ఢిల్లీకి చేరిన పంజాబ్ పంచాయితీ

By Ramana.Damara Singh Jun. 23, 2021, 09:05 pm IST
ఢిల్లీకి చేరిన పంజాబ్ పంచాయితీ

అసలే అంతంతమాత్రంగా ఉన్న పంజాబ్ కాంగ్రెసులో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. దేశంలో మూడు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్.. వాటిలో ఒకటైన పంజాబులో ఎన్నికల ముంగిట సంక్షోభంలో కురుకుపోతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగుపై పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పటికే అవినీతి, ఆశ్రితపక్షపాతం చూపుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం.. పార్టీలో ఆ పంచాయితీ జరుగుతుండగానే ఇద్దరు ఎమ్మెల్యేల సుపుత్రులకు ఉదారంగా పెద్ద ఉద్యోగాలు కట్టబెట్టడం ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ప్రతిపక్ష శిరోమణి ఆకాలీదళ్ తో పాటు సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ కలిసి మొత్తం పంచాయితీ ఢిల్లీకి చేరింది.

ఉద్యోగాల వివాదం

తనకు విధేయులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల కుమారులకు ఎటువంటి మెరిట్స్ చూడకుండా ఉదారంగా ఉద్యోగాలు కల్పించిన సీఎం తీరుపై కాంగ్రెసులోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అర్జున్ ప్రతాప్ సింగ్ బజ్వా, భీష్మ పాండేల కుమారులకు.. ఒకరికి పోలీస్ ఇన్స్పెక్టర్, ఇంకొకరికి తహసీల్దార్ ఉద్యోగాలు ఇస్తూ ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగులో నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నలకు సీఎం సన్నిహితులు స్పందిస్తూ.. వారి కుటుంబాల త్యాగాలకు ఇది చిన్న పరిహారమని సమర్థించుకుంటున్నారు. అప్పుడెప్పుడో వారి తాతలు ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయారట. దాన్ని త్యాగంగా ఇప్పుడు గుర్తించి మనవలకు ఉద్యోగాలు ఇచ్చారట. ఇది అసమంజసమని.. ఎమ్మెల్యేల విధేయతను ఉద్యోగాలతో కొంటున్నారని ఆకాలీ దళ్ విమర్శించింది. కాగా పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ ఝాక్కర్ సైతం సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధమని, సీఎం ఈ విషయంలో పునరాలోచించాలని సూచించారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఈ నియామకాలను వ్యతిరేకిస్తున్నారు.

ఢిల్లీ పెద్దలతో భేటీలు

గత, తాజా ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మరోసారి పంజాబుపై దృష్టి సారించింది. ఏ నెల మొదటి వారంలో సోనియా నియమించిన త్రిసభ్య కమిటీ చండీగఢ్ వెళ్లి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల వాదనలు విని.. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చింది. అది పరిశీలనలో ఉండగానే కొత్త ఆరోపణలు, ఫిర్యాదులు అందడంతో రెండు రోజులుగా పంజాబ్ నేతలను ఢిల్లీకి రప్పించి విచారణ జరుపుతున్నారు. సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం త్రిసభ్య కమిటీ సభ్యులను కలిసి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాక్కర్ ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఉద్యోగాల వివాదంతో పాటు.. పార్టీ, ప్రభుత్వంలో పరిణామాలపై ఆయన రాహుల్ కు వివరించారు. రాష్ట్ర మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు సైతం రాహుల్ను కలుసుకున్నారు. కాగా గురువారం అసమ్మతి నేత నవజ్యోత్ సిద్ధూ ఢిల్లీకి వచ్చి అగ్రనేతలతో భేటీ కానున్నారు. మరో ఏడు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణం సీఎం అమరీందర్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నా.. అధిష్టానం ఆయన్ను మార్చే సాహసం చేస్తుందా లేక రాజీ ఫార్ములా ఏదైనా రూపొందిస్తున్న అన్నది స్పష్టం కాలేదు.

Also Read : కేంద్రంపై స్టాలిన్ లేఖాస్త్రం .. జగన్ సహా 9 మంది సీఎంలకు పిలుపు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp