కొత్త దంపతులకు జగన్ సర్కార్ శుభవార్త

By Kotireddy Palukuri Feb. 19, 2020, 09:06 am IST
కొత్త దంపతులకు జగన్ సర్కార్ శుభవార్త

పేదింటి యువతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పెళ్లి కానుకల కోసం నిధులు విడుదల చేసింది.. త్వరలోనే ఈ డబ్బు అకౌంట్లలో జమకానున్నాయి. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తర్వాత అర్హత సాధించిన వారికి నగదు జమ అవుతుంది.

కాగా, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్‌ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్నిపెంచింది.. వైఎస్సార్‌ పెళ్లి కానుకగా అందజేసేందుకు సిద్ధమయ్యింది. పెంచిన పెళ్లి కానుకను శ్రీరామ నవమి నుంచి అమలు చేయనుంది.

గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద అందజేశారు. పెంచిన ప్రోత్సాహకం ప్రకారం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వారందరికీ లక్ష రూపాయలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను ఇప్పుడు రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు.. కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు.. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు.

భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను కూడా జగన్ సర్కార్ పెంచింది. రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు.

ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు కుటంబాలకు సాయం చేస్తున్నా.. అవగాహన లోపంతో వారు సాయానికి దూరమవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డు వచ్చిన వారు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp