ఆసీస్‌తో టీ-20 సిరీస్‌కు క్వారంటైన్‌ గండం..!

By Srinivas Racharla Jul. 24, 2020, 09:03 pm IST
ఆసీస్‌తో టీ-20 సిరీస్‌కు క్వారంటైన్‌ గండం..!

ఆస్ట్రేలియాలో కఠినంగా అమలు చేస్తున్న క్వారంటైన్ రూల్ కారణంగా భారత్,ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టీ-20 సిరీస్ సందిగ్ధంలో పడిపోయింది. గతంలో బీసీసీఐ టీ-20 ప్రపంచకప్‌కు ముందు అక్టోబరు 11 నుంచి 17 మూడు టీ-20ల సిరీస్ ఆడేలా ప్లాన్ చేసింది. ఇక ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకు నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనుంది.ఆ వెంటనే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జనవరి 12 నుంచి 17 వరకు ఆడాల్సి ఉంది.

కానీ టీ-20 వరల్డ్ కప్ వాయిదా నేపథ్యంలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్-2020 నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధపడింది.దీంతో ఆసీస్‌తో ఆడాల్సిన మూడు టీ-20లను నవంబరు చివరలో జరపాలని బీసీసీఐ భావిస్తుంది. కానీ ఇక్కడే క్వారంటైన్‌ నిబంధన టీ-20 సిరీస్‌కి అడ్డంకిగా మారింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనని కఠినంగా అమలు చేస్తుంది. నవంబరు 8న జరిగే ఐపీఎల్ ఫైనల్ తర్వాత భారత క్రికెటర్లు కంగారు గడ్డపై అడుగు పెట్టనున్నారు. అయితే క్వారంటైన్‌ రూల్ ప్రకారం 14 రోజుల పాటు హోటళ్లలోనే ఉండాలి.అదే జరిగితే టెస్టు సిరీస్‌కు సమాయత్తం కావడానికి సమయం సరిపోదు.అలాగే ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని జనవరిలో స్వదేశానికి వచ్చిన వెంటనే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడాల్సి ఉంది.అందుకే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత కూడా టీ-20 సిరీస్‌కి అవకాశం లేదు.

ఒకవేళ క్వారంటైన్ గడువుని ఆస్ట్రేలియా వారం రోజులకి కుదిస్తే ఆ సమయంలో మూడు టీ-20 మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చు. అలాగే భారత గడ్డపై ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ ఫిబ్రవరికి వాయిదా పడితే ఆసీస్‌తో టీ-20 సిరీస్‌కు అవకాశం ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp