క‌రోనాకి బ‌లైపోయిన క‌వి

By G.R Maharshi May. 06, 2021, 05:03 pm IST
క‌రోనాకి బ‌లైపోయిన క‌వి

ఈ ఫొటోలో క‌నిపించే వ్య‌క్తి ఎర్ర‌గుడి రామాంజ‌నేయ‌రెడ్డి. SK.యూనివ‌ర్సిటీలో నా క్లాస్‌మేట్‌. క‌విత్వం అంటే ఇష్టం. క‌థా ర‌చ‌యిత కూడా. అన్నిటికి మించి వ్య‌వ‌సాయ‌మంటే ప్రాణం. పులివెందుల నివాసి. మృధు స్వ‌భావం. టీచ‌ర్‌గా చేస్తూ పొలంలో విశ్రాంతి తీసుకునేవాడు. ఇద్ద‌రు పిల్ల‌లు. వారం రోజుల క్రితం కూడా ఆయ‌న‌ది ప్ర‌శాంత జీవితం. ఇపుడు లేడు. క‌రోనా తీసుకెళ్లిపోయింది. ల‌క్ష‌లు క‌ట్టి, ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో శ‌వాన్ని తెచ్చుకున్నారు. బంధువులు కూడా అంత్య‌క్రియ‌ల‌కి వెళ్ల‌లేని స్థితి.
ప్రభాక‌ర్‌నాయుడు ఆంధ్ర‌జ్యోతి రిటైర్డ్ జ‌ర్న‌లిస్ట్‌. ఆయ‌న‌తో 32 ఏళ్ల స్నేహం. అనంత‌పురంలో వుంటాడు. గ‌త సోమ‌వారం ఆయ‌న అన్న హైద‌రాబాద్‌లో క‌రోనాతో చ‌నిపోయాడు, మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న భార్య అనంత‌పురంలో చ‌నిపోయారు. రెండు రోజుల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల్ని పోగొట్టుకున్నాడు. బెంగ‌ళూరులో వున్న కూతురు త‌ల్లిని ఆఖ‌రిసారి చూడ‌లేక పోయింది. మా ఇంటికి అర‌కిలోమీట‌ర్ దూరంలో అంత్య‌క్రియ‌లు జ‌రిగినా వెళ్లలేని నిస్స‌హాయ స్థితి నాది.

హిందూపురం ద‌గ్గ‌ర ఓ టీచ‌ర్ కుటుంబం. ప‌ది రోజుల క్రితం ఆ ఇంట్లో పెళ్లి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల‌లో కూతురి పెళ్లి. చెల్లెలి పెళ్లి షాపింగ్ కోసం చెన్నై నుంచి అన్న వ‌చ్చాడు. అక్క‌డ ఆయ‌న ఇంజ‌నీర్‌. క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరాడు. త‌ల్లితండ్రికి కూడా వ‌చ్చింది. కొడుకు చ‌నిపోయాడు. ఆస్ప‌త్రిలో వున్న తండ్రికి తెలియ‌దు. ఆయ‌న కూడా చ‌నిపోయాడు. కొడుకు, భ‌ర్త చ‌నిపోయార‌ని త‌ల్లికి తెలియ‌దు. పెళ్లి కూతురు కావాల్సిన పిల్ల‌, ప‌గ‌లూరాత్రీ ఏడుస్తూ వుంది. క‌న్నీళ్లు తుడ‌వ‌డానికి కూడా ఎవ‌రూ లేరు. క‌రోనా భ‌యం.

ఫ‌స్ట్ వేవ్ మ‌న‌తో ద‌య‌గా వుంది. మ‌న‌కే అర్థం కాలేదు. సెకెండ్ వేవ్ క్రూరంగా వుంది. ప్ర‌తి ఒక్క‌రూ స్నేహితుల్ని , కుటుంబ స‌భ్యుల్ని , తోటి ఉద్యోగుల్ని పోగొట్టుకుంటున్నారు. మ‌న ప్రాణాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి. ఎవ‌రూ కాపాడ‌రు. గంట‌లు, చ‌ప్ప‌ట్లు కొడితే క‌రోనా పోతుంద‌నే పాల‌కుల చేతిలో వున్నాం, జాగ్ర‌త్త‌!
మృత్యువు ఎక్క‌డో లేదు. ప‌రిస‌రాల్లోనే వుంది. వాస‌న ప‌ట్టండి. వాస‌న రాక‌పోతే మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తోంద‌ని అర్థం. దాని చూపు మ‌న‌మీద ప‌డ‌కుండా ఒళ్లంతా క‌ళ్లు చేసుకుని వుండండి. వేరే దారి లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp