యూపీ కాంగ్రెస్‌లో ఆశలు రేపుతున్న ప్రియాంక

By Srinivas Racharla Oct. 11, 2021, 01:45 pm IST
యూపీ కాంగ్రెస్‌లో ఆశలు రేపుతున్న ప్రియాంక

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చలి కాలంలో కూడా సెగ పుట్టిస్తున్నాయి.ఢిల్లీ గద్దె నెక్కాలంటే యూపీ కీలకమని గ్రహించిన కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో రాజకీయ చదరంగం మొదలెట్టింది. లఖీంపూర్ ఖేరీలో రైతుల హత్యాకాండ తర్వాత బాధిత కుటుంబాల కోసం ప్రియాంక ప్రదర్శించిన దూకుడు యూపీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది.ఇక బీజేపీ హిందుత్వ వాదాన్ని తిప్పికొట్టడానికి తనను 'హిందూ మహిళ'గా ఫోకస్ చేసుకునేందుకు ఆరాటపడుతోంది.

కొత్త అవతారంలో ప్రియాంక గాంధీ

ప్రధాని మోడీ ఇలాకా వారణాసిలో జరిగిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భిన్నంగా కనిపించారు.నుదుట చందనం, బొట్టుతో వేదికపైకి వచ్చిన ఆమె దుర్గాస్తుతితో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇది నవరాత్రుల నాలుగో రోజు..అమ్మవారిని స్తుతిస్తూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తానని అంటూ రెండు సంస్కృత శ్లోకాలను ఆమె పఠించారు. ‘జై మాతా దీ’ అని నినదించారు. ర్యాలీలో పాల్గొనడానికి ముందు కాశీ విశ్వనాథుని ఆలయంలో ఆమె పూజలు చేశారు.దీంతో ప్రియాంక గాంధీ భక్తురాలైన హిందూ మహిళగా గుర్తింపు పొంది బీజేపీకి అనుకూలమైన హిందూ ఓటర్లలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు భావించవచ్చు.

గత కొంత కాలంగా బీజేపీ హిందుత్వ వాదాన్ని ఎదుర్కోవటానికి తమ గాంధీ కుటుంబంను హిందూ భక్తులుగా చూపించే ప్రయత్నం ప్రియాంక,రాహుల్ చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోమనాథ్ సహా పలు ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించారు. ఇక కొద్ది నెలల కిందట ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో కూడా మునిగి తమ భక్తిని చాటుకున్నారు. అక్టోబరు 7న ప్రియాంక లక్నో శివారులోని మారి మాత ఆలయాన్ని దర్శించుకున్నారు. పైగా నవరాత్రుల మొదటి రోజు ఆమె ఉపవాసం ఉన్నారు.యూపీ ఎన్నికల వేళ హిందూత్వ వాదాన్ని ప్రియాంక తలకెత్తుకోవడం వెనుక రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది.

యోగి, మోడీ సర్కార్‌లపై నిప్పులు చెరిగిన ప్రియాంక

ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి గడ్డపై జరిగిన ‘కిసాన్ న్యాయ్’ సభలో యోగి, మోడీ ప్రభుత్వాలపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు.సభకు పోటెత్తిన ప్రజలను ఉద్దేశించి ప్రియాంక ప్రసంగిస్తూ దేశంలో ఇప్పుడు కేవలం రెండు రకాల వ్యక్తులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు.అధికార బీజేపీ నేతలు,వారి బిలియనీర్ స్నేహితులకు తప్ప దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు ఎలాంటి భద్రత లేదని ఆరోపించారు. ఈ దేశం మోడీ లేదా ఏ కొందరిదో కాదని, మీ అందరిదనే వాస్తవాన్ని గ్రహించాలని ప్రజలని కోరారు. అధికార మార్పు కోసం ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇక ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా మోడీ అమ్మేస్తున్నారని ప్రియాంక ధ్వజ మెత్తారు.దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంటే మోడీ మాత్రం తనకోసం ప్రత్యేకంగా రూ.16000 కోట్లతో రెండు విమానాలు కొనుగోలు చేశారని ప్రియాంక ఎద్దేవా చేశారు.కానీ దేశంలోని ఎయిర్ ఇండియాను కేవలం రూ.18000 కోట్లకు విక్రయించారని విమర్శించారు. మార్పు కోరుకునేవారు తమతో కలిసిరావాలని, దానికోసం తుదివరకు పోరాడుతానని ఆమె ప్రకటించారు.ఈ సందర్భంగా దేశ రాజకీయ ముఖచిత్రం మారేదాకా విశ్రమించబోమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ప్రతిజ్ఞ చేశారు.

డబ్బు కాదు,న్యాయం కావాలి..

ఇటీవల లఖీంపూర్ ఖేరీలో రైతులపై హత్యాకాండకు పాల్పడిన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను యోగి సర్కార్ కాపాడుతుందని ప్రియాంక ఆరోపించారు. రైతులకు న్యాయం దక్కేదాకా తాను,కాంగ్రెస్ పోరాడుతామని, జైల్లో పెట్టి కొట్టినా సరే పోరాటం ఆపబోమని ఆమె పేర్కొన్నారు. లఖీంపూర్‌లో రైతుల హత్యోదంతం జరిగిన తర్వాత 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ లక్నో వచ్చారు. కానీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఆయన ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.లఖీంపూర్‌ కేసు విచారణ సాఫీగా సాగాలంటే అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు కావాల్సింది డబ్బు కాదని,న్యాయమని అందుకోసం వారి పక్షాన పోరాడతామని ఆమె ప్రకటించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ లఖీంపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హత్యాకాండని దుయ్యబడుతూ కాంగ్రెస్‌ జనంలోకి దూసుకెళ్తుంది.ఈ క్రమంలో ప్రధాని మోడీ పార్లమెంట్ స్థానమైన వారణాసిలో కాంగ్రెస్ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలేస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp