వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

By Srinivas Racharla Sep. 20, 2020, 04:34 pm IST
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో దాదాపు 60 శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ నేపథ్యంలో సెప్టెంబరు 23న కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.

ఢిల్లీ, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరపననున్నారు.ఈ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు,పరీక్షల తీరు,రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఒక్క సెప్టెంబర్ నెలలోనే 16,86,769 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జులై మధ్యలో 7.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 10.58 శాతానికి చేరింది.గత నెలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో కరోనా టెస్టుల సంఖ్య రెట్టింపయ్యింది.గడిచిన 24 గంటలలో 12 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. కాగా కరోనా సోకిన వారి సంఖ్య పెరిగినప్పటికీ.. మరణాలు రేటు తగ్గడం,రికవరీ రేటు 79.28 కి పెరగడం సానుకూలాంశం.

ఇక భారత్‌లో కొద్దిరోజులుగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 90 వేలకు పైగా నమోదవుతుంది.నిన్న ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో 12,06,806 శాంపిల్స్ పరీక్షించడంతో 92,605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 54,00,619కి చేరింది.వైరస్ నుండి 43,03,043 మంది కోలుకోగా, కరోనా వలన 86,752 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటి ఉదయానికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10,10,824 గా నమోదయింది. ఇప్పటి వరకు 6 కోట్ల 36 లక్షల 61,060 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆగస్టు 11న చివరి సారిగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎంలతో మాట్లాడారు.ఆనాడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, యూపీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వ్యాప్తి నియంత్రణపై చర్చించారు.నాటి సమావేశంలో ఈ పది రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తే మనం విజయం సాధించినట్లేనని ప్రధాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇకమీదట రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటుతుందనే నిపుణులు హెచ్చరికల మధ్య మరోసారి సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ సమావేశం కావడం ఆసక్తికర పరిణామం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp