మృగాలను ప్రశ్నించిన అస్త్రం - సర్పయాగం

By Guest Writer Nov. 30, 2019, 05:58 pm IST
మృగాలను  ప్రశ్నించిన అస్త్రం - సర్పయాగం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలే కాక యావత్ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిన అంశం నలుగురు పాశవిక దుర్మార్గాలకు అన్యాయంగా బలైన డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఉదంతం. ప్రతిఒక్కరు ఆక్రోశంతో రగిలిపోతున్నారు. నిందితులను బహిరంరంగంగా ఉరితీయాలని నినదిస్తున్నారు. మరోవైపు టీవీ ఛానెల్స్ పోటీ పడి దీని గురించి లైవ్ కవరేజ్ లు, డిబేట్లు గత ఇరవై నాలుగు గంటలకు పైగా అలుపు లేకుండా ఇస్తూనే ఉన్నాయి . ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అభిప్రాయలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదలా ఉంచితే సోషల్ మీడియాలో ఈ దురాగతం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరగడం గమనించాల్సిన విషయం.

ఇక్కడే సినిమాల ప్రస్తావన వస్తోంది. వాటి తాలూకు ప్రభావం వల్ల యువత పెడదారి పడుతున్నారన్న వాళ్ళు లేకపోలేదు. భారతీయుడు చూసి లంచాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ మాసిపోలేదు. గణేష్ చూసి దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు డాక్టర్లలో మార్పులు రాలేదు. గాంధీ సినిమా చూసి అహింసే సమాజ హితమని ఎందరు గుర్తించారంటే సమాధానం దొరకడం కష్టం. ఇది ఒక కోణం. నిజంగానే ఎంతో కొంత ప్రభావితం చూపించే సినిమాలు లేకపోలేదు. శివ టైంలో సైకిల్ చైన్ చేతిలో ఉండటం ఫ్యాషన్ గా భావించిన యువత అప్పట్లో కోకొల్లలు. అన్నమయ్య చూసి ఆ కీర్తనలు నేర్చుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఏది ఏమైనా సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం. ఇప్పుడీ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఉంది. ప్రియాంకా రెడ్డి లాంటి అబలలు ఇలాంటి అరాచకాలకు బలి కావడం ఈ మధ్యే మొదలైందా లేక ఈ అరాచక క్రీడ ఏళ్ళ క్రితమే దారులు వేసుకుందా ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే ఈ కథనం లక్ష్యం.

1991లో శోభన్ బాబు ప్రధాన పాత్రలో (వాస్తవానికి ఆయనే హీరో. కానీ కథరిత్యా కమర్షియల్ కోణంలో ఆయన్ను అలా పిలవడం సబబుగా ఉండదు) పరుచూరి బ్రదర్స్ స్వీయ రచనా దర్శకత్వంలో సర్పయాగం అనే సినిమా వచ్చింది. సుప్రసిద్ధ నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు దీన్ని నిర్మించారు. తక్కువ వ్యయంతో ఇప్పటికీ కాంటెంపోరరీ అనిపించే సబ్జెక్టుతో 29 ఏళ్ళ క్రితమే ఇలాంటి కథను రాసుకున్న తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ముందు అందులో కథాసారం ఏంటో చూద్దాం,
సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న డాక్టర్ వేణుగోపాల్(శోభన్ బాబు)ఒకే ఒక్క గారాలపట్టి అనసూయ(రోజా). తన బాల్యంలోనే తల్లి అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నత విద్య కోసం మంచి కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ అనసూయ మీద కన్నేసిన సీనియర్ స్టూడెంట్ ఫణి(శ్రీనివాసరావు)ప్రేమ పేరుతో వలలో వేసుకుని ఓ సందర్భాన్ని సృష్టించుకుని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేస్తాడు. విషయం బయటికి చెప్పుకోలేక నరకం అనుభవించిన అనసూయ తండ్రికి ఓ ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది చదివిన వేణుగోపాల్ పోలీస్ న్యాయ వ్యవస్థ తన బిడ్డ ఆత్మకు శాంతి కలిగించలేవని గుర్తించి ఫణితో పాటు అతని స్నేహితులను తానే స్వయంగా హత్య చేసేందుకు రౌడీల సహాయం కోసం ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో జరిగే పరిణామాలు వేణుగోపాల్ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాయి అనేదే సర్పయాగం కథ.

Also Read : జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసా?

పరుచూరి సోదరులు తాము స్వయంగా దర్శకత్వం వహించే సినిమాకు కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే. అప్పటి బాక్స్ ఆఫీస్ సూత్రాల దృష్ట్యా కొన్ని అవసరం లేని వాణిజ్య అంశాలు, హాస్యం కోసం సృష్టించిన అదనపు పాత్రలు, పాటలు వగైరా పంటి కింద రాళ్ళలా అడ్డుతగిలినా వేణుగోపాల్ బాధను సరైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు అనుసంధానం అయ్యేలా తెరకెక్కించిన తీరు సర్పయాగానికి ఘన విజయం దక్కేలా చేసింది. దురదృష్టం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆ అకృత్యాల్లో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా తీవ్ర రూపం దాల్చడం.

తండ్రి విద్యాపరంగా వృత్తిపరంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. కానీ కేవలం ఒక ఆడపిల్లకు తండ్రైన పాపానికి హంతకుడిగా మారాల్సి వచ్చింది. ఎందుకు అనే ప్రశ్న అసంబద్ధం. కూతురి సమాధిపైన హంతకుల నెత్తుటితో తర్పణం వదలాలంటే అది రాజ్యాంగ వ్యవస్థ వల్ల కాదు. పోనీ సరైన రీతిలో చట్టప్రకారం వెళ్తే ఖచ్చితమైన న్యాయం దొరుకుతుందా అంటే దానికీ హామీ లేదు. దేశ రాజధాని నడిబొడ్డులో నిర్భయను అతి దారుణంగా కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసినప్పుడు సదరు నిందితులకు శిక్ష ఖరారు చేయడానికి 7 ఏళ్ళు పట్టింది. అందులో ఒకడు మైనర్ అన్న కారణంగా సానుభూతితో వ్యవహరించాలని వాదించిన లాయర్లు ఉన్నారు. అలాంటప్పుడు తమకు ఇంత ద్రోహం చేసిన వాళ్లకు శిక్ష పడుతుందన్న హామీ బాధిత కుటుంబ సభ్యులకు ఎక్కడి నుంచి వస్తుంది.

అందుకే పై కథలో డాక్టర్ తానే స్వయంగా సర్పయాగం చేసేందుకు పూనుకున్నాడు. కామంతో పెట్రేగి ఆడపిల్లను అనుభవించి కోరికలు తీర్చుకోవాలని చూసే కిరాతకులకు తనే స్వయంగా బుద్ది చెప్పాలనుకున్నాడు. సమాజం గురించి పట్టించుకోలేదు. పేరు ఏమవుతుందని భయపడలేదు. ఈ రోజు తన బిడ్డ రేపు ఇంకొకరి బిడ్డ. ఇలాంటివాళ్లను కొందరినైనా తాను తుదముట్టిస్తే ఇంకొకరికి గుణపాఠంగా మారుతుందన్న నమ్మకం ఇంత పని చేసేలా ప్రేరేపించింది. వేణుగోపాల్ స్థానంలోకి మనం వెళ్లి చూస్తే వాస్తవం అవగతమవుతుంది. కూతురి పెళ్లి కోసం దాచిన పది లక్షల రూపాయలను హంతకులను హత్య చేసేందుకు వాడుకున్నాడంటే ఆ మానసిక క్షోభ మాటల్లో అర్థం చేసుకునేది కాదు.

Read Also : ప్రియాంక హత్య కేసు నిందితులు

అలా అని సర్పయాగంలో డాక్టర్ చేసింది సమర్ధనీయం అని కాదు. కానీ గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న చిన్నారి తల్లుల మాన ప్రాణాలను కొందరు రాక్షసులు చిదిమేసి చంపేస్తే ఆ రంపపు కోత ఎలా ఉంటుందో తెలిసేది ఒక్క ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే. భయం ఉన్న చోట నేరం తగ్గుతుంది. చట్టం వల్లనో లేక వ్యవస్థలోని లోపాల వల్లనో తప్పించుకునే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఇలాంటి కీచకులు ఎన్ని తరాలైనా పుడుతూనే ఉంటారు. తొమ్మిది నెలల పసిగుడ్డు మొదలుకుని అరవై ఏళ్ళ పండుముసలి వరకు ఎవరిని వదలకుండా తమ కామవాంఛ తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్న మదాంధులను కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది.

చివరి మాట
ఇప్పుడు సర్పయాగాలు చేయాల్సింది వేణుగోపాల్ లాంటి డాక్టర్లు కాదు. ప్రభుత్వాలు, చట్టాలు. ఒక ఆడపిల్లను చరిస్తే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో తెలియజెప్పేలా కఠిన శిక్షలను త్వరగా అమలు చేయాలి. రేప్ అంటే ఎంత తీవ్రమైన నేరమో దానికి పాల్పడితే ఎంతటి నికృష్టమైన బ్రతుకు ఉంటుందో పెడదారి పడుతున్న యువతకు తెలిసేలా చట్టంలో సంస్కరణలు జరగాలి. తాము పుట్టింది ఒక ఆడదానికే అని మర్చిపోయి జంతువుతో పోల్చాలన్నా సిగ్గుపడేంత పాశవికంగా ప్రవర్తిస్తున్న వాళ్లలో మార్పు వచ్చేలా సమాజంలో భయాన్ని పుట్టించాలి. అలా జరిగిన నాడు నేరాలు తగ్గుతాయి. వేణుగోపాల్ లాంటి డాక్టర్లు తమ సేవావృత్తిని వదిలేసి హంతకులుగా మారే పరిస్థితులూ మారతాయి. కావాల్సిందల్లా చైతన్యమే

----Written By రవీంద్రనాథ్ శ్రీరాజ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp