కోర్టు ముందుకు కొల్లు రవీంద్ర

By Kotireddy Palukuri Jul. 04, 2020, 10:53 am IST
కోర్టు ముందుకు కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు మరికొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరపర్చనున్నారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నిన్న తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మచిలీపట్నం నుంచి పారిపోయిన కొల్లు రవీంద్ర విశాఖలో తలదాచుకోవాలని ప్లాన్‌ చేశారు. అయితే ఆయన కదలికలను పసిగట్టిన పోలీసులు మఫ్టీలో హైవేపై కాచుకుని పట్టుకున్నారు. రాత్రి గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ నెల 1వ తేదీన మోకా భాస్కర్‌ రావును మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేశారు. కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్ని తో సహా మరో నలుగురును అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం కొల్లు రవీంద్రను కూడా ఈ కేసులో నిందితుడుగా చేర్చారు. రవీంద్ర అరెస్ట్‌తో ఈ హత్య కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి రవీంద్రకు రిమాండ్‌ విధించే అవకాశం ఉంది.

కాగా, రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. అచ్చెం నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడులపై వివిధ అంశాలపై నమోదైన కేసులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అక్రమ కేసులు అంటున్నారు తప్పా వారు ఏమి చేశారనేది మాత్రం చంద్రబాబు తో సహా టీడీపీ నేతలు తమ ప్రకటనల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp