బోర్డ‌ర్ లో గాయ‌ప‌డిన సైనికుల‌ను ప‌రామ‌ర్శించిన మోడీ

By Kalyan.S Jul. 03, 2020, 09:01 pm IST
బోర్డ‌ర్ లో గాయ‌ప‌డిన సైనికుల‌ను ప‌రామ‌ర్శించిన మోడీ

లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వద్ద జూన్ 15న చైనాతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణలో తెలంగాణ‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు వీర మ‌ర‌ణం పొందిన విష‌యం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కొంత మంది గాయ‌ప‌డ్డారు. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. భుజం త‌ట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

నాటి ఘటన గురించిన వివ‌రాల‌ను నేరుగా సైనికులను అడిగి తెలుసుకున్నారు. అంత‌కు ముందు చైనాతో ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షించేందుకు లడక్ ఉమ్మడి రాజధాని లెహ్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేసిన ఆయ‌న లడక్‌లోని నీమూలో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశం కోసం గాల్వాన్ లోయలో ప్రాణాలర్పించిన అమర జవానులకు మరోసారి ఘన నివాళులు తెలియజేస్తున్నానని అన్నారు. సైనికుల సాహసం వారు విధులు నిర్వహిస్తున్న ఎత్తైన ప్రాంతాల కంటే సమున్నతమని మోదీ కొనియాడారు.

సైనికుల సాహసాలు, చూపుతున్న శౌర్యప్రతాపాలతో స్వయం సమృద్ధ భారత్‌ మరింత పటిష్టమవుతుందని అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది.. కానీ రెచ్చగొడితే ఊరుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. తప్పని సరి అయితే దెబ్బకు దెబ్బ సమాధానం చెబుదామ‌ని అన్నారు. చైనాను పరోక్షంగా హెచ్చరించారు. సైనికుల త్యాగాలు వృథా కావ‌ని అన్నారు.

నాటి ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చ‌నిపోయారు. కానీ.. ఆ దేశం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. సుమారు 40 మందికిపైగానే చ‌నిపోయార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఓ వైపు చ‌ర్చ‌లు జ‌రుపుతూనే.. మ‌రోవైపు.. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను మోహరించాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp