ప్రజలకు పరిచయం అయిన ప్రధానులు

By Gopi Dara Apr. 06, 2020, 11:55 am IST
ప్రజలకు పరిచయం అయిన ప్రధానులు

నాయకత్వం ఊరికే రాదు. నాయకులవ్వడం అంత తేలికకాదు. అందునా అక్షరాస్యత తక్కువగా ఉన్న భారతదేశం లాంటి దేశంలో నాయకుడిగా గుర్తింపు పొందడం అంత తేలికకాదు.

స్వాతంత్య్ర పోరాట చరిత్ర వారసత్వంగా తీసుకుని ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూకు కూడా సామాన్య ప్రజల్లో రాని గుర్తింపు కేవలం కొద్దిమంది ప్రధానులకే వచ్చింది.

అప్పట్లో ఇందిరా గాంధీ, ఇప్పుడు నరేంద్ర మోడీ. దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈ రెండుపేర్లు చెప్పలేని ప్రజలు ఉండరు. దేశానికి 1947 నుండి నేటివరకూ 14మంది ప్రధానులుగా పనిచేస్తే ప్రజలందరికీ తెలిసింది ఈ ఇద్దరు ప్రధానులే.

ఇంతకు ముందే చెప్పినట్టు స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర వారసత్వంగా తీసుకున్న నెహ్రూ కూడా ప్రజల్లో ఇంత పాపులర్ కాలేదు. అయితే చరిత్ర పుస్తకాలూ, పోటీ పరీక్షల సిలబస్ ఆయనను విద్యావంతుల నేతగా నిలిపింది. భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు కూడా కొంతమేర నెహ్రూను నేతగా నిలిపాయి. ఆ తర్వాత ఇందిరా గాంధీ కొడుకుగా రాజీవ్ గాంధీకి కొంత గుర్తింపు వచ్చింది కానీ ఆయన పేరు మారుమూల ప్రాంతాలకు చేరలేదు.

నెహ్రూ, ఇందిరా మధ్యలో శాస్త్రి మరియు గుల్జారీలాల్ నందా పనిచేశారు. ఇందిరా గాంధీకి, రాజీవ్ గాంధీకి మధ్యలో ఎంతో మంది పనిచేశారు. రాజీవ్ తర్వాత మోడీ వచ్చేవరకూ మిగిలినవారంతా పనిచేశారు. కానీ పల్లె స్థాయిలో గుర్తింపు మాత్రం మోడీకే వచ్చింది. ఇలా గుర్తింపు రావడానికి నేతలు కొన్ని పనులు చేయాల్సి ఉంది.

అప్పట్లో ఇందిరాగాంధీ, ఇప్పుడు నరేంద్ర మోడీ అలాంటి పనులు చేసి ఆ గుర్తింపు సాధించారు. అయితే అప్పట్లో ఇందిరాగాంధీకి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హఠావో (పేదరిక నిర్మూలన) వంటి నినాదాలతో అప్పటి ఉద్దండ నేతలు కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ, నీలం సంజీవ రెడ్డి వంటి వారి నాయకత్వ నీడ చాటు నుండి నేరుగా ఎదిగారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టుకుని దేశంలో ప్రతి మారుమూల ప్రాంతంలో, ప్రతి గడపకు చేరుకున్నారు. ఆమె ఇప్పటికి ఆ ఇళ్ళల్లో, ఆ నోళ్ళల్లో సజీవంగానే ఉన్నారు.

ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత నరేంద్ర మోడీ కూడా దేశంలోని అన్ని ఇళ్ళల్లో, అన్ని నోళ్ళల్లో వినిపిస్తున్నారు. అయితే దానికి కారణం గరీబీ హఠావో వంటి నినాదమో, లేక బ్యాంకుల జాతీయీకరణ వంటి చర్యలో కాదు. మొదట నెహ్రూ వారసత్వంగా కొనసాగుతున్న "పంచవర్ష ప్రణాళిక"కు మూలమైన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి విద్యావంతుల "మెమరీ" నుండి నెహ్రూను తొలగించి తన పేరు వినిపించేలా చేసుకున్నారు. ఆ తర్వాత నోట్ల రద్దుతో మారుమూల పూరిగుడిసెలో వ్యక్తికి కూడా మోడీ పరిచయం అయ్యారు. ఇప్పుడు జనతా కర్ఫ్యూ, దీపార్చన వంటి పాపులర్ పనులతో గడపగడపకూ మోడీ చేరుకోగలిగారు.

మొత్తంమీద పాలకుడు ప్రజలకు తెలియాలంటే సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చర్యలేవో చేయాలి. గరీబీ హఠావో అని ఇందిరా గాంధీ, నోట్ల రద్దు, దీపార్చన వంటి వాటితో మోడీ ఈ దేశ ప్రజల్లోకి - ప్రజల గడపల్లోకి - చేరుకున్నారు.

ఇన్నేళ్ళ భారత దేశ చరిత్రలో ఇంతటి ప్రచారం పొందిన నేతలు ఈ ఇద్దరే.కారణాలు వేరైనా ప్రయోజనం ఒక్కటే - ఇద్దరూ ప్రజలకు విస్తృతంగా పరిచయం అయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp