ఈ చెప్పుల కథేంది ఉద్ధవ్ సాబ్?

By Ritwika Ram Jun. 21, 2021, 09:00 am IST
ఈ చెప్పుల కథేంది ఉద్ధవ్ సాబ్?

‘‘సజాతి దృవాలు వికర్షించుకుంటాయి.. విజాతి దృవాలు ఆకర్షించుకుంటాయి..’’ అని ఫిజిక్స్ చెబుతుంది. మహారాష్ట్రలో రెండేళ్ల కిందట ఈ విషయాన్ని అక్షరాలా నిజం చేశాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్. ఈ భిన్న దృవాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ మొదటి నుంచి ఉన్న ‘వికర్షణ’ స్వభావాన్ని మాత్రం వదులుకోలేకపోయాయి. అందుకే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. రానురాను ముసుగులో గుద్దులాటలు ఎక్కువయ్యాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణలు.

మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ గురించి అప్పుడే అక్కడ మాటలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ లీడర్లు ప్రకటనలు చేస్తుంటే.. బీజేపీతో కలిసిపోదామని తమ అధినేతను శివసేన లీడర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ప్రజల అవసరాలను తీర్చకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి వెళ్తే ప్రజలు చెప్పులతో కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలకు తోడు.. కాంగ్రెస్ ను ఉద్దేశించి పరోక్షంగా ఉద్ధవ్ చేసిన కామెంట్లు చర్చకు దారి తీశాయి. కూటమి లేకుండా పోటీ చేయొచ్చని ఎవరైనా పిలుపునివ్వొచ్చని, అధికారం కోసం శివసేన తాపత్రయ పడదని చెప్పారు. ఇతర పార్టీల బరువును ఎత్తుకోదని.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఇంతకీ ఏం జరుగుతోంది..

బీజేపీకి శివసేన దగ్గర అవుతోందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీనే టాప్ లీడర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పొగడటం, తర్వాత మోడీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి శివసేన పత్రిక సామ్నాలో రాసుకొచ్చిన సంజయ్ రౌత్.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటోందట.. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయని బాంబు పేల్చారు. దీంతో మధ్యలో ఎన్సీపీ అధినేత చిక్కుల్లో పడ్డారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి అంతా సర్దుమణిగేలా చేశారు.

కానీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం ‘సింగిల్ గా పోటీ’ గురించి మాట్లాడుతున్నారు. ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ప్రచార బాధ్యతల దగ్గరి నుంచి ఎన్నికల వ్యవహారాల దాకా అన్నింటినీ నేనే చూసుకుంటా’’ అని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అనడం అగ్నికి ఆజ్యం పోసింది. పైగా మహారాష్ట్రలో ఏర్పడ్డ కూటమి కేవలం ఐదేళ్లకేనని, శాశ్వతంగా ఉండదని చెప్పారు. దీంతో దీనిపై స్పందిస్తూ..జనం చెప్పులతో కొడతారంటూ ఉద్ధవ్ ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో శివసేనను బలహీన పరచేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నాయంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఆరోపించారు. ప్రధాని మోడీకి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర కావాలని అన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ తమ సొంత సీఎంలు రావాలని కోరుకుంటున్నాయని చెప్పారు. ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని, శివసేన లీడర్లను చీల్చాలని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో శివసేన, బీజేపీ తిరిగి కలిస్తే పార్టీకి, కార్యకర్తలకు మంచిదని సూచించారు.

బీజేపీ పుల్లలు పెడుతోందా?

ఐదేళ్లుగా దేశంలో రాజకీయ పరిణామాలను ఒకసారి గమనిస్తే.. మహారాష్ట్రలో బీజేపీ పుల్లలు పెడుతోందా? అనే అనుమానం కలుగుతుంది. నిజానికి గతంలోనే శివసేనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయింది. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని నెలల తర్వాత శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. పొద్దున సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. అర్ధరాత్రి వేళ బీజేపీ షాక్ ఇచ్చింది. ఎన్సీపీ లీడర్, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ను తమవైపు తిప్పుకుంది. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. కానీ శరద్ పవార్ చాణక్యం ముందు అవేమీ నడవలేదు. తర్వాత ఎట్టకేలకు ఉద్ధవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది.

అంతకుముందు కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ అంతర్గత గొడవలు సృష్టించింది. తర్వాత కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి యడ్యూరప్పతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత మధ్యప్రదేశ్ లో ఇదే ప్లాన్ అమలు చేసింది. ముందు విభేదాలు వచ్చేలా చేసి, తర్వాత ఎంపీ జ్యోతిరాధిత్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కుంది. రాజస్తాన్ లో ఇలానే ప్రయత్నం చేసినా.. అశోక్ గెహ్లాట్ తిప్పికొట్టారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత గొడవలు మొదలయ్యాయి. ఇవి అభిప్రాయ భేదాలుగానే మిగులుతాయో? లేక ప్రభుత్వాన్నే కూలుస్తాయో?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp