పెగాసస్‌ కేంద్రం మెడకు చుట్టుకోబోతోందా..?సుప్రీం ఇంట్రీమ్ ఆర్డర్ ?

By Karthik P Sep. 13, 2021, 09:00 pm IST
పెగాసస్‌ కేంద్రం మెడకు చుట్టుకోబోతోందా..?సుప్రీం ఇంట్రీమ్ ఆర్డర్ ?

పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహరం కేంద్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతోందా..? పెగాసస్‌ స్పైవేర్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, ప్రముఖల ఫోన్లను ట్యాప్‌ చేసిందనే ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం వెళ్లివెత్తిన నేపథ్యంలో.. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు సుప్రిం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ రోజు మరోసారి విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం..కీలక వ్యాఖ్యలు చేసింది. కారణాలు ఏమైనా.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేందుకు ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో తామే మధ్యంత ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో ఆలోచించి రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని సీజేఐ తెలిపారు.

దేశ భద్రతకు సంబంధించిన విషయంలో పూర్తి వివరాలు వెల్లడించడం మంచిది కాదనే ఉద్దేశంతోనే కోర్టుకు వివరించలేమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పెగాసస్ ను ఉపయోగించామా లేదా అన్నది బహిరంగంగా చర్చించే అంశం కాదన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తే టెర్రరిస్టులు యాంటీ సాఫ్ట్ వేర్ ను రూపొందించే అవకాశముందన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఇప్పటికే ఈ అంశంపై సమర్పించిన అఫడివిట్ సరిపోతుందన్నారు. పెగాసస్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ అన్ని ఆరోపణులను పరిశీలించి కోర్టుకు వివరిస్తుందని తుషార్ మెహతా తెలిపారు.

Also Read : కాంగ్రెస్ లో చక్రం తిప్పిన మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

పిటిషనర్ల తరఫున కపిల్‌ సిబల్, శ్యామ్‌ దివాస్, రాకేష్‌ ద్వివేది, దినేష్‌ ద్వివేదిలు వాదించారు. ఇజ్రాయెల్‌ నుంచి పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని మరోమారు విన్నవించారు.

ది వైర్, వాషింగ్టన్‌ పోస్టు వంటి వార్తా సంస్థలు పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందనే కథనాలు రాయడంతో.. ఈ విషయంపై దుమారం రేగింది. నిఘా జాబితాలో జర్నలిస్టులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్, వివిధ రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, సుప్రిం కోర్టు న్యాయమూర్తి, సుప్రిం కోర్టు ముఖ్య సిబ్బంది, వ్యాపార వేత్తలు ఉన్నారని పలుమార్లు కథనాలు రాశాయి.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ముందు రోజు పెగాసస్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి పెగాసస్‌ నిఘానే కారణమని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధాని లోక్‌సభలో ప్రకటన చేయాలని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేశాయి. కేంద్రం మాత్రం మౌనాన్నే అశ్రయించింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పలువురు విచారణ జరిపించాలని సుప్రింలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించని నేపథ్యంలో.. సుప్రిం జారీ చేయబోయే మధ్యంతర ఉత్తర్వులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read : బీజేపీలో ఏం జ‌రుగుతోంది..? ఆరు నెల‌ల్లో నలుగురు సీఎంల మార్పు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp