ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర

By Ramana.Damara Singh Sep. 13, 2021, 01:05 pm IST
ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర

ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేగం పుంజుకుంటున్నాయి. దేశంలో అతి పెద్దదైన ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ పార్టీలు వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

తాజాగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రలకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఒకడుగు ముందుకు వేస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఆధ్వర్యంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ కూడా అటువంటి యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

వచ్చే నెలలో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర

యూపీలో పూర్తిగా చతికిల పడిన కాంగ్రెస్ కు మళ్లీ జవసత్వాలు కల్పించి అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా ప్రియాంక వాద్రాను నియమించింది. కష్టతరమైన బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ఆమె లక్నోలోనే మకాం వేసి పార్టీని ఉత్తేజపరచడంతో పాటు, ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి చుట్టి వచ్చిన ఆమె.. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read : గుజరాత్ కొత్త సీఎం తొలిసారి ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్

తాజాగా ఎన్నికల సమయం వరకు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ యాత్రకు కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్రగా నామకరణం చేశారు. 'మేం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం' అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో ఒక బృందం ఇదివరకే రాష్ట్రంలో పర్యటించి ప్రజా సమస్యలతో ఒక నివేదిక రూపొందించింది. ఈ సమస్యలపై ప్రియాంక చేపట్టే యాత్రలో ప్రజలకు హామీలు ఇచ్చి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని భరోసా ఇస్తారు. జోన్లవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

అదే బాటలో ఎస్పీ

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒకవైపు పొత్తుల కోసం చిన్న పార్టీలతో చర్చలు జరుపుతూనే మరోవైపు పార్టీ యువశక్తి విభాగం ఆధ్వర్యంలో పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి జనమాన్ విజయ్ అని పేరు పెట్టారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో బూత్ స్థాయిలో ప్రజలను బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై చైతన్యవంతులను చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Also Read : బీజేపీలో ఏం జ‌రుగుతోంది..? ఆరు నెల‌ల్లో నలుగురు సీఎంల మార్పు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp