మళ్ళీ పట్టాలెక్కిన పోలవరం

By Guest Writer 22-11-2019 06:44 PM
మళ్ళీ పట్టాలెక్కిన పోలవరం

రాష్ట్ర ప్ర‌భుత్వం పిలిచిన రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో పోల‌వ‌రం బ‌హుళార్ధ‌సాధ‌క ప్రాజెక్టు కాంట్రాక్టు ద‌క్కించుకున్న మెగా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) సంస్థ ఎట్ట‌కేల‌కు ప‌లు వివాదాల అనంత‌రం గురువారం ప‌నులు ప్రారంభించింది. తద్వారా ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా న‌వంబ‌రులోనే ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్ట‌గ‌లిగింది.

ఏళ్ళ త‌ర‌బ‌డి పెండింగ్‌లో వుంటూ, ప‌లు వివాదాల‌కు కేంద్రంగా నిలిచిన పోల‌వ‌రం ప్రాజ‌క్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించినా, గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని నెత్తికేసుకుని, త‌న పాల‌న ఐదేళ్ళ‌లో కాంట్రాక్ట‌ర్ల‌ను మారుస్తూ వ‌చ్చింది. తొలుత కోర్టు ద్వారా అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హ‌యాంలో కాంట్రాక్టు ద‌క్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా కొన‌సాగింది. అయితే మంద‌కొడిగా ప‌నులు చేస్తోంద‌నే నెపంతో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ‌ను ప‌క్క‌నపెట్టి, అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు అనుకూలంగా వుండే న‌వ‌యుగ క‌న‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ‌కు ప‌నుల‌ను అప్ప‌గించారు.న‌వ‌యుగ కంపెనీ వ‌చ్చిన త‌ర్వాత కూడా ప‌నుల్లో ప్ర‌గ‌తి ఏమీ క‌న‌బ‌డ‌లేదు. ప్ర‌చారార్భాటం కోసం ప్ర‌తీ సోమ‌వారం పోల‌వరం అంటూ తెగ‌తిరిగిన చంద్ర‌బాబు నాయుడు ప‌నుల వేగ‌వంతం గా జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం కాంక్రీట్ ప‌నులు చేయించిన చంద్ర‌బాబు హ‌యాంలో, ప్ర‌చారానికే కోట్ల రూపాయ‌ల‌కు ఖ‌ర్చ‌య్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ప్ర‌గ‌తి కాన‌రాక‌పోవ‌డ‌మే కాకుండా, అంచ‌నా వ్య‌యాన్ని విప‌రీతంగా పెంచి కేంద్రానికి తెలుగుదేశం ప్ర‌భుత్వం నివేదిక ఇచ్చింది. అయితే, కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌రించిన అంచ‌నాల‌ను అంగీక‌రించ‌క‌పోవ‌డం, మ‌రోవైపు బీజేపీ నాయ‌కులు టీడీపీ అధినేత‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆ ప్ర‌భావం ప్రాజ‌క్టు నిర్మాణంపై ప‌డింది. ఈ నేప‌థ్యంలో అధికారానికి వ‌చ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టు ప‌నుల్లో అవినీతి జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప‌రిస్థితిలో ప్రాజెక్టు వ్య‌యం త‌గ్గించాల్సిన అవ‌స‌రం కూడా వుంద‌ని, టీడీపీ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికి త‌మ ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని అవ‌లంబిస్తుంద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో, అధికారులు గ‌త రెండు నెల‌ల క్రితం కొత్త‌గా టెండ‌ర్లు పిలిచారు.

ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్ లో మెగా కంపెనీ ఒక్క‌టే బిడ్ దాఖలు చేయ‌డంతో ప్ర‌భుత్వం ఆ సంస్థ‌కు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు అప్ప‌గించింది. ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వ‌రా 758 కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వానికి ఆదా అయ్యాయ‌ని ఇరిగేష‌న్ అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే, త‌మ కంట్రాక్ట్ ర‌ద్దుచేయ‌డంపై న‌వ‌యుగ కంపెనీ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న మేఘా సంస్థ ప‌నుల‌ను ప్రారంభించ‌డంలో ఆటంకం ఏర్ప‌డింది. హైకోర్టు స్టే మంజూరు చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మేఘా సంస్థ గ‌త సోమ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు భూమిపూజ చేసింది. గురువారం పోలవరం ప్రాజెక్టులో మెగా కంపెనీ ప్రతినిధులు, ఇంజనీర్లు కాంక్రీట్ పనులను ఉదయం 11 గంటలకు సాంప్రదాయబద్దంగా పూజలు చేసి ప్రారంభించారు. ఈనెల 1వ తేదీన ప్రాజెక్టులో పనులు చేయడం ప్రారంభించడానికి సమాయుత్తమైన మెగా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు లో పనిచేసిన కార్మికులు ,సబ్ కాంట్రాక్టర్లు తమకు రావలసిన బకాయిలు కోసం ఆందోళన చేయడంతో తాత్కాలికంగా పనులు నిలిపి వేశారు. అయితే కార్మికులు గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టు చెక్ పోస్ట్ వద్ద దీక్షలు ప్రారంభించడంతో నవయుగ కంపెనీ కార్మికులతో చర్చలు జరిపి దీక్షలను విరమింప చేశారు. దీంతో మెగా కంపెనీ పనులు చేయడానికి మార్గం సుగమం కావడంతో ప్రాజెక్టులో పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్పిల్ వేలో ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద కాంక్రీట్ పనులు లాంఛనంగా ప్రారంభించారు.

ప్రాజెక్టు స్పిల్‌వే ప్రాంతంలో గురువారం ఉద‌యం ఈ సంస్థ కాంక్రీట్ ప‌నుల‌ను ప్రారంభించింది. తొలిరోజు వంద క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నుల‌ను స్పిల్‌వే వ‌ద్ద ఒక‌ట‌వ బ్లాక్‌లో బ్యాక్‌ఫిల్లింగ్ కాంక్రీట్ ప‌నుల‌ను చేసింది. రోజుకు రెండు వేల క్యూబిక్ మీట‌ర్ల ప‌నులు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు మేఘా కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. అలాగే రాక్‌ఫిల్ డ్యాంలో 1.50 కోట్ల క్యూబిక్ మీట‌ర్ల ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది.ఇది కాకుండా కాఫ‌ర్‌డామ్ ప‌నుల‌ను కూడా పూర్తి చేస్తామ‌ని సంస్థ అధికారులు ప్ర‌క‌టించారు. రాక్‌ఫిల్‌డామ్‌లో కోటీ 50 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌నుల‌ను 2021 జూన్ నాటికి పూర్తి చే్స్తామ‌ని మెగా కంపెనీ జనరల్ మేనేజర్ ఏ సతీష్ బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది జూన్ నాటికి స్పిల్‌వే ప‌నులు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజ‌క్టు సూప‌రింటెండింగ్ ఇంజనీర్ నాగిరెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మ‌రో ప‌దిరోజుల్లో పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌నులు జోరుగా జ‌రిగేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని చెప్పారు.ఈ కార్యక్రమంలో మెగా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ పి మురళి ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఠాగూర్, జలవనరుల శాఖ ఎస్ఇ ఎం నాగిరెడ్డి, ఇఇ లు ఏసుబాబు, బాలకృష్ణ , జలవనరుల శాఖ ఇంజనీర్లు, మెగా కంపెనీ ఇంజినీర్లు పాల్గొన్నారు.
Written by: Ramachandra Sharma

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News