అమరావతి పింఛన్లను పంచుకుతిన్న తమ్ముళ్లు

By Uday Srinivas JM Feb. 21, 2020, 07:52 am IST
అమరావతి పింఛన్లను పంచుకుతిన్న తమ్ముళ్లు

దోపిడీకేదీ అనర్హం కాదన్నట్లుగా అమరావతి కేంద్రం సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రాజధాని ప్రకటనకు ముందు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దగ్గర నుంచి, అసైన్డు భూములు, లంక భూములు, గ్రామ కంఠాలు.. ఇలా అన్నింట్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఓ చేయి వేసి అందినకాడికి ఆరగించారు. పై స్థాయిలో అలా ఉంటే కింది స్థాయిలో మేమేమి తక్కువ కాదన్నట్లుగా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. అవకాశాలు కల్పించుకొని మరీ తమ జేబులు నింపుకున్నారు. తాజాగా అమరావతిలో పింఛన్లను పంచుకుతిన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.

రాజధానిలో 15 ఎకరాల పొలాలున్న వారికీ పింఛన్లు..
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత భూసమీకరణ గ్రామాల్లో భూమి లేని పేదలకు, రైతు కూలీలను ఆదుకునేందుకుగాను నెలకు రూ. 2,500 చొప్పున పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులను గుర్తించేందుకు జన్మభూమి కమిటీలు, సీఆర్‌డీఏ కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో అందరూ టీడీపీ కార్యకర్తలే ఉంటారన్న విషయం వేరే చెప్పాల్సిన పనిలేదు. ముందుగా ఆయా కమిటీల్లోనూ సభ్యులందరూ తమ కుటుంబ సభ్యుల పేరిట పింఛన్లు తీసుకున్నారు. తర్వాత డబ్బు తీసుకొని అనర్హులకు పింఛన్లను మంజూరు చేయించారు. గ్రామాల్లో 15 ఎకరాల పొలాలు, డూప్లెక్స్‌ ఇళ్లు ఉన్న వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారు. ఈ దోపిడీ విచ్చలవిడిగా సాగింది. ఒక్క నిడమర్రు గ్రామంలో దాదాపు 1200 మందికి పింఛన్లు మంజూరు చేస్తుంటే.. ఇందులో 500కు పైగా పింఛన్లు పక్కదారిపట్టినట్లు అధికారులు తేల్చారు. దీంతో మిగతా అన్ని గ్రామాల్లోనూ విచారణ వేగవంతం చేశారు.

ఆర్కే లేఖతో దోపిడీ వెలుగులోకి..
అమరావతి కేంద్రంగా సాగిన దోపిడీని మొదటి నుంచీ ఎండగడుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై విచారణ చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీకాంతానికి లేఖ రాశారు. నిజమైన అర్హులను గుర్తించాలని తాడేపల్లి, మంగళగిరి, ఉండవల్లి, తుళ్లూరు మండలాల రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఆ మేరకు విచారణ చేస్తుండగా ఈ పింఛన్ల దోపిడీ పర్వం బయటపడింది. రెండు మూడేళ్లుగా పింఛన్లను తీసుకుంటున్న అనర్హుల నుంచి సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp