రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత

By Raju VS Sep. 30, 2020, 07:20 am IST
రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత

సుదీర్ఘకాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది. పారిశ్రామికాభృద్ధికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కడప ఉక్క పరిశ్రమకు అంతా సిద్ధమయ్యింది. శ్రీ సిటీ ఆధారంగా పలు పరిశ్రమల ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యింది. అదే సమయంలో కియా పరిశ్రమను ఆధారం చేసుకుని అనంతపురంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ కి ఎంవోయూ కూడా జరిగింది. వాటితో పాటుగా ఏపీలో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ని కలుపుకుని కొత్త పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పెద్ద ముందడుగులా కనిపిస్తోంది.

ఎన్ఐసీడీఐటీ ద్వారా హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని ఏపీ పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ నిర్ణయించింది. దాంతో పాటుగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా మరో కొత్త కారిడార్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్ గా ఉంటుందన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిత్తూరు జిల్లాలోని రౌతుసురుమల నోడ్ ద్వారా చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద అభివృద్ధి కానుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

కొత్తగా అనుమతి దక్కిన కారిడార్ తో కలిపి రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటై పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుందని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పరిశ్రమలకు పుష్కలంగా నీటి సరఫరా (బల్క్ వాటర్ సప్లై) అందజేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి పేర్కొన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్ లో కామన్ ఎఫ్ల్యుయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (పరిశ్రమలకు కావలసిన నీటిని నిల్వ చేసుకునే ప్లాంట్) పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో మరింత వేగం పెంచాలని మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తిరుపతి కేంద్రంగా ఐటీ పరిశ్రమలకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇప్పటికే 'వాక్ టు వాక్ కాన్సెప్ట్ తో ఐ.టీ పార్కు ఏర్పాటుకు కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి సుమారు రూ.500 కోట్ల విలువైన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కపిల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అందుకు భూ కేటాయింపులలో సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఆ ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి 25 ఎకరాల భూమి అవసరమని భూ కేటాయింపుకు సహకరించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. సుమారు 6వేల నుంచి 8వేల మందికి ఉద్యోగాలందించనున్న ఐ.టీ పార్కు రెండు దశల్లో ఏడేళ్లలో నిర్మిస్తామని 'కపిల్' వైస్ ప్రెసిడెంట్ మంత్రికి వివరించారు.

దాంతో ఓవైపు స్టీల్ , మరోవైపు ఆటోమొబైల్ తో పాటుగా ఐటీ రంగానికి కూడా రాయలసీమ కేంద్రంగా కొత్త పారిశ్రామిక కారిడార్ తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా రాయలసీమ అభివృద్ధికి బాటలు పడతాయని భావిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ ఆచరణ రూపం దాలిస్తే ఏపీ సమగ్రాభివృద్ధి చేయాలని ఆశిస్తున్న సీఎం సంకల్పం సిద్ధిస్తున్నట్టే అవుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp