మున్సిపల్ ఫలితాల తర్వాత మారబోతున్న రాజకీయ సమీకరణాలు

By Raju VS Mar. 07, 2021, 07:36 am IST
మున్సిపల్ ఫలితాల తర్వాత మారబోతున్న రాజకీయ సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 ఎన్నికల ఫలితాలు పెనుమార్పులు తీసుకొచ్చాయి. 4 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీని సుడిగుండంలోకి నెట్టేశాయి. ఆ తర్వాత రెండేళ్లుగా టీడీపీ ఆపసోపాలు పడుతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రతికూలతని ఎదుర్కొంటూ నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం మాత్రమే కాకుండా జనసేన, బీజేపీ కూటమి కట్టినా కోలుకోవాలని చేస్తున్న యత్నాలు కొలిక్కిరాకపోవడం వారిని కలవరపరుస్తోంది.

స్థానిక ఎన్నికల్లో ఏదో మేరకు ఊపిరిపీల్చుకోవాలని ఆశిస్తే సీన్ బూమరాంగ్ అవుతోంది. పల్లెపోరులో తెలిపోయాయి. పార్టీరహిత ఎన్నికలు కాబట్టి తమ శ్రేణులని సంతృప్తి పరిచె లెక్కలతో సరిపెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు మున్సిపల్ సమరం అసలు రంగు తేల్చబోతోంది. సహజంగా పల్లెలతో పోలిస్తే పట్టణ ఓటర్లలో జగన్ కి ఆదరణ కొంతమేర తక్కువే. ఎదురులేదనుకున్న 2019లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో సగం అర్బన్ ప్రాంతంలోనే కావడం గమనార్హం. అలాంటి చోట్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో పాటు ఉపాధ్యాయులు, మధ్యతరగతి ఉద్యోగులు జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని కొందరు అంచనాలు వేస్తున్నారు.

రాజకీయంగా గ్రామాలతో పోలిస్తే తమకు గట్టిపట్టు లేని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ ఎదురీదాల్సి ఉంటుంది. అందులోనూ రెండేళ్ళ జగన్ పాలన పట్ల 80శాతం మందిలో వ్యతిరేకత ఉందని చంద్రబాబు సూత్రీకరణలు చేశారు. అయినా ఇప్పుడు పంచాయతీల్లో సుమారు 80శాతం గెలిచినట్టే పట్టణాల్లో కూడా 80శాతం తమవే అన్నట్టుగా వైస్సార్సీపీ ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేక 4 మున్సిపాలిటీలు ఇప్పటికే అప్పగించింది. మరో అరడజను పైగా పీఠం పాలకపార్టీ కే ఖరారు అయ్యింది. ఇక పోలింగ్ జరుగుతున్న బొబ్బిలి, మండపేట, తాడిపత్రి మున్సిపాలిటీలు, అద్దంకి నగరపంచాయతీ తో పాటు విజయనగరం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే ఏదో మేరకు పోటీ వాతావరణం కనిపిస్తోంది. మిగిలిన అన్ని చోట్లా ఏకపక్షంగా ఫలితాలు అనివార్యంగా అంచనాలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులు, రెబల్స్ మధ్య పోటీ సాగుతుండడం విశేషం.

ఈ ఫలితాలు వెలువడితే టీడీపీ శిబిరంలో మరింత కల్లోలం ఖాయమనే వాదనలున్నాయి. విజయవాడ వంటి చోట్ల తమ ఓటమికి బలహీనపడడం కారణం కాదని, అనైక్యత వల్లనే ఓడిపోయామని చెప్పుకునేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు. టీడీపీ మాత్రమే కాకుండా జనసేన శ్రేణుల్లో మరింత నైరాశ్యం అనివార్యంగా కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఏదో సాధించామని.లెక్కలు చెప్పుకున్నా మున్సిపల్ వార్ లో ఉనికి చాటుకోవడమే గగనం అవుతోంది. దాంతో గతంలో చెప్పిన లెక్కల్లో.మతలబు బయటపడడం, కనీసం ఏపీలో మొఖం కూడా చూపించలేని అధినేత తీరుపై అనుమానాలు బలపడి, అనేకమంది దూరమయ్యే ప్రమాదం పొంచిఉంది.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకివస్తామని చెబుతున్న బీజేపీ పట్టణాల్లో కూడా ప్రభావం చూపలేకపోతే జనంలో మరింత పలుచనయ్యే అవకాశంఉంది. అంతేగాకుండా తమను కాదని అనేకచోట్ల టీడీపీ తో కలిసి సాగుతున్న జనసేన తో స్నేహం మీద ప్రభావం పడబోతోంది. ఏమైనా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారేందుకు ఇవన్నీ దోహదం చేయబోతున్నాయి. ప్రతిపక్షాల శిబిరంలో కొత్త కలకలం చెలరేగేందుకు కారణం కాబోతున్నాయి.

Read Also: బెజవాడ లో మిత్రులు శత్రువులు అయ్యారు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp