తిరుప‌తి బై పోల్ : త‌గ్గిన పోలింగ్ శాతంతో ఒణుకుతోంది ఎవరంటే...

By Kalyan.S Apr. 18, 2021, 07:55 am IST
తిరుప‌తి బై పోల్ : త‌గ్గిన పోలింగ్ శాతంతో ఒణుకుతోంది ఎవరంటే...

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార పార్టీ నుంచి ఏడుగురు మంత్రులు, ఇద్ద‌రు ముఖ్య నేత‌లు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఏకంగా 13 రోజుల పాటు అక్క‌డే ఉండి నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టుముట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఏకంగా అధినేత చంద్ర‌బాబునాయుడే రంగంలోకి దిగారు. స‌భ‌లు, ర్యాలీల‌తో సుమారు వారం రోజుల పాటు ప్ర‌చారం నిర్వ‌హించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి జేపీ న‌డ్డా వంటి ముఖ్య‌నేత‌ల‌కు తోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌చారంలోపాల్గొన్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ.. ప్ర‌జ‌లంతా బీజేపీ అభ్య‌ర్థికి ఓట్లేయాల‌ని కోరారు. కాంగ్రెస్ ను ప‌క్క‌న బెడితే ఇలా మూడు పార్టీలూ ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొట్టాయి. దీంతో భారీ పోలింగ్ జ‌రిగి అనూహ్య ఫ‌లితాలు వ‌స్తాయంటూ విప‌క్షాలు తెగ సంబ‌ర‌ప‌డ్డాయి. కానీ క‌ట్ చేస్తే.. శ‌నివారం జ‌రిగిన పోలింగ్ లో గ‌తంతో పోలిస్తే త‌క్కువ ఓటింగ్ శాతం న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో త‌గ్గిన పోలింగ్ శాతంతో విప‌క్షాల్లో ఒణుకు మొద‌లైంది.

సాధార‌ణంగా పోలింగ్ శాతం పెరిగితే.. అది ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌గా భావిస్తుంటారు. అందుకే ఏదైనా ఎన్నిక‌లో పోలింగ్ శాతం పెరిగితే వెంట‌నే ప్ర‌తిప‌క్షాలు ఆ త‌ర‌హా ప్ర‌చారం మొద‌లెట్టాస్తాయి. కానీ, తిరుప‌తి ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఓటింగ్ త‌గ్గింది. పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో అది 79.03% గా న‌మోదైంది. గ‌తంతో పోలిస్తే, తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది. అయితే అనేక కార‌ణాల రీత్యా ఈ మాత్రం ఓటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ పార్టీలు ఊహించ‌లేదు. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాలలోనూ ఇదే ప‌రిస్థితి. చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 72.68 శాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. ఇక మిగిలిన ఐదు నియోజ‌క వ‌ర్గాల్లో న‌మోదైన పోలింగ్ వివ‌రాలిలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంక‌ట‌గిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో 67.77%, తిరుప‌తిలో 50.58% పోలింగ్ న‌మోదైంది. మొత్తం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 64.44% న‌మోదు అయిన‌ట్లుగా తెలుస్తోంది.
ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో అన్ని పార్టీల్లోనూ కలకలం రేగుతోంది. ఓటింగ్ పెంచుకోవ‌డానికి టీడీపీ, బీజేపీలు జోరుగా ప్రచారం చేశాయి.

ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరించింది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. అయిన‌ప్ప‌టికీ వారి అంచనాలూ తల్లకిందులు అయ్యాయనే చెప్పాలి. ఉదయం 7 గంటలకు ప్రశాంతంగానే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, తొలి గంట‌, రెండు గంట‌ల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే క‌నీసం ప‌ది ఓట్లు కూడా ప‌డ‌ద‌లేని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్తవానికి తిరుపతి పార్లమెంటు పరిధిలో మొత్తం 17 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 14.5 లక్షల వరకు పోలింగ్ జరిగితే, ఈ దఫా మాత్రం 10 లక్షలు కూడా దాటిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. త‌క్కువ‌గా పోలింగ్ న‌మోదైన నేప‌థ్యంలో గ‌తంలో వ‌చ్చిన ఓట్లు అయినా వ‌స్తాయా, రావా అన్న సందేహాలు విప‌క్షాల‌ను వెంటాడుతున్నాయి. మ‌రి తుది ఫ‌లితం కోసం మే 2 కోసం వేచి చూద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp