ఎంతైనా రాజకీయనాయకులే..

By Jaswanth.T Oct. 23, 2020, 08:31 pm IST
ఎంతైనా రాజకీయనాయకులే..

నమ్మకమైన కొందరిని మినహాయిస్తే రాజకీయ నాయకులమీద పేలినన్ని జోకులు ఇంకెవరిమీద పడి ఉండవేమో. సోషల్‌ మీడియా వచ్చాక ఇది మరింతగా పెరిగిపోయింది. నాయకుల వ్యవహారశైలి కూడా ప్రజలకు అవకాశం ఇచ్చే విధంగానే ఉంటుంది. దీంతో నాయకుల వ్యవహారశైలి, ప్రజల విమర్శలు జోరుగానే పోటీపడుతుంటాయి. ప్రజల అసహనాన్ని జోకుల రూపంలో చూపిస్తుండొచ్చన్న అంచనాలు కూడా పరిశీలకుల నుంచి విన్పిస్తుంటాయి.

పూర్తిస్తాయి రుణమాఫీ అంటే నమ్మి ఓట్లు వేసి ఆ తరువాత బ్యాంకులకు వడ్డీలకు వడ్డీలు కట్టి, కట్టకపోతే తిరిగి రుణం రాక తీవ్ర ఇబ్బందులు పడ్డవారంతా తమ కసిని కొన్నాళ్ళు కామెంట్లు, విసుర్ల రూపంలో తీర్చుకుని, ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో చూపించిన సాక్ష్యాలు ఇంకా మదిలోనుంచి చెరిగిపోనేలేదు.

ఇటువంటి పరిస్థితుల్లో ఈ సారి నాయకుల హామీలకు కరోనా వ్యాక్సిన్‌ ఆస్కారం ఇచ్చేసింది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేసేస్తామంటూ మానిఫెస్టోల్లో చేర్చేసే స్థాయికి నాయకులు సిద్ధమైపోయారు. అసలెప్పుడు వస్తుందో క్లారిటీ లేని వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేస్తామంటూ హామీలు ఇవ్వడం చూస్తుంటే ‘హైదరాబాదుకు పోర్టు తీసుకువస్తా’నని దుర్యోధన సినిమాలో హీరో పాత్రలో శ్రీకాంత్‌ ఇచ్చే హామీని గుర్తుకు తేకమానదు.

యావత్‌ వైద్య పరిశోధకుల బృందాలు కోవిడ్‌వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా రూపొందించాలని తలమునకలై ఉన్నారు. అందులో భాగంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అయినప్పటి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్‌ వచ్చేస్తుందన్న అంచనాలైతే లేవు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యక్తులు సైతం వ్యాక్సిన్‌ రాక ఇప్పుడప్పుడే కాదు అంటూ నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ నాయకులు మాత్రం తమదైన ధోరణితో హామీని మాత్రం ఇచ్చేస్తున్నారు.

బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించేసారు. మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటో? అన్న సందేహం వస్తే వారికే మాత్రం సంబంధం లేని విషయంగానే వారు భావించినట్టున్నారు. సమైక్య స్ఫూర్తితో ఇస్తే, గిస్తే దేశ వ్యాప్తంగా ఇస్తామని ప్రకటిస్తే వినేవాళ్ళకు కూడా కాస్త వినసొంపుగా ఉండేది. కానీ ఎన్నికలున్నాయి కాబట్టి బీహార్‌లో మాత్రమే ఉచితం అంటే కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీహార్‌ మానిఫెస్టో ఆయె..! బీహార్‌లో బీజేపీ హామీని చూసి ఇన్‌స్పైర్‌ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా తమ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ ఉచితంగా ఇచ్చేస్తామంటూ ప్రకటించుకున్నారు.

కోట్లాది మంది అటెన్షన్‌తో ఎదురు చూస్తున్న వ్యాక్సిన్‌ను గురించి మాట్లాడడం ద్వారా వారి దృష్టిని తమపైకి మరల్చుకునేందుకే ఈ గిమ్మిక్కులు అనేవారు కూడా లేకపోలేదు. అంతే కాకుండా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? వచ్చాక చివరాకరి వ్యక్తికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అప్పటికీ హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంకా అధికారంలోనే ఉంటుందా? ఇటువంటి సందేహాలు కూడా పుంఖానుపుంఖాలుగా ప్రజల వైపునుంచి వెలువడుతున్నాయి.

ఈ సందేహాలకు సమాధానాలిచ్చే పరిస్థితుల్లో సదరు నాయకులు లేరన్నది వాస్తవం. ఇప్పుడు వారి దృష్టిమొత్తం ఎన్నికలు, ఓట్లు, అధికారం మాత్రమే. ఇందుకోసం ఆఖరికి ‘కరోనా వ్యాక్సిన్‌’ను కూడా వాడేసుకోవడమే కాస్తంత విచారకరం. సరే ఏదైతే అయ్యింది వ్యాక్సిన్‌ ఉచితంగా వస్తుంది కదా? గమ్మునుందామనుకున్నా.. ఈ సోషల్‌ మీడియా ఉందే.. వదల్దుగాక వదల్దు. నాయకుల హామీల తీరును ఎండగట్టేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp