పత్రికా స్వేఛ్చ - నియంత్రణ

By Ravuri.SG Dec. 12, 2019, 04:54 pm IST
పత్రికా స్వేఛ్చ - నియంత్రణ

పత్రికాస్వేఛ్ఛ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అలా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ - పత్రికాస్వేఛ్ఛ మీద ఆంక్షలు విధించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. -- జవహర్ లాల్ నెహ్రు

ప్రభుత్వ, ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తా పత్రికల్లో వచ్చే కథనాల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రజల నిరాధార రాతల వరకు అన్నిటిపైన ఆంక్షలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడమనేది ప్రమాదకర పరిణామం, ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయడమనేది మొదటి సారి కాదు.
ప్రతిపక్ష తెలుగుదేశం, వారి అనుకూల మీడియా ఇటువంటి జీవోను తొలిసారిగా 2007 లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విడుదల చేసినట్టుగా ప్రచారం చేస్తున్నప్పటికీ అది అసత్యమే. మన రాష్ట్రంలో ఇలాంటి నిబంధనను తొలిసారిగా తీసుకురావాలని చూసింది బహుశా 'తెలుగుదేశం' పార్టీనే కావచ్చు.

1985 లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలేవో నిర్ణయించి, అవి రాసిన వారిపై 'నాన్ బెయిలబుల్' కేసులు నమోదు చేసే అధికారాన్ని పోలీసులకు ఇచ్ఛే విధంగా సూచిస్తూ ఒక బిల్ తీసుకుని రావాలని చూశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ 1985 అక్టోబర్ 17 న ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎన్టీఆర్ వెనక్కు తగ్గారు. కానీ పక్షం రోజుల తర్వాత ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆ బిల్ పూర్తిగా ఉపసంహరించుకోలేదని; ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వాటిల్లకుండా చూసుకోవడం కూడా తన బాధ్యతేనని చెప్పుకొచ్చి మరోసారి ఆ బిల్ ను తెరమీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ముఖ్యమంత్రితో అల్పాహారంతో పాటు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘం సభ్యులు గైర్హాజరయ్యి తమ నిరసన తెలియజేయడంతో 'అధికారికం'గా ఆ బిల్ ను తీసుకురాలేదు.

దీనికి ముందు 1982 లో జగన్నాధ్ మిశ్రా నాయకత్వంలో బీహార్లో, 1983 లో ఎమ్జీఆర్ నేతృత్వంలో తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి బిల్/జీవోలు ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో వెనక్కు తగ్గాయి. ఎమర్జెన్సీ సమయంలో పత్రికల మీద ఆంక్షలు విధించినందుకు కొన్ని వాస్తవాలు తన దాకా రాలేదని ఇందిరాగాంధీ కూడా తన నిర్ణయానికి పశ్చాత్తాప్పడ్డారు. 1988 లో రాజీవ్ గాంధీ కూడా ఇలాంటి బిల్ తీసుకురావాలని చూశారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 5 న ఆ బిల్లును నిరసిస్తూ న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి బోట్ క్లబ్ వరకు పాత్రికేయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పుడు కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి ఆ బిల్లును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

అధికారికంగా అటువంటి జీవోలు జారీ చేయకపోయినా 'ఒక పత్రిక'కు సంబంధించిన విలేఖరులను, రిపోర్టర్లను బహిరంగంగా పలుమార్లు తూలనాడిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఈ రోజుపత్రికాస్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం. గత ఐదేళ్ల కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఐదారు సార్లు 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద 'సాక్షి' పత్రిక అవాస్తవాలు రాసిందని ఆరోపిస్తూ, త్వరతగతిన విచారణ జరిపించాలని అధికారులకు నియమిస్తూ జీవోలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం తరఫున నిర్వహించే ప్రెస్ మీట్ కు 'సాక్షి' పత్రిక నుంచి వచ్చిన విలేకరి పట్ల అమర్యాదగా ప్రవర్తించి, 'సాక్షి వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేద'న్నట్టు వ్యాక్యానించడం లోక విదితమే. నిజానికి చంద్రబాబు, వైఎస్ జగన్ లు ప్రతిపక్షనేతలుగా ఉన్నప్పుడు వారి వారి పార్టీల తరఫున నిర్వహించే ప్రెస్ మీట్లకు 'సాక్షి', 'ఆంధ్రజ్యోతి' పత్రికల వారిని అనుమతించేవారు కాదు. అది పూర్తిగా వారి నిర్ణయాధికారం పైన ఆధారపడి ఉండవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున జరిగే ప్రెస్ మీట్ల విషయంలో కూడా అదే ధోరణి అవలంబించడం మాత్రం నియంతృత్వధోరణి అనిపించుకుంటుంది.

గత చరిత్ర ఎలా ఉన్నా ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన 2430 జీవో మీద పాత్రికేయ వర్గాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీడియాకు నోటీసులు ఇచ్చే అధికారం ప్రతి శాఖాధిపతికీ ఇవ్వడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. మీడియాకు నోటీసులు ఇచ్చే అధికారం కేవలం సమాచార శాఖ కమిషనర్ కు మాత్రమే ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి సూచనలను పరిగణించి జీవో లో మార్పులు చెయ్యాలి. .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp