ప్రైవేటు నిర్లక్ష్యం

By Jaswanth.T Aug. 08, 2020, 09:25 pm IST
ప్రైవేటు నిర్లక్ష్యం
ప్రైవేటు ల్యాబ్‌లు కోవిడ్‌ 19 పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతులు ఇచ్చిన తరువాత నెమ్మదిగా తమ నిజరూపాన్ని బైటకు తీస్తున్నాయని వాటి బాధితులు వాపోతున్నారు. రక్త నమూనాలు సేకరించి, కోవిడ్‌ 19 నిర్దారణ పరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌లు పలు చోట్ల చేస్తున్నాయి. అయితే వీటిలో ఖచ్చితత్వం ఎంతనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సదరు బ్లడ్‌ నమూనా సేకరించే సమయానికి వ్యక్తి రక్తంలో రోగనిర్దారకాలు ఉంటే మాత్రమే ఈ టెస్టులో ఖచ్చితమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంటే ఫలితం నెగటివ్‌గా వచ్చినప్పటికీ వందశాతం నెగటివ్‌గా భావించేందుకు అవకాశం ఉండదు.

అయితే ఇక్కడే ప్రైవేటు ల్యాబ్‌లు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొందరు వ్యక్తులు అనేక కారణాలతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీరు రక్తనమూనాల ద్వారా పరీక్షలు చేసి నెగటివ్‌ అని చెప్పేస్తున్నారు. కొందరికి పాజిటివ్‌ అని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం లేదు. దీంతో ప్రస్తుతం కోవిడ్‌ రోగుల పట్ల ఉన్న చిన్నచూపు కారణంగా పలువురు రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుని మందులు వాడుతూ గుట్టుచప్పుడు కాకుండా జనంలో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్‌విజృంభణకు అవకాశం కలుగుతోంది. వ్యక్తి శరీరంలోని వైరస్‌ ఎదుటి వారికి అంటుకునే స్థితిలో ఉన్నప్పుడు సదరు వ్యక్తులు జనంలోకి వెళితే ఇతరులకు కూడా ఈ వైరస్‌ వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

రోగుల పట్ల ప్రస్తుతం సమాజంలో ఉన్న చిన్నచూపు కారణంగా వారు తమ రోగాన్ని దాస్తుండవచ్చు. కానీ పరీక్షలు నిర్వహించిన ప్రైవేటు ల్యాబ్‌ వారు ప్రభుత్వానికి ఈ విషయం చెప్పకుండా గోప్యత పాటిస్తుండడం ఇప్పుడు సమస్య పెరిగేందుకు దోహదపడుతోంది. దీనిపై సంబంధిత యంత్రాంగం పూర్తిస్తాయిలో దృష్టి పెట్టకపోతే ప్రభుత్వం చేపడుతున్న వైరస్‌ నివారణా చర్యలకు అడ్డంకిగా మారే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నివారణా చర్యలు చేపడుతోంది. మరో పక్క ఎప్పటికప్పుడు కోవిడ్‌ పాజిటివ్‌లు పెరుగుతూనే ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్ధారణపై కూడా దృష్టిసారించి, సదరు పాజిటివ్‌ వ్యక్తుల కదలికలను నియంత్రించకపోతే పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పల్లెలపైనే ప్రైవేట్‌ల్యాబ్‌లు దృష్టిపెడుతున్నట్లుగా చెబుతున్నారు. మరోపక్క పల్లెప్రాంతాల్లోనే కోవిడ్‌ 19 విజృంభణ ఇటీవలే స్పీడందుకుంది.

రాష్ట్రంలో దాదాపు ప్రతి రోజూ 10వేలకు పైగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 10,171 పాజిటివ్‌లో ఏపీలో నమోదయ్యాయని హెల్త్‌ బులిటెన్‌లో తెలిపారు. అలాగే రెండులక్షలకు పైగా కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ కారణంగా మృతి చెందిన వారు 1,842కు చేరింది. పాజిటివ్‌ల నమోదులో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే ఈ జిలాలలో మొత్తం 1,310 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని కోణాల్లోనూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp