తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం

By Karthik P Jun. 07, 2021, 07:45 pm IST
తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం

సాధారణ ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. నాయకులు, కార్యకర్తలు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. రాజకీయపరమైన పరిణామాలు చోటు చేసుకునే నియోజకవర్గాలు బహు స్వల్పం. అలాంటి నియోజకవర్గమే మండపేట. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

టీడీపీకి కంచుకోట..

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మండపేట నియోజవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీయే అక్కడ జయకేతనం ఎగురవేసింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఇక్కడ నుంచి హాట్రిక్‌ విజయం సాధించారు. కాపులు, శెట్టిబలిజల జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వేగుళ్ల తన పట్టును నిలుపుకోవడం విశేషం. గత ఎన్నికల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వైసీపీ తరఫున బరిలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా మండపేట టీడీపీ కంచుకోట అని వేగుళ్ల తన విజయంతో చాటారు.

రంగంలోకి తోట త్రిమూర్తులు..

రాబోయే ఎన్నికల్లో మండపేటలో జెండా ఎగురవేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను రంగంలోకి దింపిన వైసీపీ... రాబోయే ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. మండపేట సరిహద్దు నియోజకవర్గమైన రామచంద్రాపురానికి చెందిన తోట త్రిమూర్తులు పలుమార్లు పలు పార్టీల తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా తోట త్రిమూర్తులకు పేరుంది.

Also Read : విశాఖ కార్పొరేషన్ లో పల్లా మాట వినేదెవరు ?

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తోట ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ తరఫునే సిట్టింగ్‌ స్థానం రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. బలమైన నాయకుడు కావడంతో తోటను సాదరంగా ఆహ్వానించిన వైసీపీ.. ఆయనకు అమలాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దాంతోపాటు మండపేట కో ఆర్డినేటర్‌గానూ నియమించింది.

కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే పార్టీ నిర్థేశించిన లక్ష్యం వైపు తోట అడుగులు వేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. కార్యకర్తల్లో జోష్‌ నింపారు. మూడు పర్యాయాలు ఓటమినే చవిచూసిన టీడీపీ వ్యతిరేకవర్గం.. తోట రాకతో ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో.. మూడున్నర దశాబ్ధాల తర్వాత మండపేట మున్సిపాలిటీని టీడీపీ కోల్పోయింది. 30 వార్డులకు గాను 22 వార్డుల్లో గెలిచిన వైసీపీ.. మండపేట మున్సిపాలిటీపై తన జెండాను ఎగురవేసింది. ఈ విజయం మండపేట భవిష్యత్‌ రాజకీయ పరిణామాలకు సూచిక అయింది.

కోట బద్దలవుతుందా..?

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దూకుడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. తోట తన స్పీడును కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఇరువురు పోటాపోటీగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని తోట త్రిమూర్తులు, కాపాడుకోవాలని వేగుళ్ల జోగేశ్వరరావులు పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నారు. మరి 2024లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Also Read : కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp