ఎన్డీయే కూటమిలో పోస్టర్‌ల యుద్ధం..ఎన్నికలకు ముందే మిత్ర బంధానికి బీటలు..?

By Srinivas Racharla Oct. 27, 2020, 09:00 am IST
ఎన్డీయే కూటమిలో పోస్టర్‌ల యుద్ధం..ఎన్నికలకు ముందే మిత్ర బంధానికి బీటలు..?

బీహార్‌ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచారం చివరి రోజు బీజేపీ తమ మిత్రపక్షమైన జేడీయూకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్డీయేలో బీజేపీ,జేడీయూ ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం ఒకపక్క జరుగుతుండగా బీజేపీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఓటర్లను మరింత అయోమయానికి గురి చేసింది.

బీహార్‌ అసెంబ్లీలోని 71 స్థానాలకు జరిగే తొలి దశ పోలింగ్‌కి ప్రచారం ముగిసింది. వాడివేడిగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే, మహాకూటమి నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలతో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు తమ మిత్రపక్షం జేడీయూకు బీజేపీ షాకిచ్చింది.తాజాగా రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార పోస్టర్‌లలో కేవలం ప్రధాని నరేంద్రమోడీ లైఫ్‌ సైజ్ ఫొటో మాత్రమే దర్శనమిస్తుంది. ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్ధిగా ఉన్న జేడీయూ నేత నితీశ్‌ కుమార్ ఫోటో అందులో లేకపోవడం గమనార్హం. దీంతో ఫలితాల అనంతరం బీజేపీ నేతను బీహార్ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలని ఆ పార్టీ వ్యూహరచన చేసిందనే ఊహాగానాలు నిజమేననిపిస్తుంది.

ఇక ఒక కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నప్పుడు మిత్ర ధర్మం ప్రకారం భాగస్వామ్య పక్ష నేతలు ఫోటోలను ప్రచార పోస్టర్‌లలో ముద్రించాల్సి ఉంటుంది. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ కుమార్‌కి బహిరంగంగా మద్దతు ప్రకటించిన బీజేపీ లోపాయికారిగా తమ పార్టీ అభ్యర్ధిని సీఎం చేయాలనే దురాలోచనలో ఉన్నట్లు కమలం పార్టీపై ఎన్నికల ప్రారంభం నుండి విమర్శలున్నాయి.పైగా ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కుర్చీకి నీతీశ్ కుమార్‌ని దూరం పెట్టేందుకు చిరాగ్ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జెపి ని బీజేపీ " బి టీం" గా బరిలో దింపిందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది.

జేడీయూ అధినేత,సీఎం నితీశ్ కుమార్ 15 ఏళ్లపాలన తర్వాత బీహార్ ప్రజలలో ఆయనపై వ్యతిరేకత నెలకొందనేది వాస్తవం.దీంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ తాము ప్రధాని మోడీ బొమ్మతోనే ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం నితీశ్‌ కుమార్ ఫొటో లేకుండా మోడీ ఫోటోలతో లైఫ్ సైజ్ పోస్టర్‌లను ముద్రించింది. కానీ తొలిదశ ఎన్నికలకు ముందు బీజేపీ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని జేడీయూకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.

ఇటు జేడీయూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలలో కూడా కేవలం సీఎం నితీశ్ కుమార్ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీ ఎన్నికల ప్రచార ప్రకటనలలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో గానీ,బీజేపీ ప్రస్తావన గానీ లేదు.తాజా పరిణామాలతో ఎన్నికలకు ముందే వీరి స్నేహ బంధానికి బీటలు దేలాయా..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇక మొదటి దశ పోలింగ్‌కి సర్వం సిద్ధమైన వేళ ఎన్డీయే లో లుకలుకలు బయట పడడంతో అధికార కూటమి విజయావకాశాలకు గండి కొట్టే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp