాలా సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారు. యువకుడిగా బీజేపీతో సన్నిహితంగా మెలిగిన రఘువీరారెడ్డి,బీజేపీ నేత ,మాజీ ఎమ్మెల్సీ సూర్య ప్రకాష్ రెడ్డి వద్ద తోలి రాజకీయ పాఠాలు నేర్చుకున్న రఘువీర 1985లో కాంగ్రెస్ పార్టీ తో క్రియాశీలక రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.

రఘువీర పెదనాన్న శ్రీరామ్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు. రఘువీర 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో పశు సంవర్థక శాఖా మంత్రిగా పని చేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా, 1999లో మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో మరోసారి గెలుపొంది వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వై.ఎస్.ఆర్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రి అయ్యారు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా, అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా అదే శాఖా మంత్రిగా సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు పీసీసీ అధ్యక్షుడిగా నియమితుల‌య్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత పీసీసీ పదవికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ ఏకాంతంగా గ‌డుపుతున్నారు. రైతుగా ఉంటూ స్వ‌గ్రామంలో దేవాల‌యాల నిర్మాణ ప‌నుల్లో పాలుపంచుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠ పురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారథ్యంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు ప్రారంభోత్సవ సందర్భంగా సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నా రాజకీయ ప్రస్థానంలో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి అని పేర్కొన్నారు.

పరిచయమైన కొద్ది సమయంలోనే మంచి అనుబంధం ఏర్పడిందని, రఘువీరాలోని ముక్కుసూటితనం.. ప్రజలకు సేవ చేయాలనే తలంపు, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు మరువలేనివని అన్నారు. ప్రజా జీవితంలో రఘువీరారెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అని చిరు కొనియాడారు. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. ''నేను నటించిన ఇంద్ర సినిమాలో కరువు సీమకు నీళ్లు ఇవ్వాలనే తపనతో తీసిన ఆ సినిమా ప్రేరణతోనే మాజీ మంత్రి రఘువీరా కరువు సీమకు నీళ్లు ఇవ్వడం ఆయనలోని రాజకీయ దార్శనికతకు అద్దం పడుతుంది.

దాహం దాహం అంటూ అలమటిస్తున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వడం.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం మహద్భాగ్యం. ప్రస్తుతం నేను సినిమాలు తీస్తూ సినీ నటుడిగా కాలం వెళ్లదీస్తుంటే.. మాజీ మంత్రి రఘువీరా మాత్రం రైతుగా అవతారమెత్తి వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ఆలయాలు పునర్నిర్మించడంతో పాటు కొత్త ఆలయాలు నిర్మించడం కోసం పాటుపడుతున్నారు. రఘువీరాకు ఎల్లప్పుడూ ప్రజల సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.." అని అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp