వెండి సింహాల దొంగ దొరికాడు.. టీడీపీ నేతలు ఇప్పుడేమంటారో..?

By Karthik P Jan. 21, 2021, 06:15 am IST
వెండి సింహాల దొంగ దొరికాడు.. టీడీపీ నేతలు ఇప్పుడేమంటారో..?

విజయవాడ దుర్గమ్మ రథానికి ఉండే వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. సింహాల ప్రతిమలను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాటిని కొనుగోలు చేసిన బంగారు వ్యాపారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ పాత నేరస్థుడు సింహాల ప్రతిమలను దొంగిలించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఓ దొంగతనం కేసులో బాలకృష్ణ అనే పాత నేరస్థుడును విచారించగా.. దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమలను తానే అపహరించినట్లు ఒప్పుకున్నారు. దీంతో స్థానిక పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో ప్రతిమలను కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింహాల ప్రతిమలను కొనుగోలు చేసిన వెంటనే కరిగించినట్లు సమాచారం. నిందితుడి అరెస్ట్‌ను ఇంకా పోలీసులు వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అరెస్ట్‌ను చూపించే అవకాశం ఉంది.

వెండి సింహాల ప్రతిమల చోరీపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. ప్రతిమలను అధికార పార్టీ నేతలు, ఆలయ సిబ్బందే అపహరించారని ఆరోపించింది. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించింది. సింహాల ప్రతిమలు మంత్రి ఇంట్లో ఉన్నాయంటూ చౌకబారు ఆరోపణలు చేసింది. కేసు విచారణ జరుగుతున్నా.. అధికార పార్టీని బద్నాం చేసే ప్రయత్నాలు చేసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల చిత్తశుద్ధిని కూడా టీడీపీ శంకించింది. ఇప్పుడు అసలు దొంగ దొరకడంతో.. నాలుక్కరుచుకోవడం టీడీపీ నేతల వంతు కాబోతోంది. దొంగను, ప్రతిమలను కొనుగోలు చేసిన వ్యాపారి అరెస్ట్‌ను చూపి, కేసు వివరాలను పోలీసులు వెల్లడించిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp