న్యాయ వ్యవస్థకు ఇది నిజమైన పరీక్ష, కోర్టు తీర్పులపై పెరుగుతున్న ప్రశ్నలు

By Raju VS Sep. 17, 2020, 12:15 pm IST
న్యాయ వ్యవస్థకు ఇది నిజమైన పరీక్ష, కోర్టు తీర్పులపై పెరుగుతున్న ప్రశ్నలు

ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ..మూడూ కీలకంగా ఉంటాయి. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, రాజ్యాంగ పరిధిలో సమీక్షించుకుంటూ సాగేందుకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. కానీ పరిధిని మించి మరో వ్యవస్థను నియంత్రించాలని, లేదా వారి వ్యవహారాల్లో వేలు పెట్టాలని చూసిన ప్రతీసారి రాజ్యాంగం ద్వారా కట్టడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. అన్నింటికీ తాము అతీతులమని భావిస్తున్న కొందరు ఆయా వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పులు వివాదాస్పదం అవుతున్న తీరు దానికో నిదర్శనం. అంతకుముందు సుప్రీంకోర్ట్ జడ్జిలే కొందరు గొంతు విప్పడం ఓ సాక్ష్యం. ఇటీవల ప్రశాంత్ భూషణ్ కేసులో ప్రజా స్పందన ఓ ఆధారం.

న్యాయవ్యవస్థ కూడా కొన్ని పరిధుల మేరకు పనిచేయాలి. పరిమితులకు అతీతం అనుకుంటే అభాసుపాలుకాక తప్పదు. తాజాగా ఏపీ మాజీ ఏజీ, సుప్రీంకోర్ట్ జడ్జి కుమార్తెలు నిందితులుగా ఉన్న కేసులో ఇచ్చిన ఆదేశాలు అందుకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఎఫ్‌ ఐ ఆర్ వివరాలు వెల్లడించకూడదని మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల దేశమంతా నిరసన వ్యక్తమవుతోంది. అనేక మంది కోర్ట్ తీర్పుని తప్పుబట్టారు. తాజా తీర్పు ఆర్టికల్ 19కి, సమాచార హక్కు చట్టానికి పూర్తి విరుద్ధంగా ఉండడంతో పలువురు మండిపడుతున్నారు. అంతేగాకుండా సామాన్యుల పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో ప్రస్తావించగానే నానాయాగీ చేయవచ్చు, ప్రముఖుల పేర్లతో కేసు నమోదయితే మీడియాలో ప్రస్తావించకూడదా..ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ఇలాంటి గ్యాగ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలు తొలిసారి కావడంతో దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, న్యాయ నిపుణులందరూ స్పందించారు. ఈ ధోరణి సరికాదని చాటిచెబుతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోననే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికారం చెలాయిస్తున్న వారే ఎఫ్ఐఆర్ ని తొక్కిపెట్టారంటూ ఘాటు విమర్శలు వస్తున్నాయి. మీడియాను నియంత్రించాలనే ఆలోచన ఎమర్జెన్సీలో కూడా ఈస్థాయిలో జరగలేదనే వ్యాఖ్యలున్నాయి. ఇలాంటి ఓ సంచలన తీర్పు కారణంగా చివరకు న్యాయవ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లే స్థితి వేగవంతం అవుతుందనే అభిప్రాయం బలపడుతోంది.

దీనిపై వైఎస్సార్సీపీ అధికారికంగా స్పందింంచింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సూటిగా ప్రశ్నించారు. దమ్మాల పాటి శ్రీనివాస్, జస్టిస్ ఎన్ వీ రమణ కుమార్తెల కేసులో వారిని ఎందుకు రక్షించాలంటూ నిలదీశారు. సామాన్యుడికి ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయం కారణంగా కోర్టులు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చాయనే భావన కలుగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేగాకుండా సిట్ , మంత్రి వర్గ ఉప సంఘం ఆధారంగా దర్యాప్తుని వద్దంటున్న కోర్ట్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. సీబీఐ విచారణకు అంగీకరించాలంటూ పిటీషన్ వేసినా తోసిపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా కోర్టుల తీర్పులను సూటిగా ప్రశ్నించే పరిస్థితి ఎదురుకావడం గమనిస్తే వ్యవస్థల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండాల్సిన సంస్థలు తమ పరపతి తగ్గించుకుంటూ పోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బాహాటంగా న్యాయవ్యవస్థ పరిధిని దాటి వ్యవహరిస్తుందనే వాదన బలపడడడం దానికి సంకేతం. రాజ్యాంగ ఆదేశాలను కూడా ఉల్లంఘించే విధంగా కోర్టు వైఖరి ఉండడంతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నట్టేననే అభిప్రాయం వినిపిస్తోంది. అది కూడా కోర్టులే అలాంటి చర్యలకు పాల్పడుతున్న తీరుతో రాజ్యాంగం మరింత పలుచన అవుతుందనే కలవరం కనిపిస్తోంది. ఇలాంటి వైఖరి మీద న్యాయస్థానాలు పున్నసమీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యం ఎదురవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp