సత్వర న్యాయం‌ సమంజసమేనా?

By Sake Srihari Dec. 07, 2019, 08:11 am IST
సత్వర న్యాయం‌ సమంజసమేనా?

"దిశ" అత్యాచారం,హత్య ఘటనలో నిందితులను పోలీసులు నిన్నటి రోజు తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేయడంలో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.పోలీసులు కారణాలేమి చెబుతున్నప్పటికీ ఇవి పథకం ప్రకారం చేసిన ఎన్‌కౌంటర్ లాగే కనిపిస్తున్నాయి. జ్యుడీషియల్ కస్టడీ నుండి పోలీసు కస్టడీ లోకి తీసుకుని ఎన్‌కౌంటర్ చేయడం న్యాయ వ్యవస్థల యొక్క ఉనికినే పోలీసులు ప్రశ్నించినట్లయింది.

కస్టోడియల్ డెత్ కు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లనిపిస్తోంది. పోలీసు కస్టడీ లో నిన్నంతా విచారణ లో ఉన్న నిందితులను తెల్లవారు జామున మసక చీకటిలో వారి చేతులకు మారణ ఆయుధాలు, కర్రలు ఎలా వచ్చాయన్నది అంతుచిక్కని ప్రశ్న గా మిగిలి పోయింది. వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషి కి శిక్ష పడకూడదన్న సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ జరగకుండానే పోలీసు లకు దండన విధించే అధికారాన్ని ఇస్తే అది విపరీత పరిణామాలకు దారి తీయొచ్చని పలు సంఘాలు వాపోతున్నాయి.జరిగిన ఒక హత్యకు నాలుగు హత్య లు చేసి సమాజంలో హీరోగా కీర్తించబడుతున్న సదరు పోలీసు అధికారి కి వ్యవస్థ ల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆవిధమైన చర్య లకు పాల్పడి ఉండేవాడు ‌కాదు.

ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడల్లా ప్రజలు అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలని,రాళ్ళతో కొట్టి చంపాలని, బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయాలని కొద్ది రోజులు హడావుడి చేసి ఊరుకుంటున్నారు. సమస్య లొతుల్లోకి వెళ్ళకుండా తాత్కాలిక పరిష్కారాలను కోరుకుంటున్నారు. ఈ ఘటనలను బట్టి చూస్తే రాజ్యాంగ బద్దమైన,చట్ట బద్దమైన,న్యాయ వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందేమో అని అనుమానం‌ కలుగక మానదు. నిందితులని ఆరోపించబడ్డవారంతా నేరస్థులు కాదు. వాళ్ళు నేరస్థులా కాదా అని నిరూపణ జరగాలి. తప్పు చేస్తే శిక్షించవలసినది న్యాయ వ్యవస్థ అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడటం అవగాహనా రాహిత్యం అవుతుంది.

2007 డిసెంబర్ కృష్ణా జిల్లా విజయవాడలోని ఇబ్రహీంపట్నం హాస్టల్ లో హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో‌ పోలీసులు సత్యం బాబును నిందితుడిగా చూపగా కోర్టు రిమాండ్ విధించింది. అప్పుడు కూడా ఇలాగే ప్రజలనుంచి నిరసన వెల్లువెత్తింది. అతడిని నడిరోడ్డు మీద చంపివేయాలని, ఉరి తీయాలి, కాల్చి వేయాలనే డిమాండ్లు నాడు కూడా బలంగా వినపడ్డాయి. పోలీసులు తమ దర్యాప్తులో నిందితులని తేల్చిన సత్యం బాబుకు కింది కోర్టు పదునాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. తొమ్మిది సంవత్సరాల అనంతరం హైకోర్టు సత్యం ను నిర్దోషి అని అకారణంగా జైలులో ఉంచారని అతడికి లక్ష రూపాయలు పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిని బట్టి చూస్తే ఒక్కోసారి నిర్దోషులైన వారు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నది. పోలీసులకు శిక్షలు వేసే అధికారమిస్తే రాజకీయ కక్షలకు ఇటువంటివి ఉపయోగించుకునే అంశం ఉన్నది. జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్డ్ విచారణ జరుపుతామనడం పోలీసులపై అభిశంసన కాక‌ మరేమిటని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp