పవన్‌ పూర్వ హామీనే పునరుద్ఘాటిస్తారా..?

By Kotireddy Palukuri Feb. 15, 2020, 10:55 am IST
పవన్‌ పూర్వ హామీనే పునరుద్ఘాటిస్తారా..?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ రోజు శనివారం రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 60 రోజులుగా అమరావతి ప్రాంతంలోని ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తుళ్లూరులో రైతులతో సమావేశమైన పవన్‌ కళ్యాణ్‌ వారికి గట్టి భరోసా ఇచ్చారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, రాసిపెట్టుకోండంటూ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పడిపోతుందని జోస్యం చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత బీజేపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టినా.. వాటన్నింటినీ కలిపి మళ్లీ ఒకే రాజధాని చేస్తామని తనదైన శైలిలో మాట్లాడారు.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఈ రోజు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు..? రైతులకు ఏ హామీ ఇస్తారు..? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో తాను చేయగలననే ధైర్యంతో.. జనసేనాని.. ‘‘అమరావతే రాజధానిగా ఉంటుంది. రాసిపెట్టుకోండి’’ అని చెప్పారని పరిశీలకులు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఇచ్చిన హామీనే పునరుద్ఘాటిస్తారా..? లేక మరేదైనా కొత్త హామీ ఇస్తారా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp