Punjab Elections, Amarinder Singh - పంజాబ్‌లో కొత్త పార్టీ..కొత్త కూటమి

By Ramana.Damara Singh Dec. 07, 2021, 03:15 pm IST
Punjab Elections, Amarinder Singh - పంజాబ్‌లో కొత్త పార్టీ..కొత్త కూటమి

పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలో కొత్త పార్టీ.. అదే సమయంలో కొత్త కూటమి ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు నెలన్నర రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకారమే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీని గత నెల రెండో తేదీనే రిజిస్టర్ చేయించారు. అమరీందర్ కుమారుడు సుఖిందర్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఏర్పాటైన కొత్త పార్టీ కార్యాలయాన్ని సోమవారం చండీఘడ్‌లో అమరీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కూటమిలో ప్రస్తుతం మూడు పార్టీలు

వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, సుఖ్బిందర్ సింగ్ దిండ్సాకు చెందిన శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని అమరీందర్ సింగ్ ప్రకటించారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటుపై త్వరలో చర్చలు జరుపుతామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఉమ్మడిగా పని చేస్తామన్నారు. భావ సారూప్యం గల పార్టీలు ముందుకొస్తే వాటిని కూడా కలుపుకొని వెళ్తామన్నారు. త్వరలోనే మూడు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహిస్తామని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి ఉమ్మడి ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని అమరీందర్ చెప్పారు.

కాంగ్రెస్ వ్యతిరేకత కలిపింది..

శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు..కాంగ్రెస్‌ను వ్యతిరేకించే మూడు పార్టీలు ఏకం కావడంతో పంజాబ్ ఎన్నికల్లో కొత్త పోటీలకు తెర లేచింది. గతంలో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేసేవి. 2017కు ముందు అధికారం చేపట్టాయి కూడా. కానీ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగింది. దాంతో రాష్ట్రంలో బీజేపీ నామమాత్రంగా మారింది. అప్పటి నుంచి కొత్త మిత్రుల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది. కాగా గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించి తన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్ రెండు నెలల క్రితం మాజీమంత్రి నవజ్యోత్ సిద్ధూతో విభేదాలు, కాంగ్రెస్ అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తికి గురై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేశారు. కాంగ్రెస్‌ను,సిద్ధూను ఎన్నికల్లో ఓడిస్తానని శపథం చేశారు. బీజేపీతో స్నేహానికి సానుకూలంగా ఉన్నప్పటికీ వ్యవసాయ చట్టాలు ప్రతిబంధకంగా మారాయి.అయితే కేంద్రం వాటిని రద్దు చేయడంతో బీజేపీతో పొత్తుకు అమరీందర్‌కు మార్గం సుగమం అయ్యింది.

Also Read : Punjab Congress - కేజ్రీవాల్‌కి 'టిట్‌ ఫర్‌ టాట్‌' అంటూ ఝలక్‌ ఇచ్చిన పంజాబ్ కాంగ్రెస్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp